Mohd Zubair: ఆ కేసులు కొట్టేయమన్న జబైర్.. సుప్రీం చీఫ్ జస్టిస్ చెప్పింది ఇదీ!

ABN , First Publish Date - 2022-07-18T22:53:34+05:30 IST

ఉత్తరప్రదేశ్‌లో తనపై నమోదైన ఎఫ్ఐఆర్‌లను కొట్టవేయాలంటూ ఆల్‌న్యూస్ సహ వ్యవస్థాపకుడు మహమ్మద్ జుబైర్‌ (Mohammed Zubair)

Mohd Zubair: ఆ కేసులు కొట్టేయమన్న జబైర్.. సుప్రీం చీఫ్ జస్టిస్ చెప్పింది ఇదీ!

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో తనపై నమోదైన ఎఫ్ఐఆర్‌లను కొట్టవేయాలంటూ ఆల్‌న్యూస్ సహ వ్యవస్థాపకుడు మహమ్మద్ జుబైర్‌ (Mohammed Zubair) దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తాజాగా విచారించింది. కేసులను కొట్టివేయాలన్న జుబైర్ అభ్యర్థనపై ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వీ రమణ (NV Ramana) స్పందిస్తూ.. ఇప్పటికే ఇలాంటి కేసును విచారిస్తున్న జస్టిస్ డీవై చంద్రచూడ్(DY Chandrachud) సారథ్యంలోని బెంచ్‌కు విన్నవించుకోవాలని సూచించారు. దీనికి జుబైర్ తరపు న్యాయవాది స్పందిస్తూ.. జుబైర్ ప్రాణాలకు ముప్పు ఉందని, కాబట్టి అత్యవసరంగా విచారించాలని కోరారు.


జుబైర్‌పై బోల్డన్ని ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయని, ఒకదాంట్లో బెయిలు లభిస్తే మరోదాంట్లో అరెస్ట చేస్తున్నారని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తాము మాట్లాడుతున్నప్పుడే మరోమారు ఆయనను అరెస్ట్ చేశారని పేర్కొన్నారు. దీంతో స్పందించిన సీజేఐ.. తాను దానిని విచారించే బెంచ్ ఎదుట జాబితా చేస్తున్నట్టు చెప్పారు.

 

 వివాదాస్పద ట్వీట్ వ్యవహారంలో ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్, ఘజియాబాద్, సీతాపూర్, లఖింపూర్, హత్రాస్‌లలో తనపై నమోదైన ఆరు ఎఫ్ఐఆర్‌లను కొట్టి వేయాలని కోరుతూ జుబైర్ ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అలాగే, తనపై ఉన్న పెండింగ్ కేసుల విచారణ కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(SIT) ఏర్పాటు చేయడాన్ని కూడా సవాలు చేశారు. తనపై నమోదైన కేసులన్నింటినీ ఢిల్లీలో నమోదైన కేసుతో కలిపేయాలని కోరారు. ఇదే కేసులో ఆయన తొలుత అరెస్టయ్యారు. అలాగే, ఆరు కేసుల్లోనూ మధ్యంతర బెయిలు కోరారు.  

Updated Date - 2022-07-18T22:53:34+05:30 IST