Abn logo
Sep 9 2021 @ 02:19AM

యూపీ ఎన్నికల కోసమే మోదీ-కేసీఆర్‌ మంత్రాంగం

ఎంఐఎంను నిలబెట్టే సీట్లపైనే వారిద్దరి మధ్యచర్చ

యోగిని మళ్లీ సీఎం చేయడానికి పావులు

మోదీ - కేసీఆర్‌ది ఫెవికాల్‌ బంధం: రేవంత్‌ రెడ్డి

సీఎం కేసీఆర్‌ విధానాలపై రాహుల్‌కు వివరించా

‘దళిత బంధు’ సాధ్యమేనా?.. రాహుల్‌ ఆరా


న్యూఢిల్లీ, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీని ఎన్ని సీట్లలో నిలబెట్టాలన్న అంశంపైనే ప్రధాని మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షాతో సీఎం కేసీఆర్‌ చర్చించారని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీని యూపీలో పెట్టి.. యోగి ఆదిత్యనాథ్‌ను మళ్లీ సీఎం చేయడానికే ఈ చర్చలు సాగాయన్నారు. వారం రోజుల పాటు ఢిల్లీలో ఉన్న సీఎం రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న అంశాలపై కేంద్రం నుంచి నిర్దిష్టమైన హామీ ఎందుకు తీసుకోలేదని నిలదీశారు. ఢిల్లీలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీతో భేటీ అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడారు. ఢిల్లీలో టీఆర్‌ఎస్‌ కార్యాలయం ఆత్మగౌరవానికి ప్రతీక కాదని, ఇది ఆత్మద్రోహం చేసుకోవడమేనని అన్నారు.


కేసీఆర్‌ రాజకీయంగా అండగా నిలబడుతున్నారు కాబట్టి ప్రధాని మోదీ టీఆర్‌ఎస్‌ కార్యాలయం నిర్మాణానికి స్థలాన్ని కేటాయించారన్నారు. కేంద్రం ఇచ్చే స్థలంలో అమరుల స్థూపం కట్టి ఉంటే అది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అవుతుందని చెప్పారు. మోదీకి తెలంగాణ త్యాగాలపైన గౌరవం ఉంటే ఢిల్లీలో తెలంగాణ అమరుల స్థూపం నిర్మాణానికి ఒక ఎకరం భూమిని కేటాయించాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణకు సీఎం కేసీఆర్‌ కుటుంబమే అతిపెద్ద సమస్య అని వ్యాఖ్యానించారు. బడులు, బార్లు, గుళ్లు తెరవడానికి రాష్ట్రంలో అనువైన పరిస్థితులు ఉన్నాయి కానీ ఉప ఎన్నిక నిర్వహించడానికి మాత్రం అనువైన పరిస్థితులు లేవని సీఎం కేసీఆర్‌ కేంద్రానికి చెప్పారని, దీనికి మోదీ ఒప్పుకున్నారని ఎద్దేవా చేశారు. మోదీ-కేసీఆర్‌లది ఫెవికాల్‌ బంధమని.. బండి సంజయ్‌, ఈటల రాజేందర్‌ వచ్చి తెంపితే తెగే బంధం కాదన్నారు. బండి సంజయ్‌ వేళ్లు విరిగినా, ఈటల మోకాలి చిప్పలు అరిగినా ఎవ్వరూ కనికరించేవారు లేరని, వాళ్లను చూస్తే జాలేస్తున్నదని ఆయన అన్నారు. 


పార్టీ బలోపేతంపై రాహుల్‌ సలహాలు

పార్టీ బలోపేతానికి సంబంధించి రాహుల్‌ పలు సూచనలు, సలహాలు ఇచ్చారని రేవంత్‌రెడ్డి తెలిపారు. విద్యార్థులు, అమరుల కుటుంబాలు, ఉద్యమకారులు, నిరుద్యోగ యువత, రైతులు, దళితులు, గిరిజనులు, మైనారిటీలకు అండగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై కొట్లాడడానికి కార్యాచరణను రాహుల్‌ గాంధీ ముందుకు తీసుకొచ్చి చర్చించామని చెప్పారు. రాజకీయ ఒత్తిళ్లను ఎదుర్కొని కాంగ్రెస్‌ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిందని, కానీ ఉద్యమ ఆకాంక్షలు నెరవేరలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానంగా నిరుద్యోగ సమస్య, రైతు రుణమాఫీ, పంటలకు గిట్టుబాటు ధర, రాష్ట్రంలో భూముల అమ్మకాల్లో అవినీతి, ప్రాజెక్టుల్లో కుంభకోణాలు వంటి అంశాలను రాహుల్‌ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. అలాగే, బూత్‌ స్థాయి నుంచి పార్లమెంటరీ నియోజకవర్గం స్థాయి వరకు పార్టీ బలోపేతంపై చర్చించామన్నారు. డిసెంబరు 9న ఒకేరోజు 10 లక్షల మందికి పార్టీ ప్రాథమిక సభ్యత్వం ఇవ్వనున్నామని చెప్పారు. ఏ ఆకాంక్షల మేరకు సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారో ఆ ఆకాంక్షల ప్రతిపాదికన భవిష్యత్తులో తమ ఉద్యమ కార్యాచరణ ఉంటుందని స్పష్టం చేశారు. ఈ నెల 17వ తేదీన గజ్వేల్‌లో నిర్వహించనన్ను దళిత గిరిజన దండోర సభకు కొన్ని కారణాల వల్ల రాహుల్‌ గాంధీ రాకపోవచ్చునని ఓ ప్రశ్నకు సమాధానంగా రేవంత్‌ రెడ్డి చెప్పారు. 


డిసెంబరు 9న రాహుల్‌ రాక

డిసెంబరు 9వ తేదీన టీపీసీసీ ఆధ్వర్యంలో నిజామాబాద్‌లో చేపట్టనున్న కాంగ్రెస్‌ సభ్యత్వ నమోదు ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాహుల్‌గాంధీ హాజరు కానున్నారు. సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా ఆ రోజున భారీ ఎత్తున నిర్వహించనున్న సభకు రావాలంటూ రేవంత్‌రెడ్డి కోరగా.. ఆయన అంగీకారం తెలిపారు. అలాగే ప్రతి మూడు నెలలకు ఒక అంశంపైన పార్టీపరంగా కార్యక్రమం తీసుకుంటామని, వాటికీ హాజరు కావాలని కోరగా రాహుల్‌ సానుకూలత వ్యక్తం చేసినట్టు సమాచారం.