మోదీ పులి.. కేసీఆర్‌ గుంటనక్క!

ABN , First Publish Date - 2022-07-04T08:42:46+05:30 IST

ప్రధానమంత్రి నరేంద్రమోదీ పులి అని, సీఎం కేసీఆర్‌ మాత్రం గుంటనక్కలా వ్యవహరిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు.

మోదీ పులి.. కేసీఆర్‌ గుంటనక్క!

  • రాష్ట్రంలో గడీల పాలనను బద్దలు కొడదాం
  • డబుల్‌ ఇంజన్‌ సర్కారును ఏర్పాటు చేద్దాం
  • టీఆర్‌ఎస్‌ సర్కారుపై యుద్ధమే: సంజయ్‌


హైదరాబాద్‌, జూలై 3 (ఆంధ్రజ్యోతి): ప్రధానమంత్రి నరేంద్రమోదీ పులి అని, సీఎం కేసీఆర్‌ మాత్రం గుంటనక్కలా వ్యవహరిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. రాష్ట్రంలో గడీల పాలనను బద్దలు కొడదామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా రాష్ట్రంలో డబుల్‌ ఇంజన్‌ సర్కారు ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. ప్రజలు అవకాశం ఇవ్వాలని కోరారు. పరేడ్‌ గ్రౌండ్‌ సభలో సంజయ్‌ మాట్లాడారు. ప్రధాని మోదీపై టీఆర్‌ఎస్‌ నేతల తప్పుడు భాషను భరిద్దామా? అని కార్యకర్తలను ప్రశ్నించారు. 200 కోట్ల కొవిడ్‌ వ్యాక్సిన్‌ డోసులను అందించినందుకు మోదీని తిడుతున్నారా? పేదలకు ఉచిత బియ్యం ఇచ్చినందుకు తిడుతున్నారా? అని టీఆర్‌ఎస్‌ నేతలను నిలదీశారు. మోదీ.. ఉక్రెయిన్‌-రష్యా యుద్ధాన్ని ఆపించి మరీ తెలుగు విద్యార్థులను రప్పించారని కొనియాడారు. అంతటి మహానుభావుడైన మోదీకి పలికే ఘనస్వాగతంతో గడీలో బందీగా ఉన్న తెలంగాణ తల్లి పులకించి పోవాలని వ్యాఖ్యానించారు. మోదీ సైన్యం టీఆర్‌ఎస్‌ సర్కారుపై యుద్ధానికి సిద్ధమైందన్నారు. సభకు యువకులు పెద్ద ఎత్తున రావడంతో కేసీఆర్‌ భయపడుతున్నారని, పులి వస్తే గుంటనక్కలు పారిపోతున్నాయని అన్నారు. విదేశాల నాయకులు మోదీకి ఘన స్వాగతం పలుకుతున్నారని, టీఆర్‌ఎస్‌ దద్దమ్మలకు ఇది తెలియదని ధ్వజమెత్తారు. 


 అభివృద్ధికి కేంద్రం నిధులు..

 రాష్ట్రంలో కేసీఆర్‌ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు కేంద్రం నిధులు ఇస్తోందని, ఇంకా ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని సంజయ్‌ పేర్కొన్నారు. కేసీఆర్‌ సర్కారు మాత్రం కేంద్ర ప్రభుత్వాన్ని బద్‌నాం చేసేందుకే ప్రయత్నిస్తోందని, రాష్ట్ర అభివృద్ధిపై వారికి చిత్తశుద్ధి లేదని అన్నారు. ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. కానీ, అదే సమయంలో భారీ స్థాయిలో అప్పులు చేసిందని విమర్శించారు. కేంద్రం ఇచ్చిన నిధులను కేసీఆర్‌ దారి మళ్లిస్తున్నారని సంజయ్‌ ఆరోపించారు.  బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతుంటే కేసీఆర్‌ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని అన్నారు. తెలంగాణ ప్రజలు ఎన్నో ఆశలతో ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకుంటే.. కేసీఆర్‌ నీళ్లు చల్లారని ధ్వజమెత్తారు.  

Updated Date - 2022-07-04T08:42:46+05:30 IST