రాష్ట్రానికి మోదీ.. ఢిల్లీకి కేసీఆర్‌!

ABN , First Publish Date - 2022-05-21T08:16:22+05:30 IST

భారత ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రానికి రానున్నారు.

రాష్ట్రానికి మోదీ.. ఢిల్లీకి కేసీఆర్‌!

  • 26న ఐఎస్‌బీకి రానున్న ప్రధాని
  • శుక్రవారమే దేశ రాజధానికి సీఎం
  • 7 రోజుల ‘జాతీయ’ పర్యటనలో
  • వివిధ రంగాల ప్రముఖులతో భేటీ
  • 27వ తేదీనే తిరిగి హైదరాబాద్‌కు
  • కొన్నాళ్లుగా మోదీ కార్యక్రమాలకు
  • దూరంగా ఉంటున్న ముఖ్యమంత్రి
  • ప్రస్తుతం అదే తరహాలో షెడ్యూల్‌
  • రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ


హైదరాబాద్‌, మే 20 (ఆంధ్రజ్యోతి): భారత ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రానికి రానున్నారు. ఈ నెల 26న హైదరాబాద్‌లోని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌(ఐఎస్‌బీ) ద్విదశాబ్ది కార్యక్రమానికి ప్రధాన మంత్రి హాజరు కానున్నారు. అయితే, సరిగ్గా మోదీ పర్యటన ఖరారైన సమయంలోనే సీఎం కేసీఆర్‌ ఢిల్లీ టూర్‌కు వెళ్లడంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. సాధారణంగా భారత ప్రధాని రాష్ట్ర పర్యటనకు వస్తే... ముఖ్యమంత్రి స్వాగతించడం ఆనవాయితీ. అయితే, ఇటీవల ప్రధాని తెలంగాణ పర్యటనకు వచ్చినప్పుడు సీఎం దూరంగా ఉండడం, ఢిల్లీలో ప్రధాని ఆధ్వర్యంలో జరిగిన పలు అధికారిక కార్యక్రమాలకు హాజరు కాకపోవడం విమర్శలకు తావిచ్చింది. తాజాగా ప్రధాని మరోమారు రాష్ట్రానికి వస్తుండగా.. ముఖ్యమంత్రి వారం రోజుల పాటు జాతీయ స్థాయి పర్యటనకు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి కొన్ని నెలలుగా కేంద్రం తీరుపై సీఎం కేసీఆర్‌ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దేశానికి ప్రత్యామ్నాయ ఎజెండా అవసరమని పదేపదే చెబుతున్నారు. జాతీయ రాజకీయాల వైపు అడుగులు వేసే ప్రక్రియలో భాగంగా పలువురు ఆర్థిక వేత్తలు, మేధావులు, జర్నలిస్టులు, రాజకీయ ప్రముఖులతో చర్చలు జరపాలని కేసీఆర్‌ నిర్ణయించారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రమే సీఎం కేసీఆర్‌తోపాటు ఎంపీలు సంతో్‌షకుమార్‌, రంజిత్‌రెడ్డి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌ హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి ఢిల్లీ చేరుకున్నారు.


ప్రతి కార్యక్రమానికీ డుమ్మానే

కొన్ని రోజుల క్రితం రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లో సమతామూర్తి విగ్రహావిష్కరణకు ప్రధాని మోదీ వచ్చినప్పటికీ.. ఆ కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌ పాల్గొనలేదు. కనీసం విమానాశ్రయంలో స్వాగతం పలకడానికీ వెళ్లలేదు. ఆ తర్వాత గత నెల 27న కొవిడ్‌పై అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫెరెన్స్‌ నిర్వహించగా.. టీఆర్‌ఎస్‌ ప్లీనరీ ఉండడంతో కేసీఆర్‌ హాజరు కాలేదు. కేవలం అధికారులు మాత్రమే ఆ సమావేశంలో పాల్గొన్నారు. ఇటీవల ఢిల్లీలో సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణ ఆధ్వర్యంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హైకోర్టుల చీఫ్‌ జస్టి్‌సలతో రెండు రోజుల సదస్సు నిర్వహించారు. ఆ కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరు కాగా.. కేసీఆర్‌ డుమ్మా కొట్టారు. ఆ తర్వాత రాష్ట్రపతి నిలయంలో సుప్రీం కోర్టు చీఫ్‌ జస్టిస్‌, హైకోర్టు సీజేలు, ముఖ్యమంత్రులకు ప్రధాని ఆధ్వర్యంలో విందు ఇచ్చారు. మోదీకి ముఖాముఖి ఎదురుపడటం ఇష్టం లేకనే కేసీఆర్‌... ఆ కార్యక్రమానికి హాజరు కాలేదన్న వార్తలొచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రధాని మోదీ హైదరాబాద్‌ వస్తుండటం, సీఎం కేసీఆర్‌ ఢిల్లీ పర్యటనకు వెళ్లడం మరోమారు చర్చనీయాంశమైంది. వాస్తవానికి ఢిల్లీలో రైతు ధర్నా నిర్వహించినప్పుడే... వారం రోజుల్లో మళ్లీ దేశ రాజధానికి వస్తానని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. ధర్నా ముగిసి ఇన్ని రోజులైన్పటికీ సీఎం ఢిల్లీ వెళ్లలేదు. తాజాగా ప్రధాని మోదీ రాష్ట్రానికి వస్తుంటే.... కేసీఆర్‌ ఢిల్లీ టూర్‌ పెట్టుకోవడం ఆసక్తికరంగా మారింది.


ప్రముఖులతో భేటీలు

భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) పేరుతో జాతీయ పార్టీని స్థాపించే యోచనలో కేసీఆర్‌ ఉన్నారని టీఆర్‌ఎస్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గత నెల 27న టీఆర్‌ఎస్‌ ప్లీనరీలోనూ జాతీయ పార్టీ పెట్టాలని పలువురు ముఖ్య నేతలు ఆకాంక్షించారు. దేశం కోసం ముందుకెళ్తానని అదే రోజు సీఎం ప్రకటించారు. తాజా ఢిల్లీ పర్యటనలో ఆర్థిక వేత్తలు, రాజకీయ, మీడియా రంగ ప్రముఖులతో భేటీ కానున్న కేసీఆర్‌.. ప్రత్యామ్నాయ ఎజెండా రూపకల్పనపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే, దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన సైనిక కుటుంబాలను కలిసి, ఆర్థిక సాయం అందించనున్నారు. అలాగే, జాతీయ రైతు ఉద్యమంలో అసువులు బాసిన రైతుల కుటుంబాలను పరామర్శించనున్నారు. నిర్ణీత షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 27వ తేదీనే తిరిగి ఆయన హైదరాబాద్‌ చేరుకుంటారు. ఆ తర్వాత 29, 30 తేదీల్లో బెంగాల్‌, బిహార్‌ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. 

Updated Date - 2022-05-21T08:16:22+05:30 IST