Abn logo
Mar 20 2020 @ 03:10AM

మోదీ మాట

కరోనాపై పోరులో ఏమాత్రం అలసత్వం కూడదంటూ ప్రధాని నరేంద్రమోదీ మెత్తని మాటలతో గట్టి హెచ్చరికలే చేశారు. కరోనాకు మందు, మార్గాంతరం లేని స్థితిలో పౌరులు చిత్తం వచ్చినట్టు కాక, సమష్టి బాధ్యతతో నడుచుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నేను అడిగింది మీరెప్పుడూ కాదనలేదు, సాధించిందంతా మీ సహకారంతోనే అంటూ ప్రజల చేయూతను కాంక్షించారు. ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటున్నది విస్పష్టంగా చెబుతూనే, యావత్‌ ప్రపంచాన్ని ముంచెత్తుతున్న ఈ వ్యాధికి భారత్‌ అతీతమన్న ధైర్యం ఏమాత్రం కూడదని హెచ్చరిక చేశారు. కరోనా సమస్యను రెండు ప్రపంచయుద్ధాలకంటే పెద్దదని గుర్తుచేస్తూ, ప్రపంచయుద్ధాల పొగలూ సెగలూ సోకని దేశాలు కూడా ఉన్నాయి కానీ, కరోనా చుట్టుముట్టనివి లేవని హెచ్చరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలు గౌరవిస్తూ, సూచనలు పాటిస్తూ ప్రతీ ఒక్కరూ తాము క్షేమంగా ఉంటూ తద్వారా ఈ దేశాన్నీ ప్రపంచాన్నీ కూడా రక్షించాలని విజ్ఞప్తిచేశారు. 


దేశ నాయకుడిగా మోదీ అరగంట పాటు చేసిన ఈ ప్రసంగం ఈ సంక్షోభ కాలంలో కచ్చితంగా ప్రజల్లో విశ్వాసం పెంచుతుంది. ఆయన మొఖంలో రవ్వంత ఆందోళనైనా కనిపించనట్టే, ప్రసంగం కూడా ప్రజల్లో ఎటువంటి భయాలూ కలిగించలేదు. సంయమనంతో, దృఢ సంకల్పంతో, పరస్పర సహకారంతో ముందుకు సాగితే ఈ మహమ్మారిమీద నెగ్గుకు రావచ్చునన్న ధైర్యాన్ని ఇచ్చింది. చెప్పిన జాగ్రత్తలు అనేకం విన్నవే కావచ్చును కానీ, ప్రధాని విజ్ఞప్తి ప్రభావం కచ్చితంగా ప్రజలమీద ఉంటుంది. ధైర్యంతో పాటుగానే పరిస్థితి తీవ్రతను తెలియచెప్పడానికి ఆయన సంకోచించలేదు. కరోనా ఏ మాత్రం లేదనో, అంతా సవ్యంగా ఉన్నదనో నిన్నమొన్నటి వరకూ నమ్మిన దేశాలు కూడా ఒక్కసారిగా భగ్గుమన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. వచ్చే ఆదివారం ఆయన ప్రకటించిన జనతాకర్ఫ్యూ అసలు లక్ష్యం రాబోయే సంక్షోభానికి మనని మనం సంసిద్ధం చేసుకోవడానికే. ఉదయం ఏడునుంచి రాత్రి తొమ్మిది గంటలవరకూ ఇళ్ళకే పరిమితమై తలెత్తబోయే పరిస్థితులకు మనలను అలవాటు పడమన్నారు. జనం కోసం జనమే విధించుకొనే ఈ కర్ఫ్యూ ప్రజలకు పరస్పరం దూరంగా ఉండటాన్ని అలవాటు చేస్తుంది. అవసరం లేనిదే బయటకు రాకండి, ఉద్యోగాలు, వ్యాపారాలు ఇంటినుంచే చేసుకోండి, ఆపరేషన్ల వంటివి వాయిదా వేసుకోండి వంటి సూచనలన్నీ ప్రజలను మానసికంగా సమాయత్తం చేస్తాయి. ఆదివారం సాయంత్రం సైరన్‌ సూచన వెంటనే ప్రజలంతా చప్పట్లు చరుస్తూ కరోనాపై పోరాడుతున్న సమస్త వ్యవస్థలకూ సంఘీభావం ప్రకటించాలన్నది మంచి సూచన. ప్రజలను ఈ పోరాటంలో మమేకం చేయడానికీ, సమష్టిగా పోరాడుతున్నామన్న భావన కలిగించడానికీ ఇది ఉపకరిస్తుంది.


నిజానికి నరేంద్రమోదీ జాతినుద్దేశించి ప్రసంగించబోతున్నారని తెలియగానే ప్రజలు తమ గత అనుభవాల రీత్యా అనేకం ఊహించుకున్నారు. మెడికల్‌ ఎమర్జెన్సీ ప్రకటిస్తారనీ, ఇందిరమాదిరిగా దేశాన్ని అత్యయిక స్థితికి తెస్తారనీ, లాక్‌డౌన్‌ అంటారనీ ఏవేవో గాలి వార్తలు చక్కెర్లు కొట్టాయి. గురువారం రాత్రి ప్రధాని ప్రసంగించబోతున్నట్టుగా రోజుముందే అధికారిక ప్రకటన వెలువడం కూడా ప్రజల్లో కొన్ని అనుమానాలు రేకెత్తించింది. కొందరు ముందు జాగ్రత్త పేరిట ఏటీఎంల నుంచి డబ్బు విత్‌డ్రా చేయడం, నెలా రెండు నెలలకు సరిపడా సరుకులు కొనిపారేయడం వంటివి జరిగాయి. ఈ ప్రసంగం విన్న తరువాత అనేకుల మనసులు కచ్చితంగా తేటపడి ఉం టాయి. మందులు, అత్యవసరాలకు ఏలోటూ రాబోదని హామీ ఇస్తూ, హడావుడి కొనుగోళ్ళు ఎంతమాత్రం కూడదని ప్రధాని హితవు చెప్పారు. కఠినమైన చర్యలు ప్రకటించకుండా ఇలా కేవలం హితవు చెప్పినందువల్ల ప్రయోజనం ఏముంటుందని నిట్టూరుస్తున్నవారూ ఉన్నారు. ఎంతటి విపత్తులోనూ ప్రజలు తమకు తాముగా బాధ్యతాయుతంగా నడవరన్నది వారి వాదన. మరీ ముఖ్యంగా మోదీ తన ప్రసంగంలో లాక్‌డౌన్‌ వినా మరేం మాట్లాడినా ప్రయోజనం ఉండదని ట్వీట్‌ చేసిన మాజీ కేంద్రమంత్రి చిదంబరానికి ఈ ప్రసంగం కచ్చితంగా నిరాశ కలిగించి ఉంటుంది. ప్రధాని ప్రసంగానికి కాస్తముందు కరోనా వ్యాప్తి నియంత్రణకు ప్రభుత్వం మరిన్ని నిర్ణయాలు ప్రకటించింది. తన ఉద్యోగులకు సైతం ఇంటినుంచి పనిచేయగలిగే వెసులు బాటు కల్పించింది. కరోనా విషయంలో దేశం ప్రస్తుతం రెండో దశలో ఉన్నదనీ, ఇకపై స్థానిక వ్యాప్తిని గుర్తించడం, నిరోధించడం కష్టమేమీ కాదని కొందరి వాదన. చాలా దేశాల మాదిరిగా ప్రజాసమూహాలకు పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహించే విషయంలో మనం విఫలమైనందున తీవ్ర ప్రమాదం పొంచివున్నదని మరికొందరి భయం. దేశం ఒక పెద్ద విపత్తు ఎదుర్కొంటున్న స్థితిలో విజయమే లక్ష్యంగా రాజకీయపక్షాలూ ప్రజలూ సంఘటితంగా, బాధ్యతాయుతం వ్యవహరించడం ముఖ్యం.

Advertisement
Advertisement
Advertisement