నకిలీ విత్తనాల బెడద!

ABN , First Publish Date - 2022-07-06T03:22:27+05:30 IST

వరి పంటకు సరైన గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడి ప్రత్యామ్నయంగా సజ్జ సాగుతోనైనా ఆర్థిక వెసులుబాటు పొందాలని భావించిన రైతులకు నకిలీ విత్తనాల బెడద తగిలింది.

నకిలీ విత్తనాల బెడద!
విత్తనాలు మొలకెత్తని పొలం

130 ఎకరాల్లో మొలకెత్తని సజ్జ

లబోదిబోమంటున్న రైతులు

అనంతసాగరం, జూలై 5: వరి పంటకు సరైన గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడి ప్రత్యామ్నయంగా సజ్జ సాగుతోనైనా ఆర్థిక వెసులుబాటు పొందాలని భావించిన రైతులకు నకిలీ విత్తనాల బెడద తగిలింది. బాధిత రైతుల కథనం మేరకు.. అనంతసాగరం మండలం కమ్మవారిపల్లి గ్రామంలో సుమారు 130 ఎకరాల్లో సజ్జ సాగుకు రైతులు సిద్ధమయ్యారు. కడప జిల్లా బద్వేల్‌లోని ధనలక్ష్మీ సీడ్స్‌ అండ్‌ పెస్టిసైడ్స్‌ దుకాణం నుంచి నవయుగ సీడ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ వారి పూజ రకం సజ్జ విత్తనాలు ప్యాకెట్‌ రూ.350 వంతున కొనుగోలు చేసి పొల్లాలో చల్లారు. అయితే పది రోజులు దాటినా పొలాల్లో మొలకలు రాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సహజంగా సజ్జలో విత్తనాలు చల్లిన మూడవ రోజు నుంచి మొలకలు వస్తాయి. దీంతో వేల రూపాయలు తీసుకొని నాసిరకపు విత్తనాలు తమకు ఇచ్చినట్లు వారు ఆవేదన చెందుతున్నారు. విత్తనాలు సరఫరా చేసిన కంపెనీ వారికి ఫోన్‌ చేసి సమస్య తెలిపితే స్పందించడం లేదని రైతులు వాపోయారు. సజ్జ సాగుకు ఎకరాకు రూ.5వేలు చొప్పున ఖర్చు చేసి నష్టపోయామని ఆందోళన చెందుతున్నారు. ఈ మేరకు భాదిత రైతులు మండల వ ్యవసాయ అధికారికి ఫిర్యాదు చేశారు.

నష్టపరిహారం ఇప్పించాలి

పూజ సీడ్స్‌ విత్తనాలు గత నెల 22వ తేదీన పొలంలో చల్లాము. ఇంత వరకు మొలకలు రాలేదు. నాసిరకపు విత్తనాలు మాకు అంటగట్టారు. ప్యాకెట్‌ రూ.350 చొప్పున కొనుగోలు చేశాం. విత్తనాలు సరఫరా చేసిన కంపెనీపై విచారణ జరిపి మాకు పరిహారం ఇప్పించాలి.

- ఏ.ప్రభాకర్‌రెడ్డి, డి రఘరామిరెడ్డి, రైతులు, కమ్మవారిపల్లి

Updated Date - 2022-07-06T03:22:27+05:30 IST