మొక్కుబడిగా వేసవి శిక్షణ శిబిరాలు!

ABN , First Publish Date - 2022-05-27T04:34:45+05:30 IST

చిన్నారుల్లో క్రీడా స్ఫూర్తిని నింపేందుకు వేసవిలో నిర్వహించే శిక్షణ శిబిరాలు ఈ ఏడాది మొక్కుబడిగా సాగాయి.

మొక్కుబడిగా వేసవి శిక్షణ శిబిరాలు!
శిక్షణ పొందుతున్న క్రీడాకారులు

ఉచితానికి మంగళం.. నామినల్‌ ఫీజు వసూలు

క్రీడాస్ఫూర్తి నింపని ప్రభుత్వం

క్రీడా సామగ్రి పంపిణీ చేయని వైనం

సహకరించని దాతలు, స్వచ్ఛంద సంస్థలు

మరో నాలుగురోజుల్లో శిక్షణ ముగింపు 


నెల్లూరు (విద్య), మే 26 : చిన్నారుల్లో క్రీడా స్ఫూర్తిని నింపేందుకు వేసవిలో నిర్వహించే శిక్షణ శిబిరాలు ఈ ఏడాది మొక్కుబడిగా సాగాయి. ఉచితానికి మంగళం పాడిన ప్రభుత్వం నామినల్‌ ఫీజు వసూలు చేయడంతో క్రీడా స్ఫూర్తిని నింపలేకపోయింది. పైగా గతంలో క్రీడాకారుల్లో ఉత్సాహం నింపేందుకు క్రీడా సామగ్రిని అందజేసే విధానానికి మంగళం పాడింది. ఒక్కటంటే ఒక్క పరికరం కూడా సరఫరా చేసిన దాఖలాలు లేవు. దీనికి తోడు శిక్షణ పొందే క్రీడాకారులకు అన్ని విధాలా ప్రోత్సాహం అందించే దాతలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఈ ఏడాది వేసవి శిక్షణ శిబిరాలకు చేయూతనివ్వలేదు. ఈ క్రమంలో నామమాత్రంగా సాగిన వేసవి శిక్షణ శిబిరాలు ఈనెలాఖరుకు ముగియనున్నాయి. జిల్లా క్రీడా పాధికార సంస్థ ఆధ్వర్యంలో నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి క్రీడా మైదానంలో ప్రతి ఏటా వేసవిలో ఉచిత క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహించేవారు. దీనికి ప్రభుత్వంతో పాటు దాతలు, ఔత్సాహికులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, క్రీడా సంఘాలన్నీ చేమూతనిచ్చేవారు. అయితే ఈ ఏడాది అవేవి ఆచరణకు నోచలేదు. వేసవి శిక్షణ శిబిరాలను ప్రారంభించినా ఆశించిన మేరకు వారికి అన్నీ సమకూర్చలేక పోగా హాజరైన క్రీడాకారుల నుంచి నామినల్‌ ఫీజు వసూలు చేశారు. దీంతో ఉచిత శిక్షణ కనుమరుగైంది. ఈ నేపథ్యంలో శిబిరాలన్నీ కళావిహీనంగా మారిపోయాయి. ఆలస్యంగా ప్రారంభించిన శిబిరాల నిర్వహణ కష్టతరంగా మారడంతో ముగింపు కార్యక్రమాలు కూడా వేగవంతంగానే చేపడుతున్నారు. 

క్రీడలను ప్రోత్సహిస్తామని, కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నామని చెపుతున్న ప్రభుత్వం కేవలం ప్రకటనలకే పరిమితమైంది. పాఠశాలలు, కళాశాలలకు వేసవి సెలవులు ప్రకటించిన అనంతరం నిర్వహించే ఉచిత క్రీడాశిక్షణా శిబిరాల నిర్వహణ ఈ ఏడాది నామమాత్రంగానే జరిగాయి. కరోనా ప్రభావంతో రెండేళ్లుగా శిక్షణ శిబిరాలకు అడ్డంకులు ఏర్పడడంతో ఈ ఏడాది వీటిని పెద్ద ఎత్తున నిర్వహిస్తామని తొలుత ఆర్భాటంగా ప్రకటించారు. అయితే డీఎస్‌ఏ వద్ద నిధులు లేకపోవడం, ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోగా డీఎస్‌ఏ అధికారులు, సిబ్బందే ప్రతి నెలా తమకు నగదు పంపించాలని ఆదేశించడంతో శిబిరాల నిర్వహణకు డీఎస్‌ఏ చేతులెత్తేసింది. శాప్‌ మాత్రం దాతలు, పరిశ్రమల సహకారంతో వేసవి శిభిరాలను నిర్వహించాల్సిందేనని ఆదేశించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో వేసవి శిబిరాలను నిర్వహిస్తోంది. దీనిపై డీఎస్‌ఏ అధికారులను ప్రశ్నించగా ప్రస్తుత పరిస్థితుల్లో శిబిరాల నిర్వహణ కష్టతరంగానే ఉందని, ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో క్రీడలను ప్రోత్సహించలేని దుస్థితిలో ఉన్నామని అంటున్నారు. డీఎస్‌ఏలో ఉన్న ఇండోర్‌ స్టేడియం, స్విమ్మింగ్‌ ఫూల్స్‌కు వచ్చే ఆదాయం అంతా కూడా లెక్కగట్టి మరీ స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌కు పంపిస్తున్నామని చెప్పడం విశేషం. ఈ నేపథ్యంలో మున్ముందు క్రీడల పరిస్థితి మరింత దిగజారే ప్రమాదముందని క్రీడాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


Updated Date - 2022-05-27T04:34:45+05:30 IST