Sep 25 2021 @ 14:37PM

నిన్ను హేళన చేసేవాళ్లకు నా మాటగా చెప్పు అనగానే..వీడియోకాల్‌లో ఏడ్చేసిన మహిళ

బెంగళూరు: విభిన్న చిత్రాలను ఎంపిక చేసుకుంటూ తన నట ప్రయాణాన్ని కొనసాగిస్తున్న నటుడు మోహన్‌లాల్. తన వీరాభిమాని అయిన ఒక మహిళకు ఆయన వీడియోకాల్ చేసి సర్‌ప్రైజ్ చేశారు. మోహన్‌లాల్ నుంచి తనకు ఫోన్ కాల్ రావడంతో ఆమె ఆశ్చర్యానికి గురయ్యారు. వివరాల్లోకి వెళ్లితే.. త్రిశూర్‌కు చెందిన వృద్ధురాలు రుగ్మిణి. మోహన్‌లాల్ నుంచి వీడియో కాల్ రావడంతో ఆమె సంతోషానికి హద్దులు లేకుండా పోయింది. తన అభిమాన హీరో నటించిన అన్ని సినిమాలను ఆమె వీక్షిస్తారు. ఇప్పటి వరకు ఏ చిత్రాన్ని మిస్ చేయలేదు.


మోహన్‌లాల్‌ను ప్రత్యక్షంగా కలిసి మాట్లాడాలనుకోవడం ఆ వృద్ధురాలి కల. ఆయనకు అభిమానుల ద్వారా రుగ్మిణి గురించి తెలిసింది. ఫలితంగా ఆమెకు వీడియోకాల్ చేసి సర్‌ప్రైజ్ చేయాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా వీడియో కాల్‌ను వెంటనే చేశారు. ఆయన కాల్ చేస్తున్న దృశ్యాలతో కూడిన వీడియో ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తోంది.  మీ అభిమాన హీరోను ఎప్పుడు కలుస్తున్నావని అందరూ హేళన చేసేవారని ఆమె మోహన్‌లాల్‌కు చెప్పారు. ‘‘ నిన్ను హేళన చేసేవాళ్లకు నా మాటగా చెప్పు. నేను నీకు వీడయోకాల్ చేశాను’’ అని అందరికీ చెప్పామన్నారు. ఆ మాట అనగానే ఆమె వీడియో కాల్‌లోనే ఏడ్చేశారు. 

 

మిమ్మల్ని కలవాలనుకుంటున్నానని రుగ్మిణి మోహన్‌లాల్‌కు చెప్పారు. అందుకు ఆయన సమాధానమిస్తూ

‘‘ ప్రస్తుతం నేను షూటింగ్‌లో ఉన్నాను తప్పకుండా కలుద్దాం. ప్రస్తుతం మీరు సంతోషంగా ఉన్నారనుకుంటున్నాను ’’ అని సమాధానమిస్తూ వీడియోకాల్‌ను ఎండ్ చేశారు.