ఏప్రిల్ 5న కరోనా చీకట్లను తరిమేద్దాం.. ప్రధాని సంచలన ప్రకటన..

ABN , First Publish Date - 2020-04-03T14:55:31+05:30 IST

దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ముందుగా ప్రకటించినట్టుగానే..

ఏప్రిల్ 5న కరోనా చీకట్లను తరిమేద్దాం.. ప్రధాని సంచలన ప్రకటన..

న్యూఢిల్లీ: దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ముందుగా ప్రకటించినట్టుగానే సరిగ్గా ఉదయం 9 గంటలకు ఆయన ట్విటర్ వేదికగా ఈ వీడియో షేర్ చేసుకున్నారు. కరోనా మహమ్మారిపై పోరాటానికి కలిసి నడుస్తున్న దేశ ప్రజలకు ప్రధాని మోదీ ఈ సందర్భంగా ధన్యావాదాలు తెలిపారు.  కొవిడ్-19పై భారత్ చేస్తున్న పోరాటాన్ని చాలా దేశాలు అనుసరిస్తున్నాయన్నారు. జనతా కర్ఫ్యూతో దేశ ప్రజలు తమ సామర్థ్యాన్ని చాటారని కొనియాడారు. దేశ ప్రజలంతా ఒక్కటిగా నిలిచి కరోనాను జయించాలని పేర్కొన్నారు. ఐక్యంగా పోరాడితేనే విజయం సాధిస్తామనీ.. ప్రతి ఒక్కరూ ఇంట్లో ఉంటే కరోనాను జయించినట్టేనని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజలు ప్రభుత్వానికి సంపూర్ణ సహకారం అందిస్తున్నారని మోదీ పేర్కొన్నారు. కరోనా మహమ్మారిని జయించేందుకు రాబోయే ఐదు రోజులు అత్యంత కీలకమని ఆయన గుర్తుచేశారు.


కాగా కరోనాపై విజయం సాధించేందుకు దేశ ప్రజలంతా మరోసారి సంకల్పం చాటాలని ఆయన పిలుపునిచ్చారు. ఏప్రిల్ 5న ఆదివారం రాత్రి కరోనా చీకట్లను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ఆరోజు రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు లైట్లు ఆర్పేయాలన్నారు. ఎవరెక్కడున్నా లైట్లు ఆర్పేసి దీపాలు వెలిగించాలని ప్రధాని కోరారు. ఈ సందర్భంగా సామాజిక దూరం (సోషల్ డిస్టెన్సింగ్) పాటించాలని కోరారు. విద్యుత్ లైట్లన్నీ ఆర్పివేసి కొవ్వొత్తి, దీపం లేదా మొబైల్ ఫ్లాష్ లైట్ వెలిగించాలన్నారు. తద్వారా దేశంలోని 130 కోట్ల మంది ప్రజలు మరోసారి కరోనాను పారదోలేందుకు తమ సంకల్పం చాటాలని ప్రధాని కోరారు. ప్రజలు వెలిగించే దీపాలు కరోనాపై పోరాడే వైద్యులు, అత్యవసర సేవల సిబ్బందిలో మరింత స్ఫూర్తి నింపాలని ఆకాంక్షించారు.

Updated Date - 2020-04-03T14:55:31+05:30 IST