హైలెవెల్‌ బ్రిడ్జికి మోక్షమెన్నడో..?

ABN , First Publish Date - 2021-01-24T05:35:29+05:30 IST

ప్రొద్దుటూరు నుంచి రామేశ్వరం మీదుగా ఆర్టీపీపీకి వెళ్లే ప్రఽధాన రోడ్డుమార్గం ఆరు నెలలుగా బంద్‌ అయింది. ఈ మార్గంలోని పెన్నానదిపై ఉన్న కాజ్‌వే గతేడాది కురిసిన వర్షాలకు కొట్టుకుపోయింది. దీంతో రోడ్డు మార్గం పూర్తిగా బంద్‌ అయి రాకపోకలు నిలిచిపోయాయి.

హైలెవెల్‌ బ్రిడ్జికి మోక్షమెన్నడో..?
రామేశ్వరం-ఆర్టీపీపీ మార్గంలో పెన్నానదిపై తెగిపోయిన కాజ్‌వే

రూ.53 కోట్లతో ప్రతిపాదనలకే పరిమితం

వరద ఉధృతికి కొట్టుకుపోయిన కాజ్‌వే

6 నెలలుగా రామేశ్వరం-ఆర్టీపీపీ రోడ్డుమార్గం బంద్‌

ఇబ్బందులు పడుతున్న పలు గ్రామాల ప్రజలు

ప్రొద్దుటూరు అర్బన్‌, జనవరి 23: ప్రొద్దుటూరు నుంచి రామేశ్వరం మీదుగా ఆర్టీపీపీకి వెళ్లే ప్రఽధాన రోడ్డుమార్గం ఆరు నెలలుగా బంద్‌ అయింది. ఈ మార్గంలోని పెన్నానదిపై ఉన్న కాజ్‌వే గతేడాది కురిసిన వర్షాలకు కొట్టుకుపోయింది. దీంతో రోడ్డు మార్గం పూర్తిగా బంద్‌ అయి రాకపోకలు నిలిచిపోయాయి. దీనివల్ల ప్రొద్దుటూరు నుంచి ఆర్టీపీపీకి వెళ్లాలంటే ఎర్రగుంట్ల రోడ్డుమార్గాన మరో ఐదు కిలో మీటర్లు అదనంగా తిరుక్కొని పోట్లదుర్తి మార్గంలో వెళ్లవలసి వస్తోంది. సోములవారిపల్లె, ఇల్లూరు, చిన్నదండ్లూరు, కలమల్ల, ముద్దనూరు, శిరిగేపల్లె, కన్యతీర్థం నుంచి ప్రొద్దుటూరుకు వచ్చేవారు సోములవారి పల్లె మీదుగా ఎర్రగుంట్ల రోడ్డు మార్గంలోని హైలెవెల్‌ బ్రిడ్జిఎక్కి రావలసివస్తోంది. దీనికి తోడు ఇల్లూరు నుంచి సోములవారి పల్లె పంచాయతీ రోడ్డు మార్గం పూర్తిగా దెబ్బతింది. దీంతో ఈ మార్గంలో వాహనాల్లో ప్రయాణం నరకంగా మారింది.


ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపి ఏడాది..

రామేశ్వరం నుంచి ఆర్టీపీపీకి వెళ్లే మార్గంలో పెన్నానదిపై హైలెవెల్‌ బ్రిడ్జి నిర్మాణానికి 2020 జనవరి 7న కలెక్టరు ఆదేశాలతో ఆర్‌అండ్‌బీ అఽధికారులు రూ.53 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. దాదాపు 400 మీటర్ల మేర బ్రిడ్జి నిర్మాణంతో పాటు 800 మీటర్ల రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు తయారుచేసి పంపారు. నదిలో ఇప్పటివరకు వచ్చిన వరద ప్రవాహాన్ని బట్టి బ్రిడ్జి నిర్మాణానికి అంచనాలు రూపొందించినట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపి ఏడాది పూర్తయినా బ్రిడ్జి నిర్మాణానికి పరిపాలనా అనుమతులు మంజూరు కాలేదు. కాగా, పెన్నా నదిపై హైలెవెల్‌ బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలంటూ ఇటీవల జిల్లాకు వచ్చిన సీఎం జగన్‌ దృష్టికి ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి తీసుకెళ్లారు. రామేశ్వరంలోని జగనన్న కాలనీలోని 6వేల ఇళ్ల స్థలాలకు వెళ్లే మార్గం కూడా ఇదేనని అందువల్ల బ్రిడ్జి నిర్మాణానికి త్వరితగతిన అనుమతులు ఇవ్వాలని కోరారు. కానీ ఇంతవరకు ప్రభుత్వం నుంచి పరిపాలనా అనుమతులకు ఎలాంటి గ్రీనసిగ్నల్‌ రాలేదు.


కరోనాతో ఆలస్యమైంది

- షెక్షావలి,్ల ఆర్‌ అండ్‌బీ డీఈ 

రామేశ్వరం-ఆర్టీపీపీ మార్గంలో పెన్నానదిపై హైలెవెల్‌ బ్రిడ్జి నిర్మాణానికి కలెక్టర్‌ ఆదేశాలతో  2020  జనవరి 7న రూ.53 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. మార్చి నుంచి కరోనా వల్ల లాక్‌డౌన్‌ కారణంగా ఆ ప్రక్రియ నిలిచిపోయింది. ప్రభుత్వం నుంచి పరిపాలనా అనుమతులు రావాల్సి ఉంది.

Updated Date - 2021-01-24T05:35:29+05:30 IST