నేడే భీమవరానికి మోదీ

ABN , First Publish Date - 2022-07-04T08:44:25+05:30 IST

నేడే భీమవరానికి మోదీ

నేడే భీమవరానికి మోదీ

30 అడుగుల అల్లూరి విగ్రహావిష్కరణ

పెద అమిరంలో సభ.. భారీ ఏర్పాట్లు

అనుకూలించని వాతావరణం

భారీ వర్షం వస్తే ఎలాగనే తర్జనభర్జన

భద్రతా వలయంలో భీమవరం

డ్రోన్లతో నిఘా.. ఎస్పీజీ ఆధీనంలో వేదిక

సభకు 70 వేలమంది వస్తారని అంచనా

గవర్నర్‌, సీఎం, ప్రముఖుల హాజరు 


భీమవరం, జూలై 3 (ఆంధ్రజ్యోతి): తెలుగుఖ్యాతి విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ పశ్చిమగోదావరి జిల్లా భీమవరం వస్తున్నారు. సోమవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఆయన భీమవరం చేరుకుంటారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా భీమవరం సమీపంలోని కాళ్ల మండలం పెద అమిరంలో నిర్వహిస్తున్న అల్లూరి జయంతి వేడుకలో పాల్గొంటారు. క్షత్రియ సేవా సమితి ఏర్పాటు చేసిన 30 అడుగుల అల్లూరి కాంస్య విగ్రహాన్ని అక్కడ నుంచే వర్చువల్‌ విధానంలో ఆవిష్కరిస్తారు. మోదీ రాక నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధాని సభకు 70 వేల మంది హాజరవుతారని అంచనా వేశారు. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదివారం వాతావరణం అనుకూలించనప్పటికీ అధికార యంత్రాంగం ఏర్పాట్లలో తలమునకలైంది. వర్షం వచ్చినా ప్రధాని సభకు ఎటువంటి ఆటంకం లేకుండా రెక్సిన్‌ టెంట్‌లను వేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, క్షత్రియ సేవా కమిటీ ఈ వేడుకలను సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. జన సమీకరణకు వెయ్యి బస్సులను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఉత్సవ కేంద్రంలో మూడు వేదికలను సిద్ధం చేశారు. ఒక వేదికపై ప్రధాని మోదీ, గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌, ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో పాటు మరో ఐదుగురికి మాత్రమే అవకాశం కల్పిస్తున్నారు. రెండో వేదికపై ప్రజాప్రతినిధులు, వీఐపీలు ఆశీనులవుతారు. మూడో వేదికపై సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 


అనుకూలించని వాతావరణం 

గత మూడు నెలలుగా అల్లూరి జయంతి ఉత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. కేంద్ర బృందం ఇక్కడ వాతావరణానికి సంబంధించి గత పదేళ్ల నివేదిక తెప్పించుకుంది. వాతావరణ పరిస్థితులను అంచనా వేసి ప్రధాని పర్యటనను ఖరారు చేశారు. అయినప్పటకీ ఆదివారం వాతావరణం అనుకూలించలేదు. ఉదయం నుంచే చినుకులు ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం 12 గంటల వరకు వర్షం కురుస్తూనే ఉంది. దాంతో సభ ప్రాంగణం ఏర్పాటుకు అధికారులు సర్వశక్తులూ ఒడ్డారు. సోమవారం వాతావరణం ఇలాగే ఉంటుందన్న అంచనాతో అధికారులు ఉన్నారు.


భారీ బందోబస్తు

ప్రధాని మోదీ పర్యటనకు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. కేంద్ర సాయుధ బలగాలు, పోలీసులను మోహరించారు. దాదాపు 2500 మంది విధులు నిర్వహిస్తున్నారు. సభా వేదికను ఎస్పీజీ బృందం తమ ఆధీనంలోకి తీసుకుంది. ఆదివారం నుంచేసభా ప్రాంగణానికి బయట వ్యక్తులు వెళ్లకుండా కట్టుదిట్టం చేశారు. వేదిక ఏర్పాటు సిబ్బంది, అధికారులకు మాత్రమే అనుమతించారు. ట్రాఫిక్‌ క్రమబద్ధీకరించేందుకు, అవాంఛనీయ ఘటనలు జరగకుండా డ్రోన్లతో నిఘా పెట్టారు. భీమవరంలో నాలుగు హెలిప్యాడ్‌లు సిద్ధం చేశారు.


ప్రత్యేక విమానంలో గన్నవరానికి 

ప్రధాని మోదీ సోమవారం ఉదయం హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్‌పోర్టు చేరుకుంటారు. వాతావరణం అనుకూలిస్తే అక్కడి నుంచి హెలికాప్టర్‌లో భీమవరం వెళ్తారు. వాతావరణం అనుకూలించకుంటే గన్నవరం నుంచి రోడ్డు మార్గంలో హనుమాన్‌ జంక్షన్‌, ఏలూరు ఆశ్రం ఆస్పత్రి, నారాయణపురం, గణపవరం మీదుగా భీమవరం చేరుకునేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు యంత్రాంగం సిద్ధంగా ఉందని పోలీసులు చెబుతున్నారు. సోమవారం ఉదయం 11-15 గంటల నుంచి 12-15 గంటల వరకు కార్యక్రమం నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సభను విజయవంతం చేసేందుకు ప్రభుత్వంతో పాటు బీజేపీ, క్షత్రియ సేవా పరిషత్‌లు కృషి చేస్తున్నాయి. అల్లూరి జయంతి ఉత్సవాలకు తెలుగుదేశం, జనసేన పార్టీలు సంఘీభావం తెలిపాయి. సభను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చాయి. 


అల్లూరి, మల్లుదొర వారసులకు సత్కారం

అల్లూరి సీతారామరాజు సోదరుడి మనవడు శ్రీరామరాజు, అల్లూరి సైన్యంలో కీలక పాత్ర వహించిన మల్లుదొర కుమారుడు బోడి దొరలను వేదికపై ప్రధాని మోదీ సత్కరించనున్నారు. అల్లూరి రక్త సంబంధీకులు, మన్యం పితూరీ సైన్యంలో కీలక పాత్ర వహించిన వ్యక్తుల బంధువులను అల్లూరి ఉత్సవాలకు భీమవరం రప్పించారు. వారితో ప్రధాని మోదీ వ్యక్తిగతంగా భేటీ కానున్నారు. 

Updated Date - 2022-07-04T08:44:25+05:30 IST