అల్లాహ్ సమస్త మానవాళికి పదకొండు నెలలను కేటాయించి, తన కోసం రంజాన్ మాసాన్ని ప్రత్యేకించుకున్నాడు. అందుకే ఆరాధనల్లో అధికభాగం ఈ నెలలోనే నిర్వర్తించాల్సి ఉంటుంది.
విశ్వాసులైన మానవులపై తన కారుణ్య వర్షాన్ని కురిపించడానికి సకల శుభాల పవిత్ర రంజాన్ మాసం మొదలుకాబోతోంది. షాబాన్ మాసం ముగియబోతోంది.
రజబ్, షాబాన్ మాసాల్లో నెలవంకను చూసి... ‘‘ఓ అల్లాహ్! మమ్మల్ని రంజాన్ మాసం వరకూ చేర్చు’’ అని అంతిమ దైవప్రవక్త మహమ్మద్ ప్రార్థించేవారు. ఈ శుభాల, వరాల వసంతానికి స్వాగతం పలకడానికి షాబాన్ మాసం నుంచి మనమంతా సిద్ధం కావాలని ఆయన ఉపదేశించేవారు.
‘‘ఒక శుభప్రదమైన మాసం రాబోతోంది. ఈ మాసంలో ఉపవాసాలను (రోజాలను) అల్లాహ్ మీకు ‘ఫర్జ్’ (విధి)గా నిర్దేశించాడు. ఈ మాసంలో స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయి. నరక ద్వారాలు మూసుకుంటాయి. సైతాన్లు సంకెళ్ళతో బంధితులవుతారు. వెయ్యి మాసాలకన్నా శ్రేష్టమైన మహా రాత్రి ఈ మాసంలోనే ఉంది. పూర్తి విశ్వాసంతో, ఉత్సాహంతో రంజాన్ మాసానికి స్వాగతం చెప్పేవారు గొప్ప అదృష్టవంతులు. ఆరాధనకు ఇది ఎంతో ముఖ్యమైన నెల’’ అని దైవప్రవక్త ఒక సందర్భంలో పేర్కొన్నారు. ఒకసారి షాబాన్ నెల చివరి రోజున ఆయన ప్రసంగిస్తూ ‘‘రాబోతున్న రంజాన్ మాసంలో ఎవరైనా ఒక సత్కార్యం చేస్తే... ఇతర మాసాల్లో 70 సత్కార్యాలు చేసిన దానితో సమానం’’ అని వెల్లడించారు.
అనంత కరుణామయుడు, అపార కృపాశాలి అయిన అల్లాహ్ మానవులకు అందించిన పవిత్ర మాసంగా... సమస్త శుభాలకూ నిలయమైన, సర్వ కారుణ్యాలకూ ఆలవాలమైన, సహనాన్నీ, దాతృత్వాన్నీ పెంచేది, పేద గొప్ప అనే తారతమ్యాలను తొలగించేదీ, సర్వ మానవ సమానత్వాన్నీ, సౌభ్రాతృత్వాన్నీ, పరస్పర ప్రేమాభిమానాలనూ ద్విగుణీకృతం చేసేది అయిన పుణ్య మాసంగా రంజాన్‌ను పవిత్ర గ్రంథాలు ప్రస్తుతించాయి. అల్లాహ్ సమస్త మానవాళికి పదకొండు నెలలను కేటాయించి, తన కోసం రంజాన్ మాసాన్ని ప్రత్యేకించుకున్నాడు. అందుకే ఆరాధనల్లో అధికభాగం ఈ నెలలోనే నిర్వర్తించాల్సి ఉంటుంది.
విశ్వాసులందరూ రంజాన్ మాసంలో రోజూ ఒక భాగం దివ్య ఖుర్ఆన్ చదవాలి. రాత్రి వేళల్లో తరావీహ్, సహజ్జుద్ నమాజులు చేయాలి. జకాత్, ఫిత్రా దానాలు, తాఖ్ రాత్రులు (బేసి రాత్రులు) ఏతేకాఫ్ (తపోనిష్ట) లాంటి ఆధ్యాత్మిక అంశాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. ఇవన్నీ తప్పకుండా ఆచరించాలనే గట్టి సంకల్పంతో... పవిత్ర రంజాన్ మాసాన్ని హృదయపూర్వకంగా స్వాగతించాలి.
మహమ్మద్ వహీదుద్దీన్