May 11 2021 @ 10:59AM

‘వకీల్‌సాబ్’కు కలెక్షన్ కింగ్ కితాబు

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వకీల్‌సాబ్’. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎటువంటి విజయాన్ని అందుకుందో తెలియంది కాదు. రీసెంట్‌గా ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్‌లో విడుదల చేశారు. అక్కడ కూడా ఈ చిత్రం ట్రెమండస్ రెస్పాన్స్‌ను రాబట్టుకుంటోంది. ఈ చిత్రాన్ని చూసిన ప్రతి ఒక్కరూ.. సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఈ చిత్రాన్ని చూసినట్లుగా తెలుస్తుంది.


‘వకీల్‌సాబ్’ చిత్రాన్ని చూసిన కలెక్షన్ కింగ్.. చిత్రంపై, అందులో నటించిన నటీనటులపై ప్రశంసలు కురిపించినట్లుగా సమాచారం. ముఖ్యంగా పవన్ కల్యాణ్ నటనకు ఆయన ముగ్ధుడయ్యాడని.. ఇంత మంచి చిత్రాన్ని తీసిన, నిర్మించిన దర్శక నిర్మాతలు అభినందనీయులని ఆయన అన్నట్లుగా తెలుస్తుంది. స్త్రీ గొప్పతనం తెలిపే ఇలాంటి మంచి మెసేజ్ ఉన్న సినిమాలు మరిన్ని రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని.. మోహన్ బాబు ‘వకీల్ సాబ్’కు కితాబు ఇచ్చినట్లుగా ఆయన సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. నటుడిగా, నిర్మాతగా ఎన్నో విజయవంతమైన చిత్రాలు చేసిన కలెక్షన్ కింగ్.. దాసరి వంటి అగ్ర దర్శకుల నుంచి పరిపూర్ణనటుడని అనిపించుకున్నారు. అలాంటి మోహన్ బాబు, ఓ సినిమా గురించి ఇంత పాజిటివ్‌గా మాట్లాడటం ఈ మధ్య కాలంలో అయితే జరగలేదు. మోహన్ బాబునే మెప్పించి ప్రశంసలందుకున్నాడు ‘వకీల్ సాబ్’. అదే ఇందులో మెచ్చుకోదగ్గ విశేషం.