Advertisement

బర్త్‌డే స్పెషల్‌: మోహన్‌లాల్‌

వంద కోట్ల క్రెడిట్‌ ఆయనదే!
యువ హీరోలతనూ పోటీ..
దర్శకులు కట్‌ చెప్పలేని సందర్భాలెన్నో...


సినిమా రంగంలో అన్ని  రకాల పాత్రలు పోషించిన నటులను సంపూర్ణ నటుడు అంటారు. అందుకే మలయాళ స్టార్‌ మోహన్‌లాల్‌ని ‘ది కంప్లీట్‌ మ్యాన్‌’ అని, లాల్లెటన్‌ అని పిలుచుకుంటారు. ఎలాంటి పాత్రకైనా న్యాయం చేయగలిగే నటుడాయన. ఆయన నటనకు చప్పట్లు కొట్టిన ప్రేక్షకులే కాదు కట్‌ చెప్పలేకపోయిన దర్శకులూ ఉన్నారు. అలాంటి నటన ఆయనది. నాలుగు దశాబ్దాలుగా మలయాళ, తమిళ, కన్నడ, తెలుగు, హిందీ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. వివిధ భాషల్లో దాదాపు 350కు పైగా చిత్రాల్లో నటించి ఈ మలయాళ నట శిఖరం పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయన కెరీర్‌ మీద ఓ లుక్కేద్దాం...

ఆరేళ్ల వయసులోనే...
మోహన్‌లాల్‌ పూర్తి పేరు మోహన్‌లాల్‌ విశ్వనాథ్‌ నాయర్‌. కేరళలోని శబరిమలకు సమీపంలోగల పతనంతిట్ట జిల్లాలోని ఎలన్‌త్తూర్‌లో జన్మించారు. ఆయన ట్రివేండ్రమ్‌లో చదువుకున్నారు. ఆరో తరగతిలోనే ఆయన నటనా రంగంలోకి  అడుగుపెట్టాడు. ‘కంప్యూటర్‌ బాయ్‌’ అనే నాటకంలో 90 ఏళ్ల వృద్థుడిగా నటించి ప్రశంసలు అందుకున్నారు. 1997, 98ల్లో రెండుసార్లు రెజ్లింగ్‌ ఛాంపియన్‌గా గెలుపొందారు. ఆ తర్వాత  ేస్నహితుడు  తీసిన ‘తిరనోట్టమ్‌’ సినిమాలో నటించారు. కానీ ఆ చిత్రం విడుదల కాలేదు. మరికొందరి స్నేహితుల బలవంతంతో ‘మంజిల్‌ విరింజ పూక్కల్‌’లో విలన్‌ పాత్ర ఆడిషన్‌కు వెళ్లి ఎంపికయ్యాడు. ఆ సినిమా సూపర్‌హిట్టై సినీ పరిశ్రమలో నిలదొక్కుకోవడానికి పునాది వేసింది. ఆ తర్వాత ఒక్కో మెట్టు ఎక్కుతూ మలయాళ సూపర్‌స్టార్‌గా ఎదిగి మాలీవుడ్‌ను శాసించే స్థాయికి ఎదిగారు. 1988లో దాదాపు 25 చిత్రాల్లో ఆయన నటించారు. అందులో ఎక్కువ నెగెటివ్‌ పాత్రలే ఎక్కువ. ‘కిరీడం’, ‘చంద్రలేఖ’, ‘నరసింహం’, ‘దృశ్యం’, ‘పులి మురుగున్‌’, ‘లూసిఫర్‌’, ‘కాప్పన్‌’, తెలుగులో ‘గాంఢీవం’, ‘జనతా గ్యారేజ్‌’, ‘మనమంతా’ లాంటి మరపురాని చిత్రాలను అందించారు. అలాగే ఆయనతో మంచి గాయకుడు కూడా ఉన్నారు. ఇప్పటికి ఓ 50 పాటలు ఆయన పాడారు. 2022లో ‘బరోజ్‌: గార్డియన్‌ ఆఫ్‌ ది గామాస్‌ ట్రెజర్‌’ సినిమాతో దర్శకుడిగా మారబోతున్నారు లాల్‌. ఇప్పటి వరకూ  ఆయన ఏడె లఘు చిత్రాలు, మలయాళంలో విడుదలైన  15 ఇతర భాషా చిత్రాలకు ఆయన డబ్బింగ్‌ చెప్పారు. ఏడు నాటకాలు వేశారు. మలయాళ ‘బిగ్‌బాస్‌’ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. వీటితోపాటు పలు టెలివిజన్‌ షోలు కూడా చేశారు.

తొలి ఘనత ఆయనదే!
ఎక్కువ శాతం బడ్జెట్‌ సినిమాల్లోనే నటించి ఎక్కువ వసూళ్లు రాబట్టిన ఘనత మోహన్‌లాల్‌ది. ‘పులిమురుగన్‌’తో వందకోట్ల వసూళ్ల మార్క్‌ను అందుకున్నారు. వంద కోట్ల క్లబ్‌లో చేరిన తొలి మలయాళ చిత్రంగా ‘పులి మురుగన్‌’ నిలిచింది. ఆ తర్వాత ‘లూసిఫర్‌’ రూ.200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి మలయాళ సినిమా స్టామినాను పెంచింది. యువ హీరోలకు పోటీగా నటిస్తూ ఇంకా ఆయన వయసులోనే ఉన్నారని చాటి చెబుతున్నారు. అలాగే ఏ భాషలోనైనా మంచి పాత్ర ఉందంటే ఆయన నటించడానికి వెనకాడరు. అలా అతిథి పాత్రల్లో ఆయన నటించిన సినిమాలెన్నో ఉన్నాయి. స్టార్‌డమ్‌ ఉన్న హీరో ఎవరైనా మల్టీస్టారర్‌ చేయడానికి అంత తొందరగా అంగీకరించరు. విజయ్‌(జిల్లా), విశాల్‌, ఎన్టీఆర్‌(జనతాగ్యారేజ్‌) లాంటి యువ హీరోల సినిమాల్లోనూ నటించి అలరించారు. మణిరత్నం తెరకెక్కించిన ‘ఇరువర్‌’తో తమిళ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. మోహన్‌లాల్‌. రామ్‌గోపాల్‌ వర్మ తీసిన ‘కంపెనీ’తో బాలీవుడ్‌కి వెళ్లారు. ‘ఆగ్‌’, ‘తేజ్‌’ సినిమాల్లోనూ కీలక పాత్రలు పోషించారు.  


పద్మభూషణుడు...
మోహన్‌లాల్‌ ఇప్పటి వరకూ 5 జాతీయ అవార్డులను కైవసం చేసుకున్నారు. అందులో రెండు ఉత్తమ నటుడిగా అందుకున్నారు. నిర్మాతగా ‘వానప్రస్థానం’ చిత్రానికి మరో అవార్డు వచ్చింది. అలాగే 17 కేరళ రాష్ట్ర అవారులను, 11 ఫిలిం ఫేర్‌ అవార్డులను సొంతం చేసుకున్నారు. భారత ప్రభుత్వం ఆయన్ను పద్మశ్రీ, పద్మభూషణ్‌ అవార్డ్‌లతో సత్కరించింది. భారతదేశంలో మోహన్‌లాల్‌ సహజ నటుడని ఇండియన్‌ మీడియా కితాబిచ్చింది. 

మంచి వ్యాపారవేత్త...
మోహన్‌లాల్‌ మంచి నటుడే కాదు. గొప్ప వ్యాపారవేత్త కూడా. ఫిల్మ్‌ ప్రొడక్షన్‌, డిస్ట్రిబ్యూషన్‌తోపాటు రెస్టారెంట్ల వ్యాపారం కూడా ఉంది. కమర్షియల్‌ యాడ్స్‌ కూడా చేశారు. 2007లో విస్కీ యాడ్‌ చేసినందుకు సోషల్‌ యాక్టివిస్ట్‌లు మోహన్‌లాల్‌కు వ్యతిరేకంగా పోరాటం చేశారు.

‘జనతా గ్యారేజ్‌’లో సత్యం పాత్ర పోషించిన మోహన్‌లాల్‌ చెప్పిన పవర్‌ఫుల్‌ డైలాగ్‌లు:

1. ‘‘మీరు ఎవరి జోలికైనా వెళ్లి.. ఆ భయంతో వాళ్లొచ్చి మా  తలుపు తడితే తప్ప...  మేం ఎవరి జోలికి వెళ్లం. మీరు కూడా మీ వాళ్లను ఎవరి జోలికి వెళ్లొద్దని చెప్పండి.. అలాంటి సమయంలోనే జనాలకి ఎక్కడికి వెళ్లాలో తెలియక ‘జనతాగ్యారేజ్‌’ తలుపు తడతారు.


2. ఎదుటోడి కష్టం తెలిస్తే.. కళ్లలో నీళ్లు తిరగాలి...


3. ‘జనతాగ్యారేజ్‌’ ఎవర్నీ వదలద... కొడుకైనా...


4. జరిగిన దానికి ‘క్షమించండి’ అని ఒక్క మాటతో సరిపెట్టడం నాకు ఇష్టం లేదు. నన్ను నేను శిక్షించుకోవడం కోసం ఈ బిడ్డను మీకు ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు జరిగిన నష్టం వల్ల మేం చేసే పనులు ఒక్కటి కూడా ఆగదు. ఇంకా పెరగొచ్చు కూడా!


5. అమ్మ తరఫు కుటుంబం తప్ప నాన్న తరఫు కుటుంబం ఉందని చెప్పకుండా వాడిని పెంచండి. 

Advertisement
Advertisement