Abn logo
Feb 25 2020 @ 01:37AM

మోదీ -ట్రంప్ అపూర్వ స్నేహబంధం

ఉగ్రవాదం, ఆర్థిక అసమానతలు, రక్షణ సహకారం, ఇంటెలిజెన్స్ సమాచార పంపిణీ, పర్యావరణం, సైబర్ నేరాలు, ఇంధన భద్రత, కమ్యూనికేషన్ విప్లవం, వర్తక సంబంధాలు, పెట్టుబడులు, మార్కెట్ విస్తరణ, ఉపాధి కల్పన వంటి అనేక విషయాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఒక స్పష్టమైన అవగాహనతో ఉన్నారు. అందుకే అమెరికాలో మోదీ పర్యటించినా, భారత్‌లో ట్రంప్ పర్యటించినా ఇరు దేశాల్లో గతంలో ఎన్నడూ లేనంతగా ఉత్సాహం వెల్లివిరుస్తోంది. భారత్‌లో ట్రంప్ పర్యటన అంతర్జాతీయంగా భారత్ ప్రాధాన్యత పెరిగిందనడానికి సంకేతంగా నిలుస్తుంది.


ప్రపంచ ఏకైక అగ్రరాజ్యం అమెరికా. ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌లో రెండు రోజుల పాటు పర్యటించడం మన ఉభయ దేశాల సంబంధాలలో ఒక నూతన అధ్యాయానికి నాంది అని తప్పక చెప్పవచ్చు. భారత్, అమెరికాలు ప్రపంచంలో రెండు అతి పెద్ద ప్రజాస్వామిక దేశాలు మాత్రమే కాదు, అగ్రగామి ఆర్థిక వ్యవస్థలు కూడా. ఆర్థిక సత్తాలో ప్రథమ స్థానంలో ఉన్న అమెరికా, ఐదవ స్థానంలో ఉన్న భారత్ మధ్య సన్నిహిత సంబంధాలు ఏర్పడడం ఏ కోణం నుంచి చూసినా ఇరుదేశాలకే కాక, ప్రపంచానికీ అత్యంత ప్రయోజనకరమే. ముఖ్యంగా మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత భారత్ - అమెరికాల మధ్య సాన్నిహిత్యం మరింత పెరిగింది. అధ్యక్షుడు ట్రంప్, ప్రధాని మోదీ మధ్య స్నేహ సంబంధాలు, భారత్, అమెరికా ప్రభుత్వాధినేతల మధ్య ఎన్నడూ లేని రీతిలో దృఢంగా వున్నాయి. ఈ స్నేహ బంధం వల్ల మన దేశానికి విశేష ప్రయోజనాలు సమకూరనున్నాయి. 


మోదీ హయాంలో ప్రపంచ దేశాల్లో భారత్‌కు లభించినంత గుర్తింపు మరే ప్రధానమంత్రి హయాంలో లభించలేదన్న విషయం ఎవరైనా అంగీకరించాలి. గత ఆరేళ్లలో మోదీ ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలలోనూ పర్యటించి భారత్‌కు అంతర్జాతీయంగా అనితరసాధ్యమైన గుర్తింపు తీసుకువచ్చారు. ఈ గుర్తింపు విలువ మాటల్లో చెప్పలేనిది. అధ్యక్షుడు ట్రంప్‌కూ, ప్రధాని మోదీకి మధ్య ఏర్పడిన కెమిస్ట్రీ విలువ ఇరు దేశాల ప్రజలకూ తెలుసు. ట్రంప్, మోదీకి మధ్య అరమరికలు లేని సాన్నిహిత్యం నెలకొనడానికి వారిద్దరి మధ్య ఉన్న భావ సారూప్యతే ప్రధాన కారణం. దేశ ప్రయోజనాలకు అత్యంత ప్రాధాన్యతనీయడం నుంచి ప్రపంచాన్ని పీడిస్తున్న ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని తుదముట్టడించడం దాకా ఉభయులకూ ఒకే రకమైన ఆలోచనలున్నాయి. ఒక దృఢ నిశ్చయంతో ఇరువురూ ఇవాళ ఉగ్రవాదం, ఆర్థిక అసమానతలు, రక్షణ సహకారం, ఇంటెలిజెన్స్ సమాచార పంపిణీ, పర్యావరణం, సైబర్ నేరాలు, ఇంధన భద్రత, కమ్యూనికేషన్ విప్లవం, వర్తక సంబంధాలు, పెట్టుబడులు, మార్కెట్ విస్తరణ, ఉపాధి కల్పన వంటి అనేక విషయాలపై ఒక స్పష్టమైన అవగాహనతో ఉన్నారు. అందుకే అమెరికాలో మోదీ పర్యటించినా, భారత్‌లో ట్రంప్ పర్యటించినా ఇరు దేశాల్లో గతంలో ఎన్నడూ లేనంతగా ఉత్సాహం వెల్లివిరుస్తోంది. 2014లో న్యూయార్క్‌లోని మేడిసన్ స్క్వేర్ నుంచి 2019లో టెక్సాస్‌లోని హ్యూస్టన్‌లో హౌడీ మోదీ సభ వరకు అమెరికాలో మోదీకి లభించిన సాదర స్వాగత సత్కారాలే ఇందుకు నిదర్శనం. టెక్సాస్ ఇండియా ఫోరమ్ నిర్వహించిన హ్యూస్టన్ సభకు ట్రంప్ స్వయంగా రావడం, ప్రముఖ డెమోక్రాట్లు, గవర్నర్లతో పాటు ఉన్నతాధికారులు హాజరు కావడం మోదీకి అమెరికాలో లభించిన ప్రాధాన్యతకు సంకేతం. మోదీ పర్యటనతో భారతీయ అమెరికన్లలో ఒక రకమైన ఆత్మ స్థైర్యం, బలం ఏర్పడిందనడంలో సందేహం లేదు. అమెరికా జనాభాలో ఒక శాతంగా ఉన్న భారత అమెరికన్లు ఇవాళ ద్విగుణీకృత ఉత్సాహంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతం కావడానికి పనిచేస్తున్నారు. ట్రంప్ టీమ్‌లో అత్యంత కీలక విభాగాల్లో పలువురు భారత సంతతికి చెందినవారు ఉండడమే ఇందుకు నిదర్శనం. అమెరికాలో అణు ఇంధన రంగం నుంచి కమ్యూనికేషన్, ఆరోగ్య రంగాల్లో భారతీయులే కీలక పాత్ర పోషిస్తుండడం మనకు గర్వకారణం. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు ట్రంప్ భారత్‌లో జరుపుతున్న పర్యటన అంతర్జాతీయంగా భారత్ శక్తి, ప్రాధాన్యత పెరిగిందనడానికి సంకేతంగా నిలుస్తుంది. రానున్న కాలంలో అంతర్జాతీయ వేదికలపై భారత్ నిర్వహించబోయే కీలక పాత్రకు ఈ పర్యటన కొత్త ఊపునిస్తుంది.


ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల్లో భారత్‌తో సంబంధాలు వ్యూహాత్మకంగా పెంచుకోవాల్సిన అవసరం ఉన్నదని ట్రంప్‌కు బాగా తెలుసు. ఇరు దేశాల సంబంధాలు కేవలం లాభనష్టాల ప్రాతిపదికన పెంపొందించుకోవాల్సిన అవసరం లేదని, అయితే విశ్వాస పాత్రమైన సంబంధాలు పరస్పరం ఏర్పర్చుకోవడం ఒక చారిత్రక అవసరమని ట్రంప్‌కూ, మోదీకీ తెలుసు. ఉగ్రవాదాన్ని కలిసికట్టుగా నిర్మూలించడం ఎంత ముఖ్యమో, ప్రపంచ మార్కెట్‌లో చైనా దూకుడు తగ్గించడం కూడా అంతే ముఖ్యమని ఇరు దేశాలు భావిస్తున్నాయి. అమెరికా–చైనా దేశాల మధ్య పెరుగుతున్న స్పర్థలు, వాణిజ్య పోటీ భారత్‌కు ఎంతో ఉపకరిస్తుందనడంలో సందేహం లేదు. అంతేకాక అమెరికా టెక్నాలజీ సంస్థలకు భారత్‌లో లభిస్తున్న అతి పెద్ద వినియోగ మార్కెట్, బహిరంగ డేటా వరప్రదాయినిగా కనిపిస్తోంది. టెక్నాలజీ రంగంలో వస్తున్న మార్పులను వినియోగించుకోకపోతే ఆర్థికాభివృద్ధి సాధ్యం కాదని అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో ఆధునిక కాలానికి సంబంధించిన సవాళ్లను 5జీ టెక్నాలజీ ద్వారా ఎదుర్కొనేందుకు భారత్‌ సంసిద్ధమవుతున్నది. ఆధునిక తరం 5జీ టెక్నాలజీని భారత్‌కు అందించే విషయంపై చర్చించేందుకు భారతీయుడైన అమెరికా ఫెడరల్ కమ్యూనికేషన్ కమిషన్ చైర్మన్ అజిత్ పాయ్ అమెరికా ప్రతినిధి వర్గంలో భాగంగా భారత్‌కు వచ్చారు. డేటా వేగం పెరగడం వల్ల ప్రపంచ దేశాల మధ్య, ప్రజల మధ్య డిజిటల్ అగాధం పూర్తిగా తగ్గిపోవడమే కాక వాణిజ్యంతో పాటు వివిధ రంగాల్లో అభివృద్ధి తీరుతెన్నులు మారిపోతాయని ఆయన ప్రకటించారు.


రక్షణ రంగంలో భారత్ శక్తిమంతమైన దేశంగా మారేందుకు కూడా ఈ పర్యటన ఎంతో దోహదం చేస్తుంది. ఇప్పటికే ప్రపంచంలో భారత్ పెద్ద రక్షణ ఉత్పత్తుల దిగుమతిదారు అని ట్రంప్‌కు తెలుసు. అమెరికా రక్షణ సంస్థ లాక్‌హీడ్ మార్టిన్ నుంచి 2.6 బిలియన్ డాలర్ల విలువైన హెలికాప్టర్లను మనం ఖరీదు చేయడం ఇరు దేశాల మధ్య రక్షణ సంబంధాల్లో నూతన అధ్యాయంగా రక్షణ నిపుణులు పరిగణిస్తున్నారు. ఇది కాక అమెరికా రక్షణ శాఖ అధికారులు భారత్‌లో 1.8 బిలియన్ డాలర్ల విలువైన సమగ్ర రక్షణ ఆయుధ వ్యవస్థ ఏర్పాటుకు ఒప్పందాలు సిద్ధం చేశారు. వీటితో కలిసి అమెరికా నుంచి భారత్ కొనుగోళ్లు 22 బిలియన్ డాలర్లకు పైగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎంతైనా టెక్నాలజీ రంగంలో అమెరికాకు సాటి రాగలిగిన దేశం లేదని మనకు తెలుసు. ఈ రంగంలో అమెరికన్ రక్షణ కంపెనీల సామర్థ్యం భారత సాయుధ దళాల ఆధునికీకరణకు దోహదం చేస్తుందనడంలో సందేహం లేదు. పసిఫిక్ మహా సముద్రంలో ఇరు దేశాల నౌకాదళ విన్యాసాలు, ఇంటెలిజెన్స్ సమాచార పంపిణీ కూడా మన రక్షణ పాటవం పెరిగేందుకు దోహదం చేస్తాయనడంలో సందేహం లేదు..


ఇవాళ భారత దేశంలో విచ్ఛిన్నకర శక్తులను ఏరివేయడం, కశ్మీర్‌లో పాక్ ఉగ్రవాదానికి కళ్లెం వేయడం వెనుక ప్రపంచ దేశాల అండదండలున్నాయని, మోదీ వివిధ దేశాధినేతలతో ఏర్పర్చుకున్న సత్సంబంధాల వల్లే ఇవాళ మనకు అంతర్జాతీయ మద్దతు లభిస్తున్నదని విదేశీ వ్యవహారాలను పరిశీలించే వారెవరికైనా అర్థమవుతుంది. పాక్‌ను ఉగ్రవాద దేశంగా ప్రకటించడం, ఇస్లామిక్ దేశాలు కూడా ఆ దేశానికి మద్దతు నీయకపోవడం, అంతర్జాతీయంగా పాకిస్థాన్ ఏకాకి కావడం మొదలైన పరిణామాలు మోదీకి అంతర్జాతీయంగా ఉన్న పట్టును సూచిస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా అండదండలు ఆయనకు బలంగా లభించాయని స్పష్టమవుతోంది. అందుకే ట్రంప్ భారత్‌లో అడుగుపెట్టిన వెంటనే ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని నిర్మూలించే విషయంలో భారత్–అమెరికాలు పట్టుదలతో ఉన్నాయని ప్రకటించారు. పాకిస్థాన్‌లో ఉగ్రవాద సంస్థలను నిర్మూలించి ఉగ్రవాదులను ఏరివేయాలని తాము ఒత్తిడి చేస్తున్నట్లు కూడా ఆయన స్పష్టం చేయడం గమనార్హం. 

అంతేకాదు, భారత్‌కు తమ హృదయాల్లో ప్రత్యేక స్థానం ఉన్నదని, ప్రపంచంలో అంతా ప్రధాని మోదీని అభిమానిస్తారని కూడా వచ్చీ రాగానే ట్రంప్ ప్రకటించారు. అదే సమయంలో మోదీని తమ వాదనలకు అనుకూలం చేసుకోవడం కూడా అంత సులభం కాదని కూడా ఆయన అంగీకరించారు. మోదీ గుజరాత్‌కే కాదు, మొత్తం భారత దేశానికే గర్వకారణమని, కష్టపడి పనిచేస్తే భారతీయులు ఏదైనా సాధించగలరనడానికి మోదీయే నిదర్శనమని ఆయన స్పష్టం చేశారు. అహ్మదాబాద్‌లో నిర్మించిన ప్రపంచపు అతి పెద్ద స్టేడియంను తన చేతులమీదుగా ప్రారంభిస్తున్నందుకు ట్రంప్ సంతోషం వ్యక్తం చేశారు. మరి రాజకీయ విభేదాలు ఎన్ని ఉన్నా, విదేశీ విధానానికి సంబంధించి భారతీయులంతా ఒక్కటిగా వ్యవహరించాలన్న సంస్కారాన్ని విడనాడి కాంగ్రెస్, వామపక్షాల వారు ధర్నాలు, నిరసన ప్రదర్శనలు నిర్వహించడం గర్హనీయం. భారత దేశం ప్రపంచ దేశాల సరసన తలెత్తుకు నిలబడాలంటే నేలబారు రాజకీయాలు నడుపుతున్న ఇలాంటి పిపీలికాల్ని విస్మరించక తప్పదు.


(బిజెపి జాతీయ కార్యదర్శి)

వై. సత్యకుమార్

Advertisement
Advertisement
Advertisement