నకిలీ సమాజ్‌వాదీలతో జాగ్రత్త : మోదీ హెచ్చరిక

ABN , First Publish Date - 2022-02-04T22:37:49+05:30 IST

ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో ఓటర్లు అప్రమత్తంగా వ్యవహరించాలని

నకిలీ సమాజ్‌వాదీలతో జాగ్రత్త : మోదీ హెచ్చరిక

న్యూఢిల్లీ : ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో ఓటర్లు అప్రమత్తంగా వ్యవహరించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హెచ్చరించారు. నకిలీ సమాజ్‌వాదీలు అధికారంలోకి వస్తే, ప్రజలను ఆకలితో ఉంచుతారని, రైతులకు అందిస్తున్న సాయాన్ని నిలిపేస్తారని చెప్పారు. శుక్రవారం ఆయన వర్చువల్ విధానంలో రచ్చబండలో మాట్లాడారు. 


ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో తొలి దశలో ఫిబ్రవరి 10న పోలింగ్ జరిగే పశ్చిమ ఉత్తర ప్రదేశ్ ప్రజలను ఉద్దేశించి మోదీ మాట్లాడారు. అల్లర్లకు పాల్పడేవారు, మాఫియా గ్యాంగులు రాష్ట్రంపై పట్టు సాధించేందుకు అనుమతించరాదని ప్రజలు నిర్ణయం తీసుకున్నందుకు తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. 


‘‘ఓటు వేసేటపుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. ఈ కుటుంబ నాయకత్వంలోని నకిలీ సమాజ్‌వాదీలకు అవకాశం వస్తే, రైతులకు అందుతున్న సాయాన్ని నిలిపేస్తారు. ఈ నకిలీ సమాజ్‌వాదీలు మిమ్మల్ని ఆకలితో ఉంచుతారు’’ అని మోదీ హెచ్చరించారు. భద్రత, గౌరవం, సౌభాగ్యాలను కొనసాగించడానికి; హిస్టరీ షీటర్లను బయట ఉంచడానికి, నూతన చరిత్రను సృష్టించడానికి ఈ ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. 


డబుల్ ఇంజిన్-డబుల్ బెనిఫిట్స్‌

యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఉత్తర ప్రదేశ్‌లో శాంతిభద్రతలను కాపాడుతోందన్నారు. రాష్ట్రంలో చట్టం అమలయ్యేలా యోగి ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. నేరగాళ్ళు అదుపులోకి వస్తారని ఎవరూ ఊహించలేదన్నారు. రెట్టింపు వేగంతో పని చేయగలిగే ప్రభుత్వం 21వ శతాబ్దంలో ఉత్తర ప్రదేశ్‌కు అవసరమని, కేవలం డబుల్ ఇంజిన్ గవర్నమెంట్ మాత్రమే ఆ పని చేయగలదని అన్నారు. 


ఈ ఎన్నికలు ప్రత్యేకమైనవి

స్వాతంత్ర్యానంతరం అనేకసార్లు ఎన్నికలు జరిగాయని, ప్రస్తుత ఎన్నికలు చాలా ప్రత్యేకమైనవని తెలిపారు. రాష్ట్రంలో శాంతి స్థాపన, అభివృద్ధి కొనసాగింపు, సుపరిపాలన, ప్రజలు వేగంగా అభివృద్ధి చెందడం కోసం ఈ ఎన్నికలు జరుగుతున్నట్లు చెప్పారు. 


సంక్షోభ సమయంలో సైతం...

100 ఏళ్ళలో మానవాళి ఎరుగని విపత్తు కోవిడ్-19 రూపంలో వచ్చిందన్నారు. ఈ సంక్షోభ సమయంలో సైతం తాము డబుల్ ఇంజిన్ డబుల్ బెనిఫిట్స్‌ను ప్రజలకు అందేలా చేశామని చెప్పారు. 


మీరట్, ఘజియాబాద్, అలీగఢ్, హాపూర్, నోయిడా జిల్లాల ఓటర్లను ఉద్దేశించి ఈ వర్చువల్ రచ్చబండను బీజేపీ నిర్వహించింది. 


Updated Date - 2022-02-04T22:37:49+05:30 IST