దేశ రక్షణకు సిద్ధం

ABN , First Publish Date - 2020-07-07T09:00:28+05:30 IST

బాక్సింగ్‌ నా జీవితంలో భాగమైతే భారతదేశం నా ఊపిరి. చిన్నతనంనుంచే ఆర్మీలో చేరాలన్న ఆలోచన ఉండేది. కానీ, నాన్న, అన్నయ్య బాక్సింగ్‌లో...

దేశ రక్షణకు సిద్ధం

ఎన్నో అడ్డంకులు అధిగమించి రింగ్‌లో గెలిచి నిలిచిన తెలుగు కుర్రాడు మహ్మద్‌ హుస్సాముద్దీన్‌.. దేశ రక్షణ కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధమంటున్నాడు. 2018 కామన్వెల్త్‌ క్రీడల్లో కాంస్య పతకం నెగ్గి భారత సైన్యంలో సుబేదార్‌గా చేరిన ఈ యువ బాక్సర్‌.. ఇటీవల గాల్వన్‌ లోయ వద్ద జరిగిన ఘటనపై స్పందించాడు. లాక్‌డౌన్‌లోనూ ఇంటివద్ద విశ్రాంతి లేకుండా సాధన చేస్తున్న హుస్సాముద్దీన్‌.. ఆర్మీ ఆదేశిస్తే ఎక్కడైనా విధులు నిర్వహిస్తానంటున్నాడు. 

ఇంకా ఏమేం చెప్పాడంటే...అతని మాటల్లోనే...

బాక్సింగ్‌ నా జీవితంలో భాగమైతే భారతదేశం నా ఊపిరి. చిన్నతనంనుంచే ఆర్మీలో చేరాలన్న ఆలోచన ఉండేది. కానీ, నాన్న, అన్నయ్య బాక్సింగ్‌లో ఉండడంతో నేను కూడా బాక్సర్‌గా మారా. బాక్సర్‌గా అంతర్జాతీయ స్థా  యిలో రాణిస్తుండడంతో 2012లో అనూహ్యంగా భారత సైన్యంలో చేరే అవకాశం లభించింది. తొలుత హవల్దార్‌గా చేరిన నాకు 2018లో కామన్వెల్త్‌ పతకం సాధించాక సుబేదార్‌గా పదోన్నతి లభించింది. ఇటీవల గాల్వన్‌ లోయ వద్ద ఇండో-చైనా సరిహద్దు వద్ద జరిగిన ఘర్షణలో భారత జవాన్లు ప్రాణాలు కోల్పోవడం నన్ను తీవ్రంగా కలచి వేసింది. కరోనా మహమ్మారిని నియంత్రించడానికి ఓవైపు ప్రపంచమంతా పోరాడుతుంటే, సరిహద్దుల్లో చైనా ఆ విధంగా వ్యవహరించడం దురదృష్టకరం. ఆర్మీ నుంచి పిలుపు వస్తే దేశ రక్షణ కోసం ఎక్కడైనా పనిచేస్తా. ఎలాంటి త్యాగానికైనా సిద్ధంగా ఉన్నా.


ఒలింపిక్స్‌ ట్రయల్స్‌ కోసం షాడో ప్రాక్టీస్‌

లాక్‌డౌన్‌తో మూడు నెలలుగా ఇంటికే పరిమితమయ్యా. కానీ, సాధనకు విరామం ఇవ్వలేదు. నా కేటగిరీ (57 కిలోలు)తో పాటు మరో మూడు విభాగాలకు ఇంకా ట్రయల్స్‌ నిర్వహించాల్సి ఉంది. ఒలింపిక్స్‌ వాయిదా పడడంతో ఈ ప్రక్రియ కూడా ఆగిపోయింది. అలాగని విశ్రాంతి తీసుకుంటే లయ దెబ్బ తింటుందేమోనని ఇంటిపైన.. నాన్న షంసాముద్దీన్‌ పర్యవేక్షణలో తమ్ముడు ఖైముద్దీన్‌తో కలిసి శిక్షణ కొనసాగించా. ఖైముద్దీన్‌ కూడా బాక్సర్‌ కావడంతో మంచి ప్రాక్టీస్‌ లభిస్తోంది. ఉదయం మూడు గంటలు, సాయంత్రం రెండు గంటలు సాధన చేస్తున్నా. నిద్ర లేవగానే గంట సేపు  ఫిట్‌నెస్‌ సంబంధిత వ్యాయామాలు చేశాక, షాడో ప్రాక్టీసింగ్‌తో మొదలు పెట్టి సంప్రదాయ బౌట్‌తో ముగిస్తా. సాయంత్రం కూడా అంతే. విరామ సమయంలో యూట్యూబ్‌లో దిగ్గజ బాక్సర్ల బౌట్లు చూసి కొన్ని మూమెంట్స్‌, టెక్నిక్స్‌ను పరిశీలించి వాటిని తర్వాతి ప్రాక్టీస్‌ సెషన్‌లో ప్రయత్నిస్తున్నా


చాయ్‌ మాత్రమే చేస్తా..

నేను భోజన ప్రియుడిని. పటియాలలోని సాయ్‌ సెంటర్‌లో అక్కడ ఇచ్చే డైట్‌ తప్ప అదనంగా తినడానికి ఏమీ ఉండదు. దీంతో ఇంటికొచ్చినప్పుడు అమ్మతో నాకు నచ్చిన వంటకాలన్నీ చేయించుకుని ఒక పట్టు పడతా. మటన్‌ బిర్యానీ నా ఫేవరెట్‌. నాన్‌వెజ్‌ వంటకాలన్నీ ఇష్టంగా తింటా. కానీ, వంట చేయడం మాత్రం రాదు. చిన్నప్పటి నుంచి చాయ్‌ బాగా తాగే అలవాటుంది. దాంతో లాక్‌డౌన్‌ సమయంలో చాయ్‌ పెట్టడం మాత్రం నేర్చుకున్నా

(ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి -హైదరాబాద్‌)

Updated Date - 2020-07-07T09:00:28+05:30 IST