సంస్కరణలతో ముందుకు

ABN , First Publish Date - 2020-05-31T07:48:14+05:30 IST

ప్రజలందరి సమష్టి కృషితో భారత్‌ ప్రగతిపథంలో పయనిస్తోందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. రెండోసారి అధికారం చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా శనివారం ఆయన తన ట్విటర్‌ ఖాతాలో...

సంస్కరణలతో ముందుకు

  • తొలి రోజు నుంచే కీలక నిర్ణయాలు: మోదీ
  • ఏడాది పాలనపై ప్రధాని ‘డాక్యుమెంట్‌’ 

న్యూఢిల్లీ, మే 30: ప్రజలందరి సమష్టి కృషితో భారత్‌ ప్రగతిపథంలో పయనిస్తోందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. రెండోసారి అధికారం చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా శనివారం ఆయన తన ట్విటర్‌ ఖాతాలో, వెబ్‌ పోర్టల్‌లో ‘వికాస్‌ యాత్ర’ పేరిట డాక్యుమెంట్‌ను షేర్‌ చేశారు. ఏడాది కాలంగా తన ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలను ఇందులో వివరించారు. తమ ప్రభుత్వం తొలిరోజు నుంచే అతిపెద్ద సంస్కరణలను ప్రారంభించిందని తెలిపారు. జమ్మూకశ్మీర్‌, లద్దాఖ్‌ అంశం నుంచి కార్పొరేట్‌ పన్నుల కోత, అయోధ్య సమస్యకు సామరస్య పరిష్కారం దాకా ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు వివరించారు. కరోనా వైర్‌సపై పోరులో వేగంగా స్పందించి లాక్‌డౌన్‌ విధించడం, రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించడం వంటి సాహసోపేతమైన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. కాగా.. ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం ఎన్నో చారిత్రక తప్పిదాలను సరిదిద్దిందని కేంద్ర మంత్రి అమిత్‌షా, దేశ ప్రజాస్వామ్యానికి మోదీ కొత్త దిశను నిర్దేశించారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వ్యాఖ్యానించారు. మోదీ ప్రభుత్వం నిర్ణయాత్మకమైనదని బీజేపీ ప్రధాన కార్యదర్శి బీఎల్‌.సంతోష్‌ అన్నారు.


రాహుల్‌ పరిమిత జ్ఞాని: నడ్డా

కరోనా వైర్‌సను నియంత్రించడంలో మోదీ ప్రభుత్వం విఫలమైందన్న కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీది పరిమితమైన జ్ఞానమని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. ఆయన ప్రకటనలు కరోనా సంక్షోభం గురించి కాకుండా రాజకీయాలు చేస్తున్నట్లుగా ఉన్నాయన్నారు. అభివృద్ధి చెందిన దేశాలు కూడా నిస్సహాయ స్థితిలో పడిపోగా.. మోదీ ప్రభుత్వ సాహసోపేత, సమయానుకూల నిర్ణయాల వల్లే భారత్‌లో పరిస్థితి నియంత్రణలో ఉందన్నారు.


నిరాశ, వినాశనం, దౌర్జన్యం, బాధాకరం

మోదీ ప్రభుత్వం సాధించినది ఇదే: కాంగ్రెస్‌

మోదీ పాలనను ‘నిరాశ, వినాశనకరం, దౌర్జన్యం, బాధాకరం’గా కాంగ్రెస్‌ పార్టీ అభివర్ణించింది. ఎన్డీయే తన ఆరేళ్ల పాలనలో ప్రజల్లో సానుభూతి బంధాలను తెంచేయడం, మతతత్వాన్ని రెచ్చగొట్టి సమాజంలో సోదర భావాన్ని నీరుగార్చడం వంటి దుశ్చర్యలకు పాల్పడిందని ఆరోపించింది. రెండోసారి ప్రధానిగా మోదీ ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన పాలనపై కాంగ్రెస్‌ నేతలు కేసీ వేణుగోపాల్‌, రణదీప్‌ సుర్జేవాలా శనివారం విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ ఆరేళ్లలో మదర్‌ ఇండియా గాయపడిందన్నారు. ప్రజలచే ఎన్నుకోబడిన పార్లమెంటును అణిచివేస్తూ ప్రజాస్వామ్యం గొంతును మోదీ నొక్కుతున్నారని ఆరోపించారు. వలస కార్మికులు, రైతులు, సామాన్య ప్రజలు అష్టకష్టాలు పడుతున్నా పట్టించుకోకుండా ప్రభుత్వం మొద్దుబారిపోయిందని మండిపడ్డారు.


మహిళలకు గౌరవం లేదు: రాహుల్‌

దేశంలో మహిళలకు గౌరవం లేదని, వారిపై నిరంతరం దౌర్జన్యం కొనసాగుతోందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. గుజరాత్‌లో కొందరు పురుషులు 16 ఏళ్ల బాలికను విచక్షణా రహితంగా కొడుతూ, కాళ్లతో తొక్కుతున్న వీడియోను ఆయన తన ట్విటర్‌లో శనివారం పోస్టు చేశారు.



Updated Date - 2020-05-31T07:48:14+05:30 IST