స్వాతంత్య్ర కాలం నుంచీ అదే పరుగు!

ABN , First Publish Date - 2022-01-24T09:19:38+05:30 IST

శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి 1947లో, అంటే దాదాపుగా 75 ఏళ్ల క్రితం ‘గుర్రప్పందాలు’ అని నిరుద్యోగం మీద ఒక కథ రాశారు.

స్వాతంత్య్ర కాలం నుంచీ అదే పరుగు!

శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి 1947లో, అంటే దాదాపుగా 75 ఏళ్ల క్రితం ‘గుర్రప్పందాలు’ అని నిరుద్యోగం మీద ఒక కథ రాశారు. చదువులూ, విద్యాసంస్థలూ, వసతులూ అతిపరిమితంగా వున్న ఆ రోజుల్లోనే నిరుద్యోగం ఎంత దారుణంగా వుందో ఈ కథ చెపుతుంది. విషాదం ఏమంటే, ఆ రోజుల్లో వుద్యోగం లేక, బతకలేక ఎవరూ ఆత్మహత్యలకి పాల్పడిన దాఖలా లేదు. స్వతంత్ర భారతంలో ఇవ్వాళ అత్యున్నత సాంకేతిక విద్యలు అభ్యసించినా ఉద్యోగాలు దొరక్క బలవన్మరణాల పాలవుతున్నవాళ్లెతందరో.


‘గుర్రప్పందాలు’ కథ సరదాగా సాగుతూనే కఠోర వాస్తవాల్ని కళ్లకి కడుతుంది. ఒక కంపెనీలో గుమాస్తాగిరి ఖాళీ ఒకటి పడుతుంది. ఆ ఉద్యోగానికి గోపాలశాస్త్రీ, వాళ్ళ బావ చలపతి రావు ఇద్దరూ దరఖాస్తు చేసుకున్నారు. చలపతిది శ్రీకాకుళం. ఉద్యోగం విషయమై పెద్ద దొరతో మాట్లాడటానికి శ్రీకాకుళం నించి చెన్నపట్నం రెయిల్లో వెళుతూ భార్య సుందరమ్మని ఆమె పుట్టిల్లు రాజమహేంద్రవరంలో దింపుతాడు. సుందరమ్మని చూసి వదిన కామేశ్వరి ఆనంది స్తుంది. వదినా, మరదలు ఆప్యాయంగానూ మాట్లాడుకుంటారు. మాటల్లో అన్నయ్యకి వుద్యోగం లేదని సుందరమ్మకి తెలుస్తుంది. ఇందుకు బాధపడుతుంది. ఇంతలో బయటనించి అన్నయ్య వస్తాడు. అన్నాచెల్లెలూ కుశల ప్రశ్నలతో ఆత్మీయంగా మాట్లాడుకుంటూ, వుద్యోగ ప్రయ త్నాలు ఏవైనా చేస్తున్నావా అని అడుగుతుంది. అతను ‘‘మిస్టేకు అండు ప్రెస్టీజు కంపెనీ’’లో గుమస్తాగిరికి దరఖాస్తు చేసిన విషయం చెపుతాడు. అప్పటి వరకూ అభిమానంగా వున్న సుందరమ్మ తన భర్త దరఖాస్తు చేసిన వుద్యోగానికి అన్న కూడా దరఖాస్తు చేయడంతో భర్తకి పోటీ అని అన్న మీద కోపం, ద్వేషం ఏర్పరుచుకుంటుంది. వదిన మీద కూడా ఏహ్య భావం ఏర్పడుతుంది. 


చెన్నపట్నం వెళ్ళిన చలపతిరావు పెద్దదొరగారికి ఈ వుద్యోగంతో సంబంధం లేదనీ, స్థానిక దొర గారిదే నిర్ణయా ధికారం అని తెలుసుకుని తిరుగుముఖం పట్టి అత్తగారింటికి భార్య దగ్గరకి వస్తాడు. ఆ ఉద్యోగానికి 250మంది హాజరవు తారు. కంపెనీ ఆవరణ అంతా దరఖా స్తుదారులతో కిక్కిరిసిపోయింది. ఆనాడు చెన్నపట్నం రాజధానిగాగల ఆంధ్రప్రాం తంలోని అన్ని జిల్లాల నుంచి నిరుద్యో గులు తరలివచ్చారు. ఆనర్స్‌ అయిన వాళ్ళూ, ఎంఎస్‌సీ, ఎంఏబిఎల్‌, డబుల్‌ ఎంఏలూ, యూనివర్సిటీ ఫస్టూ, కాలేజీ ఫస్టూ వచ్చినవాళ్ళూ- చాలామంది వున్నారు. నెలకి 50రూపాయల జీతమూ, ఏడాదికి రెండు రూపాయల ప్రమోషనూ!  


విజాతీయుడైన చిన్నదొర వచ్చి పోర్టికోలో కొలువు తీరాడు. మేనేజర్‌ వచ్చి పక్కన నిలబడ్డాడు. చిన్నదొరగారి ఆజ్ఞ మీద మేనేజర్‌ అభ్యర్థులతో ‘‘ఈ ఉద్యోగానికి 250మంది వచ్చారు. ఇంతమందిలో ఒకర్ని ఎంపిక చేయడం అసాధ్యంగా తోస్తోంది. కనుక మీలో ఎవరైనా వచ్చి ఒకర్ని ఎంపిక చేయండి. మేం సర్వాత్మనూ శిరసావహిస్తాం. మీ ఎంపికకు కారణాలూ అడగబోం!’’ అన్నాడు. ఎవరూ ముందుకి రాలేదు. తనే ఎంపిక కావాలని అందరికీ కోరికాయె! ఇక వడబోత మొదలు. ‘‘స్కూల్‌ ఫైనల్‌ తేరినవారు కావాలని మేం ప్రకటనలో స్పష్ట పరిచాం. కానీ, పెద్ద డిగ్రీలు వున్నవాళ్ళు కూడా వచ్చారు. మేం యూనివర్సిటీల్ని గౌరవిస్తాం. కనుక యూనివర్సిటీల్లో చదివినవారు మినహా మిగిలినవాళ్ళు వెళ్ళిపోవచ్చు!’’ అన్నాడు. ఈ చిన్న పదవి కోసం తమతో పోటీకి వచ్చిన డిగ్రీ వున్న వాళ్ళని పడతిట్టి 33మంది వెళ్ళిపోయారు. రెండవ వడపోతగా మేథమేటిక్స్‌ గ్రాడ్యుయేట్స్‌ వుండి తక్కినవాళ్ళని వెళ్ళిపొమ్మంటాడు. చాలామంది కదలరు. బిళ్ళ బంట్రోతు వచ్చి నెట్టే ప్రయత్నం చేయడంతో వెళ్ళిపోతారు. మూడవ వడపోత: చెన్నపట్నం, బొంబాయి, కలకత్తా ప్రెసిడెన్సీలలో తమకి బ్రాంచీలు ఉన్నా యనీ, బర్మాలోనూ, సిలోన్‌లోనూ బ్రాంచీలు ప్రారంభించబో తున్నామనీ, వీటిలో ఏ బ్రాంచికి వెళ్ళమన్నా, నించున్న పాటున వెళ్ళేవాడయి వుండాలంటాడు. ‘‘ఈ మాత్రం భాగ్యానికి బదిలీలు కూడానా?’’ అని 59మంది చెడతిడుతూ వెళ్ళిపోయారు. ఒక బిఎల్‌ అయితే, ‘‘మీ ప్రకటనలో ఈ షరతు లేదు. మాలో ఎవడైనా ఈ షరతు మీద దావా పడేస్తే యూరపు వెళ్ళి తిరిగి చూడాలి నువ్వు!’’ అని దొరని తిడుతూ వెళ్ళిపోయాడు. 


నాలుగవ వడపోతగా భార్యని పోషించవలసిన బాధ్యత భర్తకివుందనీ, కనుక పెళ్ళయినవాళ్ళు వుండి బ్రహ్మచారులు వెళ్ళొచ్చు అంటాడు. దాంతో 23 కంఠాలు ఖంగున తెలుగు భాషకి వొదిగే హేళన వాక్యాలు ఆకాశాన తోరణాలు కట్టించి వెళ్ళిపోయారు. దొరగారు గంభీరంగా చూశాడు. ఐదవ వడపోత. సంతానవంతులు తమకి పని లేదనీ, వాళ్ళు వెళ్ళిపోవాలన్నాడు. మరో పదిమంది బయటికి. ఆఖరికి 67మంది మిగిలారు. ఆరవ వడపోతగా మూడు ప్రశ్నలు అడిగాడు. జవాబులు చెప్పినవాళ్ళు వెళ్ళి ఒక మూలన నించోమన్నాడు. తోపులాడుకుంటూ వుండటంతో బిళ్ళ బంట్రోతు గదమా యించి క్యూలో నించోపెట్టాడు. ఆ ప్రశ్నలకి ఎవరికి తోచిన జవాబులు వాళ్ళు చెప్పారు. వెళ్ళి మూలలో నిలబడి ఆ ఉద్యోగం తమదే అనే ధీమాతో వున్నారు. ఇద్దరు మాత్రం ఏమీ జవాబు చెప్పకుండా మిగిలారు. ఆ ఇద్దరూ చలపతిరావూ, ఆయన బామ్మర్ది గోపాలశాస్త్రి. 


మీ విషయం ఏమిటని అడుగుతాడు మేనేజర్‌. మీ ప్రశ్నలు సరిగా లేవు అని చలపతీ, ప్రశ్నల్లోని లోపాల్ని గోపాల శాస్త్రీ వివరించారు. ఇద్దరివీ సరైన జవాబులే! ఇద్దర్నీ సర్వ సమర్థులుగా ప్రకటించాడు. ఇప్పుడు ఇద్దరిలో ఎవర్ని ఎంపిక చేయాలి. ఎలా?


దొర, మేనేజర్‌కి మెల్లగా ఏదో చెప్పాడు. అది విన్న మేనేజర్‌ ముఖాన నెత్తురు చుక్క లేదు. చాలా ఆవేదన చెందాడు. గుండెరాయి చేసుకుని, ఇద్దరికీ చివరి పరీక్ష నిర్వహించాల్సి వచ్చింది. ‘‘మీరిద్దరూ వెళ్ళి, గేటులో సమరేఖ మీద నుంచోండి. దొరగారు పిస్తోలు పేలుస్తారు. అది పేలిన వెంటనే ఆవరణ చుట్టూ పరిగెత్తుకు రండి. ముందు వచ్చిన వారిదే వుద్యోగం!’’ అన్నాడు బాధతో. ‘‘ఉద్యోగం ఇవ్వడం కోసం పందెపు గుర్రాల్లాగ పరిగెత్తించడం అమానుషం కాదా?’’ అని ప్రశ్నించినట్లయింది. అలా పరిగెత్తించడం దుర్మార్గమనీ, క్రూరత్వమనీ మేనేజర్‌ ఎంతో బాధపడుతూ చెప్పాల్సి వచ్చింది. విజాతీయుడైన దొరగారి ఆజ్ఞ! 


ఇంట్లో అంధకారం తాండవిస్తుంటేనూ, కడుపులో పేగులు మాడిపోతుంటేనూ అందుకు సిద్ధపడ్డారు వాళ్ళు. అన్నం వండుదామంటే బియ్యపు గింజల్లేక చలపతిరావు కళ్ళకి సుందరీ, గోపాలశాస్త్రి కళ్ళకి కామేశ్వరీ భగభగమండిపోతున్న పొయ్యి దగ్గర చతికిలబడి దిగాలు పడిపోయి వున్నట్టు కనపడ్డారు. ...తుపాకీ పేలడం, ఇద్దరూ పందెపు గుర్రాల్లాగ పరిగెత్తడం! ఆ పరుగు చూసి బయటికి పోయివున్న దరఖాస్తుదారులు కరతాళ ధ్వనులతో దిక్కులు పిక్కటిల్లాయి. తలకాయ తీసుకువెళ్ళి పొట్టలో పెట్టుకుని దొర ఎదుట కొయ్యయిపోయి వున్నాడు గోపాలశాస్త్రి.


ఇది గుర్రప్పందాలు కథ. నిరుద్యోగుల్ని అలా పరిగెత్తిం చడం అమానుషం అని శ్రీపాదగారికి తోచింది. మరి ఇవ్వాళ? అసలు ఉద్యోగ ప్రకటనలే లేవు. పొరపాటుగా ఒక ఖాళీ పడితే దానికోసం నిరుద్యోగుల కుమ్ములాటలూ! రేయింబ వళ్ళూ చదువుకున్నా చివరికి ఎవడో పలుకుబడిగలవాడు ఎగరేసుకుపోతాడు. రెండేళ్ళ క్రితం వెయ్యి పంచాయితీ కార్య దర్శుల పోస్టులు ఖాళీ పడితే కొన్ని లక్షలమంది దరఖాస్తు చేసుకున్న పరిస్థితి! ఇదీ స్వాతంత్ర్యానంతర మన దుస్థితి! స్వతంత్రం వచ్చిన 47లోనే, దాదాపు ఏడున్నర దశాబ్దాల క్రితమే నిరుద్యోగం గురించి గొప్ప కథ రాసిన శ్రీపాద దృష్టి ఎంత ఉన్నతం. 

మొలకలపల్లి కోటేశ్వరరావు

99892 24280

Updated Date - 2022-01-24T09:19:38+05:30 IST