ఉన్మాద చర్య!

ABN , First Publish Date - 2022-06-30T06:55:41+05:30 IST

రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లో మంగళవారం ఒక దర్జీని ఇద్దరు ముస్లిం యువకులు తలనరికి చంపివేసిన ఘటన దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.

ఉన్మాద చర్య!

రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లో మంగళవారం ఒక దర్జీని ఇద్దరు ముస్లిం యువకులు తలనరికి చంపివేసిన ఘటన దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. కన్నయ్యలాల్ అనే ఆ దర్జీ వద్దకు ఆ ఇద్దరు యువకులు కొలతలు ఇచ్చేందుకు అన్నట్టుగా వచ్చి, ఒక్కసారిగా అతడిమీద పడి, మెడనరికి చంపిన ఆ దృశ్యాన్ని దేశమంతా చూసింది. ఆ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడమే కాక, ఈ ఉన్మాదులు ఇద్దరూ ఆ తరువాత కత్తులు ఊపుతూ ప్రధానిని కూడా బెదిరించారు. ఈ అమానవీయ ఘటన రాజస్థాన్ వ్యాప్తంగా ఉద్రిక్తతలను సృష్టించడమే కాక, యావత్ దేశాన్ని కుదిపేసింది. ఈ భయానక దృశ్యాన్ని ప్రచారంలో పెట్టవద్దనీ, తోచిన వ్యాఖ్యలు జోడించి అమాయకులను రెచ్చగొట్టవద్దని పోలీసులు విజ్ఞప్తులు చేసినప్పటికీ, ఇప్పటికే అది విస్తృతంగా ప్రచారమై సమాజాన్ని ఆందోళనకు, ఆగ్రహానికి గురిచేసింది.


మహ్మద్ ప్రవక్తపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన భారతీయ జనతాపార్టీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మను సామాజిక మాధ్యమాల్లో సమర్థించినందుకు, ఆమె ఫోటోను తన ఎకౌంట్‌కు జోడించుకున్నందుకు కన్నయ్యలాల్‌ను ఈ దుర్మార్గులు ఇంత ఘోరంగా చంపివేశారు. తనకు వస్తున్న బెదిరింపుల గురించి కన్నయ్యలాల్ పోలీసులకు ముందే సమాచారం ఇచ్చినా వారు పట్టించుకోకపోవడంతో ఈ ఘోరం జరిగిందని అంటున్నారు. జూన్ 10న చేసిన ఒక పోస్టు కారణంగా అరెస్టయి, 15న బెయిల్ మీద వచ్చిన తరువాత కన్నయ్యలాల్ తనకు కొందరి నుంచి ప్రమాదం ఉన్నదని పోలీసులకు ఫిర్యాదు చేశాడనీ, ఎంతోకాలం షాపు తెరవడానికి భయపడి, చివరకు తెరిచినరోజే బలయ్యాడనీ అంటున్నారు. పలుమార్లు రెక్కీలు నిర్వహించి మరీ వీరు ఈ హత్యచేశారన్న ఆరోపణలు ఉన్నప్పటికీ, బెదిరింపులకు పాల్పడ్డ వ్యక్తులతో అంతకుముందే కన్నయ్యకు సయోధ్య కుదిరిందని పోలీసుల వాదన. ఏది ఏమైనప్పటికీ, ఈ ఉన్మాదులు ఇద్దరూ కన్నయ్యను ఇంత కిరాతకంగా హత్యచేయడం ద్వారా తమను తాము మతరక్షకులుగా భావించుకున్నారు, ప్రదర్శించుకోదల్చుకున్నారు. ఏదో ఆవేశంలో చంపివేసి, తప్పించుకుపోయే ఉద్దేశం వారికి లేదని ఘటన నుంచి అరెస్టువరకూ వారి ప్రవర్తన చెబుతున్నది. దేశాన్ని కల్లోలంలో ముంచి, ఉగ్రవాదాన్ని వ్యాప్తిచేసే లక్ష్యంతో ఈ ఘటన జరిగిందని రాజస్థాన్ ముఖ్యమంత్రి గెహ్లాట్ సహా చాలామంది భావిస్తున్నారు. వీరిద్దరితో పాటు మరికొందరిని కూడా అరెస్టుచేసిన నేపథ్యంలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాద ముఠాతో వీరికి సంబంధం ఉన్నట్టు, వారివద్ద కొన్ని ఫోన్ నెంబర్లు దొరికినట్టు వార్తలు వస్తున్నాయి. రాజస్థాన్ టాస్క్‌ఫోర్స్ సహాయంతో ఎన్ఐఏ చేపట్టిన దర్యాప్తులో ఐసిస్ వంటి అంతర్జాతీయ గ్రూపుల ప్రమేయం కూడా నిర్థారణ కావచ్చు. వారు ఈ హత్యచేసిన తీరు ఐసిస్ వీడియోలతో ప్రభావితమైన విషయాన్ని కూడా చెబుతున్నది.


ఈ ఘటనను సమాజంలోని అన్ని వర్గాలు ముక్తకంఠంతో ఖండించాయి. రాజకీయ నాయకుల నుంచి మతపెద్దలవరకూ అందరూ ప్రజలకు మంచిమాటలు చెప్పారు. మతవిద్వేషాలు రెచ్చగొట్టే లక్ష్యంతో జరిగిన ఈ ఘటన ప్రజలను నిలువుగా చీల్చుతుందన్న భయం అందరిలోనూ ఉన్నది. మతం మెదళ్ళను విషపూరితం చేసి దేవుడిపేరుతో కొట్టిచంపేయడాలు, నరికేయడాలు జరిగిపోతున్న పాడుకాలం ఇది. ఇటువంటి దాడి మరోవర్గానికి చెందిన మతోన్మాదులకు ఊతం ఇచ్చే అవకాశమూ ఉన్నది. నిరసనలు తెలియచేయడానికి చాలా మార్గాలుండగా, కొందరు ఉన్మాదులు పాల్పడే ఇటువంటి దుశ్చర్యలు ఓ వర్గాన్ని మొత్తంగా నిందించడానికి అవకాశమిస్తాయి. విష విద్వేష రాజకీయాలు నెరిపే నాయకులు చల్లగా చక్కగా ఉంటే వారిని గుడ్డిగా నమ్మే అమాయకులు మాత్రం బలైపోతుంటారు. మెజారిటీ, మైనారిటీ విభజనే అధికారానికి నిచ్చెనమెట్లుగా ఉపకరిస్తున్న వర్తమాన వాతావరణంలో ఇటువంటి ఘటనలతో ప్రభావితం కాకుండా యావత్ సమాజం జాగ్రత్తగా ఉన్నప్పుడే, భారత సమాజ మౌలిక లక్షణమైన సహజీవన, బహుళత్వ సంస్కృతిని పరిరక్షించుకోగలుగుతాం.

Updated Date - 2022-06-30T06:55:41+05:30 IST