కాలాన్ని జయిస్తున్న మోదీ

ABN , First Publish Date - 2020-03-24T05:59:10+05:30 IST

ప్రపంచం ఇప్పుడు కరోనా వైరస్ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దాదాపు 159 దేశాలను చుట్టుముట్టిన కరోనా వైరస్ 2 లక్షల మందికి పైగా ప్రజలకు సోకింది. 9 వేలమందికి పైగా మరణించారు...

కాలాన్ని జయిస్తున్న మోదీ

కరోనా సంక్షోభ వేళ 130 కోట్ల మంది భారతీయుల గుండెచప్పుడు ప్రధాని నరేంద్రమోదీ మాటల్లో ప్రతిధ్వనిస్తున్నది. మన జాతిని ముందుకు నడిపిస్తున్న ధీమా ఆయన మాటల్లో వ్యక్తమవుతోంది. ఇవాళ  ప్రపంచమంతా మన నాయకుడిని ప్రశంసిస్తోంది. అనేక దేశాలు మోదీని ఆదర్శంగా తీసుకుంటున్నాయి. ఆయన కాలానికంటే ఒక అడుగు ముందుకు వేసి ఆలోచిస్తున్నారు. మోదీ మాటల్ని మనం పాటిస్తే ప్రస్తుత సంక్షోభాన్ని అవలీలగా గట్టెక్కగలుగుతాం.


ప్రపంచం ఇప్పుడు కరోనా వైరస్ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దాదాపు 159 దేశాలను చుట్టుముట్టిన కరోనా వైరస్ 2 లక్షల మందికి పైగా ప్రజలకు సోకింది. 9 వేలమందికి పైగా మరణించారు.  ఇలాంటి సంక్షోభ సమయాలు ఎదురైనప్పుడే నాయకత్వ ప్రతిభ బయటపడుతుంది. ప్రజలు సంక్షోభం ఎదుర్కొవ్నప్పుడల్లా నాయకుడి వైపు చూస్తారు. ఇవాళ ఈ రెండు పరిణామాలు జరిగాయి. భారత దేశం అనేక ప్రపంచ దేశాల మాదిరే కరోనా వైరస్ ముప్పును ఎదుర్కొంది. అదే సమయంలో ఆ ముప్పు నుంచి సురక్షితంగా బయటపడవేయగలమన్న నమ్మకాన్ని ప్రజలకు కలిగించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకుడంటే ఎలా వ్యవహరించాలో నిరూపించారు.


కరోనా వైరస్ ముప్పు ప్రబలకుండా ఉండేందుకు ప్రజలు తమంతట తాము స్వచ్ఛందంగా కర్ఫ్యూ పాటించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపునకు వచ్చిన ప్రతిస్పందనను బట్టే దేశ ప్రజలు ఆయన మాటలకు ఎంత విలువ ఇస్తున్నారో అర్థమవుతుంది. మొత్తం దేశం ఆయన మాటకు స్పందించి జనతా కర్ఫ్యూ పాటించింది. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, గవర్నర్, ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ప్రజా ప్రతినిధుల నుంచి సామాన్య పౌరుడి వరకు సాయంత్రం 5 గంటలకు కరతాళ ధ్వనులు, ఘంటానాదాలు, తప్పెట్లు, పళ్లేల మోతలు, శంఖారావాలు మొదలైన వాటి ద్వారా వైద్య సిబ్బంది, పారా మెడికల్ సిబ్బంది, పోలీసు అధికారులు, సఫాయీ కర్మచారులు, మీడియాకు తమ సంఘీభావం ప్రకటించారు. కులమతాలు, జాతులు, వర్గాలు, చిన్నా పెద్దా తారతమ్యం లేకుండా స్త్రీ, పురుషులందరూ ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపును పూర్తిగా పాటించారు.  మొత్తం దేశం ఆత్మ ప్రతిస్పందించింది. ప్రధాని చప్పట్లు కొట్టమన్నందుకు అవహేళన చేసిన కుత్సిత విమర్శకుల నోళ్లు ప్రజల ప్రతిస్పందన చూడగానే మూతపడ్డాయి. ఇది మోదీ విశ్వసనీయతకు సంకేతం.


నిజానికి ప్రదానమంత్రి నరేంద్రమోదీ కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఒక పద్ధతి ప్రకారం చర్యలు తీసుకున్నారు. మొదట్లో ఈ వైరస్ కేవలం చైనాకే పరిమితమవుతుందని అనేకమంది భావించారు. చైనాలో కరోనా వైరస్ బీభత్సం సృష్టిస్తున్న సమయంలోనే ఫిబ్రవరి 24 , 25 తేదీల్లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మన దేశంలో పర్యటించారు. అప్పటికి అమెరికాకు కూడా  వైరస్ తమ దేశానికి, ఇతర దేశాలకు పాకుతుందన్న అంచనా లేదు. పార్లమెంట్ బడ్జెట్ తొలి విడత సమావేశాల్లో కూడా ఈ విషయం చర్చనీయాంశం కాలేదు. బడ్జెట్ రెండో విడత సమావేశాలు మొదటి పది రోజులు కూడా ఈ వైరస్ వ్యాప్తి గురించి ఎవరూ ఊహించలేకపోయారు. కాని మార్చి మొదటి వారం తర్వాత ఇతర దేశాలనుంచి సమాచారం అందగానే ప్రధానమంత్రి అప్రమత్తమయ్యారు. మార్చి 10న జరగాల్సిన హోలీ మిలన్ కార్యక్రమాలను కూడా రద్దు చేసుకున్నారు. మెల్లగా అధికారిక సమావేశాలన్నింటినీ రద్దు చేయడం ప్రారంభించారు. ఇతర దేశాలనుంచి భారతీయుల ఆర్తనాదాలను పట్టించుకోవడం ప్రారంభించారు. చైనాలో చిక్కుకున్న భారతీయులను ప్రత్యేక విమానాల్లో రప్పించి ఐసోలేషన్ వార్డులకు పంపించారు. మార్చి 10 నుంచే ఇతర దేశాల నుంచి కూడా ఎయిర్ ఇండియా విమానాల ద్వారా భారతీయులను రప్పించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకున్నారు. తానే స్వయంగా చొరవ తీసుకుని మార్చి 15న సార్క్ దేశాధినేతలతో  వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి చేపట్టాల్సిన చర్యలను వివరించారు.


ప్రధానమంత్రి తీసుకున్న చర్యలను గత మంగళవారం ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ప్రశంసించింది. భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అద్భుతంగా ఉన్నాయని, ఒక సమస్యను పరిష్కరించేందుకు ఆయన ప్రదర్శించిన నిజాయితీ అపూర్వమని ఈ సంస్థ ప్రతినిధి హెంక్ బెకెడామ్ ప్రశంసల వర్షం కురిపించారు. భారత వైద్య పరిశోధనా మండలి తీసుకుంటున్న చర్యలను కూడా ఈ సంస్థ ప్రశంసించింది. భారత దేశం యుద్ధ ప్రాతిపదికన ఈ వైరస్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధం కావ డాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థే కాదు, ప్రపంచంలోని అన్నిదేశాలూ ప్రశంసిస్తున్నాయి.


‘నేను చాలా సంవత్సరాలుగా భారత ప్రభుత్వాన్ని ప్రతిదానికీ విమర్శిస్తూ వచ్చాను. కాని, ఇటలీలో చిక్కుకుపోయిన నా కూతురును తన స్వంత కూతురులా భావించి నరేంద్రమోదీ మార్చి 14న మిలన్ నుంచి భారత దేశం తిరిగి వచ్చేలా చూశారు’ అని  ఆ అమ్మాయి  తండ్రి సుజయ్ కదమ్ ముంబైలో విలేఖరులకు  ఆనంద బాష్పాలతో చెప్పారు.. ఫిబ్రవరి 28 వరకూ ఇటలీలో కూడా ఈ బీభత్సం గురించి ఎవరూ అంచనా వేయలేకపోయారని, మిలన్‌లో తాను కుదుర్చుకున్న అద్దె ఇంటి ఒప్పందం గురించి తనతో ఫోన్‌లో మాట్లాడిందని ఆయన చెప్పారు. కాని, తర్వాత నుంచి పరిస్థితి భీకరంగా మారడంతో మార్చి 10 నుంచే అక్కడ అన్ని మార్కెట్లూ మూసేయడం ప్రారంభించారని ఆయన తెలిపారు. తన కుమార్తె భారత దేశం తిరిగి రావాలనుకుంటే అక్కడి అధికారులు అనుమతి ఇవ్వలేదని, మార్చి 12న తాను అక్కడి భారతీయ రాయబార కార్యాలయానికి సమాచారం ఇచ్చిన వెంటనే  భారత ప్రభుత్వం వేగంగా ప్రతిస్పందించిందని ఆయన తెలిపారు. ఆ మరునాడే మార్చి 13న భారత రాయబార కార్యాలయ అధికారులు తనతో స్వయంగా మాట్లాడి తాము చేసిన ఏర్పాట్ల గురించి చెప్పారని, మార్చి 14న తన కూతురును చూసుకోగలిగానని  ఆయన తెలిపారు.


ఒక విపత్తు పట్ల భారత ప్రభుత్వం ఎంత వేగంగా స్పందిస్తుందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ మాత్రమే. మార్చి 10 నుంచీ ఇవాళ మార్చి 23న పార్లమెంట్ సమావేశాలు వాయిదా పడే వరకూ నరేంద్రమోదీ ప్రభుత్వం వేగంగా స్పందించిన తీరు దేశ ప్రజల పట్ల, ఈ నేల పట్ల తనకున్న బాధ్యతకు నిదర్శనం. ఇవాళ నరేంద్రమోదీతో పాటు దేశ పరిపాలనా యంత్రాంగం యావత్తూ ఆయన బాటలో నడిచేందుకు సిద్ధపడింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు వరకూ ప్రధానమంత్రితో భుజం భుజం కలిపి ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు నడుం కట్టారు. కరోనా వైరస్‌ను ఎదుర్కోవడం కన్నా స్థానిక ఎన్నికలే ముఖ్యమని మొదట భావించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ పట్లా, ప్రతిపక్షాల పట్లా ఘోరమైన రీతిలో వ్యవహరించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా చివరకు పరిస్థితిని గ్రహించి చర్యలు చేపట్టక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇవాళ దాదాపు అన్ని రాష్ట్రాలూ దిగ్బంధనాన్ని ప్రకటించాయి. మార్చి 22 రాత్రి నుంచే అంతర్జాతీయ విమానాశ్రయాలను మూసివేశారు. విదేశాలనుంచి రాకపోకల్ని అంతకుముందే నిషేధించారు. ఆఖరుకు జైళ్లలో కూడా కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా చర్యల్ని తీసుకున్నారు.


మనం ఎంత సన్నద్ధంగా ఉన్నా ప్రజలు సహకరించకపోతే ఈ మహమ్మారిని ఎదుర్కోలేమని ప్రధానమంత్రికి తెలుసు. అందుకే ఆయన జనంతో నేరుగా సంబంధాలు పెట్టుకున్నారు. సామాజిక దూరం పాటించాలని, ఇళ్లకు పరిమితం కావాలని వారికి పదే పదే బోధించారు. ‘ప్రపంచం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కోంటోంది. ఇది ఒక దేశానికే పరిమితమైనది కాదు. ఆఖరుకు మొదటి, రెండవ ప్రపంచ యుద్దాలు కూడా అన్ని దేశాలను చుట్టుముట్టలేదు. ఎలాంటి అలసత్వం, నిర్లక్ష్యం లేకుండా అంటువ్యాధి ప్రబలకుండా చూసుకోండి.. కరోనాను అరికట్టేందుకు మందు ఏదీ లేనందువల్ల సామాజిక దూరమే మనను కాపాడుతుంది’ అని ఆయన చెప్పారు. ‘కొవిడ్ మన దేశాన్ని ఏమీ చేయలేదని అనుకోకండి. పట్టుదల, సహనం పాటించి దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధపడండి’ అని ఆయన పిలుపునిచ్చారు. ఇవాళ 130 కోట్ల మంది భారతీయుల గుండెచప్పుడు ప్రధాని నరేంద్రమోదీ మాటల్లో ప్రతిధ్వనిస్తున్నది. మన జాతిని ముందుకు నడిపిస్తున్న ధీమా ఆయన మాటల్లో వ్యక్తమవుతోంది. ఇవాళ  ప్రపంచమంతా ఆ నాయకుడిని ప్రశంసిస్తోంది. అనేక దేశాలు మోదీని ఆదర్శంగా తీసుకుంటున్నాయి. ఆయన కాలానికంటే ఒక అడుగు ముందుకు వేసి ఆలోచిస్తున్నారు. ఆయన మాటల్ని మనం పాటిస్తే ప్రస్తుత సంక్షోభాన్ని అవలీలగా గట్టెక్కగలుగుతాం.


వై. సత్యకుమార్

(బిజెపి జాతీయ కార్యదర్శి)

Updated Date - 2020-03-24T05:59:10+05:30 IST