Abn logo
Sep 27 2020 @ 03:10AM

ఎన్నాళ్లు వేచిచూడాలి?

  • ఎన్నాళ్లు ‘మండలి’ శాశ్వత సభ్యత్వానికి భారత్‌ దూరం? 
  • ప్రస్తుత పరిస్థితుల్లో అసలు ఐరాస అవసరం ఉందా?
  • మూడో ప్రపంచ యుద్ధం రాకపోవచ్చు... కానీ..
  • ఎన్నో యుద్ధాలు... అంతర్యుద్ధాలు.. ఉగ్ర దాడులు
  • కొవిడ్‌ను అరికట్టడానికి ఐరాస చేసిందేంటి?
  • సర్వప్రతినిధి సభను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం

న్యూఢిల్లీ, సెప్టెంబరు 26: భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్‌ ఇంకా ఎన్నేళ్లు ఎదురుచూడాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశ్నించారు. అత్నున్నత విధాన నిర్ణాయక వేదిక అయిన మండలిలో భారత్‌ ఎప్పటికీ తాత్కాలిక సభ్యత్వంతో సరిపెట్టుకోవాల్సిందేనా, ఎంతో వైవిధ్యం, సేవానిరతి ఉన్న భారత్‌ను ఎన్నాళ్లు దూరం పెడతారని ఆయన నిలదీశారు. ఐక్యరాజ్యసమితి ఏర్పడి 75 సంవత్సరాలవుతున్న సందర్భంగా సర్వప్రతినిధి సభను ఉద్దేశించి ఆయన శనివారం వీడి యో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. చాలా నిష్టురంగా ఈ ప్రపంచ సంస్థ లోటుపాట్లను  విశ్లేషించారు. ఐక్యరాజ్యసమితిలో సంస్కరణలు తప్పనిసరి అని అంటూ ఇందుకు ప్రపంచదేశాలు నడుంకట్టాలని ఆయన పిలుపునిచ్చారు.


‘‘ప్రపంచదేశాలకు ఓ ముఖ్యమైన ప్రశ్న. 1945లో అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఐక్యరాజ్యసమితి చార్టర్‌ను రూపొందించారు. నాటికీ నేటికీ పరిస్థితులు చాలా మారాయి. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా నాటి చార్టర్‌ ఉందా? సమితికి రెలవెన్స్‌ ఎంత? సమితి చాలా విజయాలే సాధించింది.. కాదనను. మూడో ప్రపంచ యుద్ధం రాకుండా సమితి దోహదపడింది. కానీ అదేసమయంలో  ఎన్ని యుద్ధాలు, ఎన్నెన్ని అంతర్యుద్ధాలు, ఉగ్రదాడులు చోటుచేసుకున్నాయన్నది .. ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకుంటే తెలుస్తుంది. లక్షల ప్రాణాలు పోయాయి. సామాన్యుల రక్తం ఏరులై ప్రవహించింది. లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ఎందరో శరణార్థులుగా మిగిలారు. ఇలాంటి సమస్యలను ప్రస్తుతం పరిష్కరిస్తున్నామా?’’ అని మోదీ ప్రశ్నించారు. ప్రస్తుతం కావాల్సినది సంస్కరణలని,  ఇవి అసలు ఎప్పటికైనా చోటుచేసుకుంటాయా.. అని 130కోట్ల మంది భారతీయులు ఆందోళన చెందుతున్నారని ఆయన పేర్కొన్నారు. ‘‘భారత్‌ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ప్రపంచంలోని 18ు జనాభా నివసించేది మా దేశంలోనే. వందలాది భాషలు, యాసలు, సిద్ధాంతాలు, సంస్కృతులకు ఇది నెలవు. శతాబ్దాల పాటు భారత్‌ ప్రపంచంలో నే ఆర్థిక అగ్రగామి. అదే విధంగా వందల ఏళ్లపాటు విదేశీ పాలనలో మగ్గింది. మేం బలమైన శక్తిగా ఉన్నపుడు ప్రపంచానికి ముప్పుగా మా రలేదు. మేం బలహీనంగా ఉన్నపుడు ప్రపంచానికి భారమూ కాలేదు. మాదేశంలో చోటుచేసుకుంటున్న మార్పులు ప్రపంచాన్నే ప్రభావితం చేస్తున్న వేళ.. ఇంకా ఎన్నాళ్లు మేం (భద్రతామండలి శాశ్వత సభ్యత్వానికి) ఎదురుచూడాలి?’’ అని ప్రధాని విమర్శనాత్మకంగా అన్నారు. ‘‘ఐక్యరాజ్యసమితి ఏర్పడినపుడు దాని దీ, మాదీ ఒకటే భావన. వసుధైక కుటుంబ భావన. ఇది మా సంస్కృతిలో, స్వభావంలో, ఆలోచనలోనే ఉంది. సమితి కార్యాకలాపాల్లో మా పాత్ర చూడండి. ఎన్నోదేశాలకు శాంతి పరిరక్షక దళాలను పంపాం. ఆ క్రమంలో వందలాది సైనికులను కోల్పోయాం. శాంతి మా లక్ష్యం. ఇందుకు శ్రమించాం.. ఇంత సేవ చేసినందుకు సమితిలో మరింత విస్తృత భాగస్వామ్యం భారత్‌కుండాలని ప్రతీ భారతీయుడూ కోరుకుంటున్నాడు’’ అని చెప్పారు.  


అంతర్జాతీయ సౌర కూటమి, విపత్తు సహాయ ఒప్పందం, పొరుగుదేశ ప్రయోజనాలే ప్రధానం అన్న విధానం.. ఇవన్నీ మా ప్రాథామ్యాలను వెల్లడిస్తాయి. ఒక దేశానికి స్నేహ హస్తం చాచామంటే అది వేరొక దేశానికి వ్యతిరేకం కాదు. అభివృద్ధి భాగస్వామ్య ఒప్పందాలను వివిధ దేశాలతో కుదుర్చుకుంటున్నామంటే.. ఆ దేశాలను మాకు అణిగిమణిగి ఉండేట్లు చేసుకోవడం కాదు’’ అని ఆయన స్పష్టం చేశారు. చైనాకు దీటుగా ఇండో ఫసిఫిక్‌ దేశాలతో ఒప్పందాలను భారత్‌ కుదుర్చుకుంటున్న సమయంలో ఆయన ఈ విషయం స్పష్టం చేయడం విశేషం.


కొవిడ్‌పై ఇది మా మాట...

‘కరోనా వైరస్‌ ప్రపంచాన్ని కబళిస్తోంది. ఇంత పెద్ద ఆరోగ్య విపత్తు వచ్చినపుడు ఐక్యరాజ్యసమితి ఏం చేసింది? 150 దేశాలకు మేం మందులను పంపిణీ చేశాం. ప్రపంచంలోనే అతి పెద్ద కొవిడ్‌ వ్యాక్సిన్‌ ఉత్పత్తిదారు భారత్‌ కాగలదు. ఆ వ్యాక్సిన్‌ను అన్నిదేశాలకూ సరఫరా చేస్తాం’’ అని మోదీ ప్రకటించారు. ‘మానవాళి శ్రేయస్సే మా ఆశయం. శాంతి, భద్రత, సుస్థిరత, సుసంపన్నతలకు ప్రాధాన్యమిస్తాం. మానవాళి శత్రువులకు- అంటే టెర్రరి జం, మాదక ద్రవ్యాల అక్రమ రవా ణా.. మొదలైన వాటికి వ్యతిరేకంగా గళమెత్తుతూనే ఉంటాం. వజ్రోత్స వ వేళ ఐక్యరాజ్యసమితి ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మారుతుందని ఆశిస్తున్నాం’’ అని మోదీ ముగించారు.


శ్రీలంకతో సత్సంబంధాలే తొలి ప్రాధాన్యం

శ్రీలంకతో సంబంధాలే భారత్‌ తొలి ప్రాధాన్యమని ప్రధాని మోదీ చెప్పారు. ఇరుగుపొరుగు దేశాలతో సత్సంబంఽధాలకు తమ సర్కా రు అగ్రతాంబూలం ఇస్తుందన్నారు. శనివారం ఆయన శ్రీలంక ప్రధాని మహీందా రాజపక్షతో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఇరుదేశాల అభ్యున్నతిపై కీలక చర్చలు జరిపారు. వచ్చే ఐదేళ్లలో చేపట్టబోయే అభివృద్ధి ప్రాజెక్టులపై ఇరుదేశాలు ఓ అంగీకారానికి వచ్చాయి. 


Advertisement