Siraj: RCB ఓటమికి సిరాజ్‌ ఒక్కడే కారణమా.. ఎంత ఘోరంగా ట్రోల్ చేస్తున్నారో చూడండి..

ABN , First Publish Date - 2022-05-28T23:20:07+05:30 IST

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు పట్టిన గ్రహణం వీడినట్టుగా లేదు. ఢిల్లీపై ముంబై జట్టు గెలవడంతో నక్క తోక తొక్కినట్టుగా..

Siraj: RCB ఓటమికి సిరాజ్‌ ఒక్కడే కారణమా.. ఎంత ఘోరంగా ట్రోల్ చేస్తున్నారో చూడండి..

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు పట్టిన గ్రహణం వీడినట్టుగా లేదు. ఢిల్లీపై ముంబై జట్టు గెలవడంతో నక్క తోక తొక్కినట్టుగా క్వాలిఫైయర్-1 వరకూ వచ్చి లక్నోను ఓడించి క్వాలిఫైయర్-2 వరకూ వచ్చినా కీలక మ్యాచ్‌లో RCB చేతులెత్తేసింది. బ్యాట్స్‌మెన్స్ వైఫల్యం RCB ఓటమికి ప్రధాన కారణం అని చెప్పక తప్పదు. కానీ.. RCB అభిమానుల్లో కొందరు మాత్రం ఓటమిని జీర్ణించుకోలేక RCB పేసర్ మహ్మద్ సిరాజ్‌పై విరుచుకుపడుతున్నారు. బ్యాటింగ్‌లో విఫలమైన కోహ్లీ, డుప్లెసిస్, మ్యాక్స్‌వెల్‌ను వదిలేసి సిరాజ్ ఒక్క వికెట్ కూడా తీయకుండా ఎక్కువ పరుగులిచ్చాడంటూ విమర్శిస్తున్నారు. ‘ఓటమిని జీర్ణించుకోలేక సిరాజ్‌ను ట్రోల్ చేస్తున్నార్లే’ అని లైట్ తీసుకునేలా వారి ట్రోల్స్ లేవు.



ఈ ఆర్‌సీబీ పేసర్‌ను వ్యక్తిగతంగా కించపరుస్తూ.. చివరికి చనిపోయిన అతని తండ్రిని కూడా వివాదంలోకి లాగుతూ కొందరు ఆర్‌సీబీ అభిమానులు ట్రోల్స్ చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. సిరాజ్ ఇన్‌స్టాగ్రాం పేజ్‌లో అతనిని దారుణంగా తిడుతూ కామెంట్స్ పెట్టారు. అయితే.. సిరాజ్‌కు ఊరట కలిగించే విషయం ఏంటంటే.. ఆ ట్రోల్స్ చేస్తున్న వారికి ట్విట్టర్ సాక్షిగా కొందరు కౌంటర్ ఇస్తున్నారు. ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ జరుగుతుండగా తండ్రి చనిపోయినా ఇండియాకు రాకుండా దేశం తరపున ఆడిన సిరాజ్‌ను ట్రోల్ చేయడానికి మనసెలా వస్తోందని అతని మద్దతుదారులు ప్రశ్నిస్తున్నారు. అతని మతాన్ని, తండ్రిని అనవసరంగా వివాదంలోకి లాగకుండా చాతనైతే అతని ఆటతీరుపై విమర్శ చేయాలని కొందరు నెటిజన్లు ట్రోలర్స్‌కు సూచిస్తున్నారు. సిరాజ్‌ను RCB Retain చేసుకోవడం సమంజసమేనని, వచ్చే సీజన్‌లో వదిలేసుకుంటే మాత్రం RCB తప్పు చేసినట్టేనని మరో నెటిజన్ అభిప్రాయపడ్డాడు.



RRతో జరిగిన క్వాలిఫైయర్-2 మ్యాచ్‌లో సిరాజ్ 2 ఓవర్లు బౌలింగ్ చేసి 31 పరుగులు సమర్పించుకోవడమే కాక ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. దీంతో.. సిరాజ్‌పై RCB అభిమానులు గరంగరం అవుతున్నారు. ఐపీఎల్ మెగా ఆక్షన్‌లో మహ్మద్ సిరాజ్‌ను ఆర్‌సీబీ యాజమాన్యం రూ.7 కోట్లకు రిటైన్ చేసుకుంది. సిరాజ్ నుంచి ఎంతో ఆశించినప్పటికీ ఈ సీజన్‌లో మాత్రం ఈ పేసర్ పేలవ ఆటతీరు కనబర్చాడు. అంతేకాదు.. ఈ ఐపీఎల్ సీజన్‌లో సిరాజ్ మరో చెత్త రికార్డును కూడా మూటగట్టుకోవాల్సి వచ్చింది. ఐపీఎల్ 2022 సీజన్‌లో 31 సిక్స్‌లిచ్చిన బౌలర్‌గా సిరాజ్ నిలిచాడు. బెంగళూరులో ఉన్న మరో బౌలర్ హసరంగ కూడా ఈ సీజన్‌లో 30 సిక్సులు సమర్పించుకున్నాడు. అయితే.. 26 వికెట్లు తీసి సత్తా చాటాడు. కానీ.. సిరాజ్ మాత్రం ఈ సీజన్‌లో 15 మ్యాచులు ఆడి 10.07 ఎకానమీ రేట్‌తో 9 వికెట్లు మాత్రమే తీసి భారీగా పరుగులిచ్చిన బౌలర్‌గా చెత్త రికార్డు మూటగట్టుకుని అపఖ్యాతి పాలయ్యాడు.



Updated Date - 2022-05-28T23:20:07+05:30 IST