మోగని భేరి... ఆగని జనం

ABN , First Publish Date - 2022-05-28T08:35:52+05:30 IST

మోగని భేరి... ఆగని జనం

మోగని భేరి... ఆగని జనం

మంత్రుల బస్సు వచ్చేసరికే సగం మంది వెనక్కి.. ఖాళీ కుర్చీలకే మంత్రుల ఘోష

ఆపిన పోలీసులనూ నెట్టుకుని బయటకు జనం.. రాజమహేంద్రిలో చేదు అనుభవం

విశాఖలో ‘యాత్ర’కు తరలింపులో తంటాలు.. బస్సులు, ఆటోల్లో బలవంతపు రవాణా


రాజమహేంద్రవరం, విశాఖపట్నం, అనకాపల్లి, మే 27: వైసీపీ సామాజిక న్యాయభేరి మోగలేదు. జనమూ ఆగలేదు. 17 మంది మంత్రులు వచ్చేసరికే సగానికి పైగా జనం వెళ్లిపోయారు. మంత్రులు వచ్చినప్పుడు పోలీసులు గేట్లు వేసి ఆపాలని చూసినా జనం ఆగలేదు. వాళ్లను తోసుకుంటూ వెళ్లిపోయారు. చివరకు ఖాళీ కుర్చీలకు తాము చెప్పాల్సింది చెప్పుకొని మంత్రులు అక్కడినుంచి కదిలారు. ఇది తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో శుక్రవారం జరిగిన వైసీపీ సామాజిక భేరి దృశ్యం. పథకాలు ఆపేస్తామని డ్వాక్రా మహిళలను బెదిరగొడుతూ, ఉపాధి పనులు నిలిపివేస్తామని కూలీలను అదరగొడుతూ మంత్రుల సభలను విజయవంతం చేసేందుకు అధికారులు చెమటోర్చుతున్నారు. విశాఖపట్నంలో శుక్రవారం పూర్తిగా డ్వాక్రా మహిళలతో ‘యాత్ర’ సభను లాగించేశారు. విశాఖలో తిరిగి మొదలైన యాత్ర రాజమహేంద్రవరానికి సాయంత్రం నాలుగు గంటలకు చేరుకుంటుందని చెప్పారు. దీనికోసం మధ్యాహ్నం రెండుగంటల నుంచే వివిధ బస్సులలో తీసుకొచ్చి మహిళలు, వృద్ధులను కూర్చోపెట్టారు. కానీ 6 గంటలైనా మంత్రుల బస్సు రాకపోవడంతో జనం తిరుగుముఖం పట్టారు. సుమారు రాత్రి 7 గంటలకు మంత్రుల బస్సు వచ్చింది. అప్పటికే సగం జనం వెళ్లిపోయారు. ఎందుకు జనాన్ని తీసుకొచ్చి ఇబ్బంది పెడతారని పోలీసులతో మహిళలు వాగ్వాదానికి దిగారు. ఈ సభ జన సమీకరణకు మండలానికి 15 ప్రైవేట్‌ బస్సుల వరకూ ఏర్పాటు చేశారు. ఇక, మంత్రుల బస్సుయాత్రతో కాకినాడ జిల్లా శంఖవరం మండలం కత్తిపూడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ పోలీసులు షాపులు మూసివేయించారు. బస్సులు కాంప్లెక్స్‌కు రాకుండా దారి మళ్లించారు. కిలోమీటరు నడిచివెళ్లి బస్సు ఎక్కాల్సి రావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 


డ్వాక్రా మహిళలతో..

వైసీపీ మం త్రులు శుక్రవారం గాజువాకలో నిర్వహించిన ‘సామాజిక న్యాయభేరి బస్సుయాత్ర’ సభలో స్వయం సహాయక సంఘాల సభ్యులే కనిపించారు. సభకు హాజరైన వారిలో 90 శాతానికిపైగా డ్వాక్రా మహిళలే ఉన్నారు. గాజువాక సభకు చుట్టుపక్కల ప్రాంతాల్లో గల ప్రతి రిసోర్స్‌ పర్సన్‌ (ఆర్‌పీ) తమ పరిధిలోని మహిళా సంఘాల సభ్యులను తీసుకురావాలని జీవీఎంసీ యూసీడీ అధికారులు ఆదేశించారు. దీంతో ఉదయం ఎనిమిది గంటలకే నాయకులు ఏర్పాటు చేసిన బస్సులు, ఆటోల్లో మహిళలు సభా వేదిక వద్దకు చేరుకున్నారు. సభకు వచ్చిన మహిళలను ఆర్‌పీలు గ్రూపు ఫొటోలు తీసి తమ ఉన్నతాధికారులకు పంపించడం కనిపించింది. 


కరోనాలో కన్నీరు చూడలేదు: ధర్మాన 

కరోనా సమయంలో ఒక్క కుటుంబం కూడా రాష్ట్రంలో కన్నీళ్లు కార్చలేదని రెవెన్యూశాఖ మంత్రి  ధర్మాన ప్రసాదరావు అన్నారు. రాజమహేంద్రవరం స్టేడియంలో శుక్రవారం రాత్రి జరిగిన సామాజిక భేరి యాత్ర సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.  


బీసీలకు పెద్దపీట ఘనత మాదే: మంత్రులు

దేశంలో ఎక్కడా లేనివిధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు వైసీపీ పెద్దపీట వేసిందని ఉప ముఖ్యమంత్రి ముత్యాలనాయుడు అనకాపల్లి సభలో అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బడుగు, బలహీన వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చి రాజకీయాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చిన ఘనత జగన్‌కు దక్కుతుందన్నారు. మంత్రులు ఉషశ్రీ, నారాయణస్వామి, రాజన్నదొర, ఆదిమూలపు సురేశ్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని వర్గాలకు జగన్‌ సీఎంగా ఉంటేనే తగిన న్యాయం జరుగుతుందన్నారు.



Updated Date - 2022-05-28T08:35:52+05:30 IST