ముగిసిన మొహర్రం వేడుకలు

ABN , First Publish Date - 2022-08-10T04:55:26+05:30 IST

బనగానపల్లె పట్టణంలో మొహర్రం వేడుకలు సాంప్రదాయబద్ధంగా మంగళవారం ముగిశాయి.

ముగిసిన మొహర్రం వేడుకలు
మాతం నిర్వహిస్తున్న షియా ముస్లింలు

రక్తసిక్తమైన బనగానపల్లె పట్టణ వీఽధులు

బనగానపల్లె, ఆగస్టు 9: బనగానపల్లె పట్టణంలో మొహర్రం వేడుకలు సాంప్రదాయబద్ధంగా మంగళవారం ముగిశాయి. పట్టణంలోని దొరకోటలోని పీర్ల వద్ద నవాబు వంశీయుల వారసులు మీర్‌ ఫజుల్‌ అలిఖాన్‌, వారి కుటుంబ సభ్యులు, షియా ముస్లింలు పీర్ల వద్ద శోకతప్త హృదయాలతో ప్రార్థనలు చేశారు. దొరకోటలోని గంధం పీరు వద్ద మొదట నవాబు మీర్‌ ఫజుల్‌ అలీఖాన్‌ వంశీయులు ఫతేహాలు నిర్వహించిన అనంతరం మొహర్రం ఊరేగింపు ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. పలువురు షియా మతస్థులు దొరకోట వద్ద తలపై కత్తితో కోసుకొని అమరులైన ఇమాంహుస్సేన్‌ వారి కుటుంబ సభ్యులను స్మరించుకుంటూ, నల్లదుస్తులతో ఊరేగింపులో పాల్గొన్నారు. ఇమాం హసన్‌, ఇమాం హుస్సేన్‌, వారి కుటుంబీకులు కర్బలా మైదానంలో జరిగిన యుద్ధంలో అమరవీరులైన సందర్భంగా ఈ వేడుకలు శోకతప్త హృదయాలతో ప్రారంభమ్యాయి. దొరకోట పీర్ల వెంట నవాబు వంశీయులు, షియా ముస్లింలు పాల్గొన్నారు. షియా ముస్లింలు బ్లేడులు, కత్తులతో ఎదలపై కొట్టుకుంటూ పీర్ల వెంట బాధాతప్త హృదయాలతో విషాద గీతాలు పాడుకుంటూ మాతం ఉత్సవాల్లో పాల్గొన్నారు. దీంతో బనగానపల్లె పట్టణంలోని వీధులు రక్తసిక్తమయ్యాయి. పట్టణంలోని ప్రజలతోపాటు వివిధ గ్రామాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు ఈ విషాద ఉత్సవాలను, మాతంను మిద్దెలు, మేడలపై ఎక్కి తిలకించారు. దొరకోట నుంచి ప్రారంభమైన ఈ ఉత్సవం పట్టణంలోని పోస్టాఫీసు, ఆస్థానం రోడ్డు, సర్కిల్‌ స్టేషన్‌, పాత బస్టాండు మీదుగా జుర్రేరు వాగు వరకు ఉత్సవం సాగింది. పట్టణంలోని మొత్తం 40 పీర్ల చావిళ్ల నుంచి పీర్లు దొరకోట పీర్ల వెంట రాగా సాయంత్రం జుర్రేరు వాగుకు చేరుకున్నాయి. అక్కడ పీర్లను శుద్ధి చేసి తిరిగి పీర్ల చావిళ్లకు చేర్చారు. ఈ ప్రతి పీర్ల పెట్టెల వెంట శోకతప్త హృదయాలతో ప్రార్థన గీతాలు ఆలపించారు. మొహర్రం వేడుకల సందర్భంగా పట్టణంలోని వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా మూసివేశారు. సంతాప సూచకంగా రాత్రి సినిమా హాళ్లు బంద్‌ చేయించారు. రాత్రి వీధి లైట్లు నిలిపేశారు. ఉత్సవం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డోన్‌ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో బనగానపల్లె సీఐ సుబ్బరాయుడు, ఎస్‌ఐలు రామిరెడ్డి, శంకర్‌నాయక్‌, పోలీసు సిబ్బంది భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఉత్సవం సందర్భంగా పలువురు దాతలు తాగు నీటిని ఉచితంగా అందించారు. బనగానపల్లె గ్రామ పంచాయతీ పారిశుధ్య సిబ్బంది   పట్టణ వీధుల్లో గ్రామ పంచాయతీ ట్రాక్టర్లతో నీళ్లు చల్లి పరిశుభ్రం చేశారు.

ఏపీలోనే బనగానపల్లె ఉత్సవాలు టాప్‌

రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్‌లో బనగానపల్లె పట్టణంలోనే ఉత్సవాలు అత్యంత జనసమూహం వద్ద జరిగాయి. 40 చోట్ల నుంచి పీర్లు ఊరేగింపులో విషణ్ణవదనాలతో  షియా ముస్లింలు పాల్గొన్నారు. వేలాది మంది జనం ఈ విషాద ఉత్సవాలను తిలకించారు. బనగానపల్లెను నవాబులు పరిపాలించడంతో వారి వారసుల ఆధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్‌లో ఉత్సవాలు ప్రథమ స్థానం వహించగా బనగానపల్లె మొహర్రం ఉత్సవాలు రెండో స్థానంలో ఉండేవి. ప్రస్తుతం రాష్రం విడిపోయాక నవ్యాంధ్రప్రదేశ్‌లో బనగానపల్లెలోనే ఉత్సవాలు అన్నింటికన్నా మిన్నగా నిర్వహించారు.

Updated Date - 2022-08-10T04:55:26+05:30 IST