వ్యర్థ ప్రేలాపనలు

ABN , First Publish Date - 2022-06-07T06:29:45+05:30 IST

మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో, బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి నూపుర్ శర్మనూ..

వ్యర్థ ప్రేలాపనలు

మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో, బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి నూపుర్ శర్మనూ, ఢిల్లీ బీజేపీ మీడియా ఇంచార్జి నవీన్ కుమార్ జిందాల్‌ను పార్టీ నుంచి బహిష్కరించి, ప్రాథమిక సభ్యత్వం తొలగించడం ద్వారా ఇస్లామిక్ ప్రపంచం ఆగ్రహాన్ని చల్లార్చేందుకు బీజేపీ ఓ ప్రయత్నం చేసింది. పార్టీ వైఖరికి భిన్నంగా మీ మాటలున్నందున మీపై విచారణ సాగుతుందని ఆ సస్పెన్షన్ లేఖలో పేర్కొనడంతో పాటు, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి విడుదల చేసిన ప్రకటన బీజేపీ అంటే గిట్టనివారిని సైతం ఆశ్చర్యపరిచే రీతిలో ఉంది. తమ పార్టీ అన్ని మతాలనూ గౌరవిస్తుందనీ, ఏ మతానికీ, మతసంబంధిత వ్యక్తులకూ అవమానం జరిగినా సహించదనీ, ఏ మతాన్నీ అవమానించే ప్రయత్నాన్ని అంగీకరించదనీ, ఇందుకు భిన్నమైన వైఖరిని ప్రదర్శించే వ్యక్తులను తమపార్టీ సహించదని ఆ ప్రకటన పేర్కొంది. బీజేపీ ఇంతకాలమూ మనకు తెలియనివ్వని రహస్యమంటూ కొందరు ఈ ప్రకటనమీద జోకులు వేశారు కూడా.


ఇస్లామిక్ ప్రపంచాన్ని తీవ్ర ఆగ్రహానికి గురిచేసిన ఆ వ్యాఖ్యలు నూపుర్ శర్మ చేసి దాదాపు పదిరోజులైనా ఆదివారం వరకూ బీజేపీ కానీ కేంద్రప్రభుత్వం కానీ దిద్దుబాటు చర్యలు తీసుకోకుండా ఎందుకు ఊరుకున్నాయో తెలియదు. ఈ ప్రయత్నమేదో ముందుగా జరిగివుంటే భారత ఉపరాష్ట్రపతి తమ దేశంలో ఉండగానే, భారత రాయబారిని పిలిపించుకొని ఘాటైన నిరసన తెలియచేసే అవకాశం ఖతార్ కు దక్కేది కాదు. ఇంతటి ఉన్నతస్థాయి పర్యటన ఉన్నప్పుడు విదేశాంగశాఖ ముందుగానే పరిస్థితులను పసిగట్టి చక్కదిద్దడం దేశప్రయోజనాలకు అవసరం. బీజేపీ సవరణలూ వివరణల తరువాత కూడా ఖతార్ ఉపశమించకుండా ఈ వ్యాఖ్యలను భారత ప్రభుత్వం ఖండించాలని, బహిరంగ క్షమాపణలు చెప్పాలని అడుగుతున్నది. ఇది సరైనదా కాదా అన్నది అటుంచితే, దేశం పరువు తీసేట్టుగా వ్యవహరించిన పార్టీయే ఇందుకు క్షమాపణలు చెప్పాలి కానీ, దేశం మొత్తం ఎందుకు తలదించుకోవాలన్న విపక్షాల వాదన కాదనలేనిది. ఇక, ఖతార్‌కు భారతప్రభుత్వం ఇచ్చిన వివరణలో ఎవరో ఒక ఉన్మాది ఈ వ్యాఖ్యలు చేశాడంటూ చేతులు దులిపేసుకొనే ప్రయత్నంలో భాగంగా బీజేపీ అధికార ప్రతినిధిని ఆ విధంగా వ్యాఖ్యానించవలసి రావడం పార్టీకి కూడా నగుబాటే. ఆ వివరణతో ఖతార్ శాంతించకపోగా, కువైట్, ఎలాగూ పాకిస్థాన్, ఆ తరువాత అరబ్ దేశాలు గతంలో ఎన్నడూ లేనంత దూకుడు వైఖరి ప్రదర్శించాయి. ముస్లింమైనారిటీల పట్ల భారత ప్రభుత్వం సరిగా వ్యవహరించడం లేదని ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ (ఓఐసీ) అప్పుడప్పుడు వ్యాఖ్యానిస్తున్నప్పటికీ, అత్యధికశాతం ఇస్లామిక్ దేశాలు ఈ అంశంపై నేరుగా ఎన్నడూ నోరువిప్పింది లేదు. పాకిస్థాన్ ఎంత ఎగదోసినా, దేశంలో ఎన్ని ఘటనలు జరిగినా అవి మర్యాదగానే వ్యవహరించాయి. భారతదేశంలోని ముస్లి్ల స్థితిగతుల, ఇక్కడ పాలకులు అమలుచేస్తున్న మతాధారిత రాజకీయాల జోలికి అవి రాదల్చుకోలేదు కనుకనే, గత ఎనిమిదేళ్ళుగా అంతర్జాతీయ స్థాయిలో ఎన్నడూ ఇంత రాద్ధాంతం జరగలేదు. కానీ, ఇప్పుడు అధికారపక్షం నాయకులు గీత దాటేశారు. ఇంతవరకూ ఇక్కడి ముస్లింలనూ, వారి కట్టడాలనూ, గతకాలపు ముస్లిం పాలకులను ఆడిపోసుకుంటూ రాజకీయం నడిపినవారు ఇప్పుడు ఏకంగా మతాన్నే నిందించడంతో లక్ష్మణరేఖ దాటినట్టయింది, ఇస్లామిక్ ప్రపంచాన్ని కాలుదువ్వి కయ్యానికి ఆహ్వానించినట్టయింది. ఇంతవరకూ ఒకపక్కన ఇస్లామిక్ దేశాలతో జాగ్రత్తగా ఉంటూ, మరొకపక్క దేశీయంగా తమకు నచ్చిన మతరాజకీయాన్ని నడుపుకుంటున్న పాలకులు ఈ పరిణామంతో ఆత్మరక్షణలో పడవలసి వచ్చింది. పార్టీ పెద్దలకు ఉన్న ఈ నైపుణ్యం నూపుర్, జిందాల్ వంటివారికి ఉండదు కనుక వారు రెచ్చిపోయి, దేశాన్ని ప్రమాదంలో పడేశారు. వీరిద్దరి మాటలు దేశానికి ఆర్థికంగా ఎంత నష్టంచేయబోతున్నాయో రాబోయే రోజుల్లో మరింత స్పష్టంగా తెలుస్తుంది. అమృతోత్సవ భారతం ఎంతో కష్టపడి నిర్మించుకున్న బంధాన్ని ఎంతో సులువుగా కూల్చివేశారు వీరు. పాకిస్థాన్ కు ఎక్కడలేని శక్తీ ఇప్పుడు వచ్చింది. ఇంతకాలం దాని చేతికి చిక్కని మత ఆయుధాన్ని ఇప్పుడు నేరుగా అందించింది మనమే. నిప్పుచల్లారకుండా అది తనవంతుగా ఎగవేస్తూనే ఉంటుంది. బీజేపీ ప్రతినిధి తన సుదీర్ఘ ప్రకటనలో అవవసరార్థం అన్నమాటల్లో కొన్నింటినైనా ఆచరణలో చూపకపోతే ఈ అగ్గి చల్లారే అవకాశం లేదు.

Updated Date - 2022-06-07T06:29:45+05:30 IST