తెలిసే పెళ్లి చేసుకుంది.. అయినా మోసం చేసింది

ABN , First Publish Date - 2020-02-07T20:23:12+05:30 IST

అంధుడయినా పట్టు వదలని విక్రమార్కుడు... సంగీత విద్వాంసుడు బాలమురళీ కృష్ణ దగ్గర శిష్యరికం చేసి గురువుకు తగిన శిష్యుడనిపించుకున్నారు.

తెలిసే పెళ్లి చేసుకుంది.. అయినా మోసం చేసింది

బ్రెయిలీలో నొటేషన్స్‌ నా లక్ష్యం

ఒత్తిడిని దూరం చేసిన సంగీతం

బాలమురళి శిష్యరికం నా అదృష్టం

ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కేలో సంగీత విద్వాంసుడు మోహన కృష్ణ


అంధుడయినా పట్టు వదలని విక్రమార్కుడు... సంగీత విద్వాంసుడు బాలమురళీ కృష్ణ దగ్గర శిష్యరికం చేసి గురువుకు తగిన శిష్యుడనిపించుకున్నారు. 20 ఏళ్ల వరకే ప్రపంచాన్ని చూడటం బాధనిపించినా సంగీతమే తనను బయటపడేసిందంటున్నారు... ఆయనే సంగీత విద్వాంసుడు మోహన కృష్ణ.. ఆయనతో 10-01-2011న జరిగిన ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే వివరాలు..


అంధుడైన మీలో అంత గుండె నిబ్బరం ఎలా కలిగింది?

మొదట నాకు కొంచెం కనిపించేది. డిగ్రీ వరకూ కళ్లజోడు పెట్టుకుని మేనేజ్‌ చేసేవాడిని. తర్వాత నాకు వచ్చిన వ్యాధిని బట్టి క్రమేణా చూప్తు పూర్తిగా పోతుందని వైద్యులు చెప్పారు. వాళ్లు చెప్పినట్టే 20 ఏళ్ల వయసు నాటికి మొత్తం చూపుపోయింది. కొంత కాలం నేను ప్రపంచాన్ని చూశాను. ఆయనతో 10-1-11న జరిగిన ఓపెన హార్ట్‌ విత ఆర్కే వివరాలు...


చూపు పోయినప్పుడు మీకేమనిపించింది?

మొదట్లో బాధనిపించింది. సంగీతమే ఆ ఒత్తిడి నుంచి నన్ను బయటపడేసింది. నేను చాలా ఎక్కువగా సినిమాలు చూసేవాడిని. సినిమా పాటలంటే పిచ్చి. నేను శాసీ్త్రయ సంగీతం నేర్చుకుంటున్నా సినీ పాటలు పాడేవాడిని. మొదట్లో శాసీ్త్రయ సంగీతం అందం నాకు అప్పట్లో తెలియదు. నాకు ఇంట్లో వాళ్లు టేప్‌రికార్డర్‌ కొని ఇచ్చారు. మా గురువుగారు నాకు బాలమురళీకృష్ణ క్యాసెట్‌ ఇచ్చి, వినమని చెప్పారు. ఆయన కచేరి విన్న తర్వాత నా సంగీత జీవితంలో చాలా మార్పు వచ్చింది. అప్పటి నుంచీ రేడియోలో ఆయన కచ్చేరిల కోసం ఎదురుచూసేవాడిని. నాకు ఏమాత్రం గుర్తింపు వచ్చినా అది మా అమ్మమ్మ వల్లే. ఆమే నాకు చేదోడువాదోడుగా ఉండేవారు. మా పెద్ద నాన్న గారు నన్ను బాలమురళీ దగ్గరకు తీసుకువెళ్లారు. ఏడాది తర్వాత మొత్తమ్మీద 1980లో ఆయన దగ్గర శిష్యరికం మొదలైంది. అప్పటికి నాకు కొంచెం చూపు ఉండేది. కళ్లు కనిపించక పోవడం వల్ల నాకు లాభమే జరిగింది. ఏకాగ్రత పెరిగింది.


బాలమురళీకృష్ణ మీదగ్గర గురుదక్షిణ లేకుండా ఎలా నేర్పారు?

అప్పట్లో గురువుకు సేవలు చేసి, విద్య నేర్చుకునేవారు. అదే గురుదక్షిణగా భావించేవారు. అలా పెరిగిన గురుకులంలో మా గురువు గారు ఒకరు.. కానీ నేనేమీ సేవ చేయలేను కదా... నన్నే చేయి పట్టుకుని తీసుకువెళ్లాలి. నా అదృష్టం ఆయనకు నా పట్ల అనుగ్రహం కలిగింది. అసలు నాకు ఆయన సంగీతం నేర్పిస్తున్నారంటే ఎవరూ నమ్మేవారు కాదు. భగవంతుడు ఒకటి తీసుకుని, ఒంకోటి ఇస్తాడు. నా విషయంలో జరిగింది అదే. నాకు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంలో ఉద్యోగం వచ్చింది. అదీ ఆయన వల్లే. ఆయనను విడిచివెళ్లడం నాకు ఇష్టం లేదు. ఆయన మాట అప్పట్లో వినకపోతే చాలా ఇబ్బంది పడేవాడిని.


ఉద్యోగం చేస్తున్నప్పుడు ఎవరైనా అవమానించారా?

అలాంటిదేం లేదు. నన్ను మొదట మోసం చేసింది మా ఆవిడే. మా నాన్న అన్నీ చెప్పాకే ఇష్టపడి పెళ్లి చేసుకుంది. 1989లో పెళ్లి జరిగింది. ఇద్దరు పిల్లలు మాకు. ఆ తర్వాత ఆమెను వేరే వ్యక్తి లోబరుచుకున్నాడు. అతడితో ఆమె వెళ్లిపోయింది. ఆ అవమానం భరించలేకే నేను వేరే ఊరికి ట్రాన్స్‌ఫర్‌ చేయించుకున్నాను. ఈ మోసం ముందు ఎవరు ఏది చేసినా పెద్ద బాధ అనిపించదు. పిల్లలు చిన్నవారు. కొన్నాళ్లకు మళ్లీ పెళ్లి చేసుకున్నాను. నా జీవితానికి గుర్తింపు వచ్చిందంటే అది మా గురువు బాలమురళి వల్లే... నాకు మొదటి నుంచి కోరిక.. బాలసుబ్రహ్మణ్యంతో పాట పాడించాలని... ఓ కీర్తన.. అదే రాగంలో ఓ సినిమా పాట... ఇలా ఓ కాన్సెప్ట్‌ సిద్ధం చేశాను. తొలుత నేనే స్వయంగా ప్రదర్శన ఇచ్చాను. ఆ తర్వాత బాలుకు చెప్పాను. 2007లో తొలిసారిగా బాలుతో కలిసి షో ఇచ్చాను. బాగా విజయవంతమైంది.


మీ లక్ష్యం ఏమిటి?

బ్రెయిలీ లిపిలో సంగీతానికి సంబంధించిన నొటేషన్స్‌ రూపొందించాలని కోరిక.

Updated Date - 2020-02-07T20:23:12+05:30 IST