అడ్డవాగు వంతెనకు మోక్షమెన్నడో?

ABN , First Publish Date - 2021-09-17T05:05:37+05:30 IST

మండలంలోని గోపాయపల్లె రహదారిలో ఉన్న అడ్డవాగుపై వంతెన ఎప్పుడు నిర్మిస్తారని రైతులు, కూలీలు ప్రశ్నిస్తున్నారు.

అడ్డవాగు వంతెనకు మోక్షమెన్నడో?
గోపాయపల్లె రహదారిలో అడ్డవాగును దాటుతున్న రైతులు, కూలీలు

  1. రాకపోకలకు ఇబ్బంది పడుతున్న రైతులు


చాగలమర్రి, సెప్టెంబరు 16: మండలంలోని గోపాయపల్లె రహదారిలో ఉన్న అడ్డవాగుపై వంతెన ఎప్పుడు నిర్మిస్తారని రైతులు, కూలీలు ప్రశ్నిస్తున్నారు. భారీ వర్షాలకు అడ్డవాగులో నీరు పొంగి ప్రవహిస్తోంది. ఈ నీటిలో నుంచే రైతులు, కూలీలు రాకపోకలు సాగిస్తున్నారు. నీరు అధికంగా ఉండటంతో రాకపోకలకు ఇబ్బందిగా ఉందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎద్దుల బండ్లపై అడ్డవాగు దాటుతున్నారు. టీడీపీ ప్రభుత్వ హయాం లో అధికారులు అడ్డవాగును పరిశీలించి రూ.20 లక్షలు నిధులతో ప్రతిపాదనలు పంపించారు. అయితే ఇంతవరకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో రైతులు, కూలీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాదైన అడ్డవాగుపై వంతెన పనులు చేపట్టాలని పాలకులు, అధికారులను కోరుతున్నారు. 


వంతెన నిర్మించాలి

గోపాయపల్లె రహదారిలోని అడ్డవాగుపై వంతెన నిర్మించాలి. ప్రతి ఏడాది వర్షాకాలంలో వాగు దాటాలంటే ఇబ్బంది పడుతున్నాం. పాలకులు, అధికారులు పట్టించుకోవడం లేదు. ఈ ఏడాదైన వంతెన పనులు చేపట్టాలి. 

- ఉసేవలి, రైతు 


రోడ్డు సౌకర్యం కల్పించాలి

గోపాయపల్లె రహదారి అధ్వానంగా ఉంది. వర్షం పడితే రాకపోకలకు ఇబ్బంది. వర్షాకాలంలో పొలాల వద్దకు వెళ్లాలంటే కష్టాలు తప్పవు. పాలకులు, అధికారులు స్పందించి రోడ్డు సౌకర్యం కల్పించాలి. 

- జిలాన్‌, రైతు 




Updated Date - 2021-09-17T05:05:37+05:30 IST