మోదీ, సోషల్‌ మీడియా

ABN , First Publish Date - 2020-03-13T06:54:25+05:30 IST

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సదా వార్తల్లో ఉంటారు. కొన్నిసార్లు తన ప్రమేయంతో; కొన్నిసార్లు తన ప్రమేయం ఏమీ లేకుండానే. తన ప్రమేయం లేకుండా మోదీ వార్తల్లోకి ఎక్కడం గురించి...

మోదీ, సోషల్‌ మీడియా

ఢిల్లీ మారణకాండ తదనంతర చర్చనుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు సోషల్‌ మీడియాను వదిలి పెడుతున్నానన్న ట్వీట్ ఉపయోగపడింది. మోదీ కోరుకున్నది ఇదేనా? నిజానికి ఈ ప్రశ్నకు కచ్చితమైన జవాబు కోసం ప్రయత్నించక్కర లేదు. ఎందుకంటే ఆయన చేసిన పని వల్ల వచ్చిన ఫలితం అదే. ఆయన ఏమి ఆశించారన్న దానితో ఆ ఫలితానికి నిమిత్తం లేదు. ఈ సందర్భంగా సోషల్ మీడియా సహా వివిధ మాధ్యమాల్లో మోదీ చేసిన పనులతో పాటు ఆయన చేయని పనుల ఫలితాల గురించి కూడా ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది.


ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సదా వార్తల్లో ఉంటారు. కొన్నిసార్లు తన ప్రమేయంతో; కొన్నిసార్లు తన ప్రమేయం ఏమీ లేకుండానే. తన ప్రమేయం లేకుండా మోదీ వార్తల్లోకి ఎక్కడం గురించి ఇక్కడ మాట్లాడుకోనక్కర లేదు. ఆయన ప్రత్యక్ష, పరోక్ష ప్రమేయంతో పుట్టే వార్తల గురించీ, తానుగా కావాలని ఇచ్చే వార్తల గురించి మనం తప్పనిసరిగా చర్చించాలి. ఎందుకంటే ప్రధాని ఆలోచనా ధోరణి మనకు వాటి ద్వారా తెలిసే అవకాశం ఉంది. ఏ దేశంలోనయినా అక్కడి ప్రజల భవిష్యత్తును ప్రభుత్వాలే ప్రధానంగా ప్రభావితం చేస్తాయి. ప్రస్తుతం ఇండియాను ఏలుతున్న ప్రభుత్వంలో ప్రధానమంత్రి మోదీ అత్యంత శక్తిమంతుడు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రధానమంత్రిని సమానుల్లో ప్రథముడు (first among the equals) అంటారు. మన ఎన్‌డిఎ ప్రభుత్వంలో ఆ మాటకు విలువ లేదు. కేంద్ర మంత్రిమండలి అంటే ప్రధాని మోదీ ఒక్కరే. ఆ వెనుక కాస్త దూరంలో హోంమంత్రి అమిత్ షా ఉంటారు. మిగతావారంతా పేరుకే మంత్రులు అని ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు. ప్రభుత్వాన్ని మోదీ అలా ఒంటి చేత్తో నడిపిస్తున్నారు కాబట్టి ఆయన మదిలో మెదిలే ఆలోచనలు దేశ ప్రజలకు ఎంత ముఖ్యమైనవో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రధాని మోదీని ఇటీవల విలక్షణ రీతిలో వార్తల్లోకి ఎక్కించిన అంశం ఏమిటంటే ఆయన సోషల్ మీడియాను వదిలిపెడుతున్నారన్న అంశం. ఆ మాటను స్వయంగా మోదీ ఒక ట్వీట్ ద్వారా ప్రజల్లోకి వదిలారు. ఇంకేముంది బ్రహ్మాండం బద్దలయినంత పని జరిగింది. సోషల్ మీడియాలో ఆయనకున్న ఆదరణ అలాంటిది. ట్విట్టర్‌లో మోదీకి 5.4 కోట్ల మంది ఫాలోయర్లు ఉన్నారు. ఫేస్‌బుక్‌లో 4.4 కోట్ల మంది, ఇన్‌స్టాగ్రామ్‌లో 3.52 కోట్ల మంది మోదీని ఫాలో అవుతున్నారు. 


అలాంటి మోదీ సోషల్ మీడియా నుంచి వైదొలగనున్నారన్న వార్త ప్రధాన స్రవంతి మీడియాకు పెద్ద వార్త కాకుండా ఎలా ఉం టుంది! ప్రత్యేకించి ఎలక్ట్రానిక్ మీడియాకు! మోదీ వేసే ప్రతి అడుగులో దేశ శ్రేయస్సునూ, ఆయనపై వచ్చే ప్రతి విమర్శలో దేశద్రోహాన్నీ చూసే న్యూస్ ఛానళ్లు మిన్నూమన్నూ ఏకం చేశాయి. మోదీ మనసుకు ఎంత కష్టం కలిగితే ఈ నిర్ణయం తీసుకున్నారో అంటూ దానికి కారకులను వెదికి శిలువ వేసేందుకు ఒకరోజు ప్రైం టైమ్ మొత్తాన్నీ వెచ్చించాయి. 


తీరా చూస్తే మరుసటి రోజు వ్యవహారం తుస్సుమంది. మహిళా దినోత్సవం సందర్భంగా ఆరోజున తన సోషల్ మీడియా ఖాతాలను స్ఫూర్తిదాయకమైన మహిళలకు అప్పగించనున్నట్లు మళ్లీ మోదీనే ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ఈ మొత్తం వ్యవహారంలో మనం తెలుసుకోవాల్సింది ఏమన్నా ఉందా? పైకి ఇది ఆషామాషీగా, పెద్ద ప్రాముఖ్యత లేని విషయంగా కనబడవచ్చు. కానీ ఒకరోజంతా సస్పెన్స్ ఎందుకు నడిచిందన్న ప్రశ్న వేసుకుంటే దీని ప్రాముఖ్యత అర్థం అవుతుంది. మహిళా దినోత్సవం సందర్భంగా తన సోషల్ మీడియా ఖాతాలను మహిళలకు అప్పగించనున్నట్లు మోదీ మొదటి రోజే ప్రకటించవచ్చు. కానీ ఆయన ఆ పని చేయకుండా సోషల్ మీడియాను వదలిపెట్టాలని అనుకుంటున్నట్లు మొదట ప్రకటించారు. అసలు విషయం తర్వాత చెప్పారు. సోషల్ మీడియాలో అత్యంత శక్తిమంతమైన ప్రపంచ నేతల్లో మోదీ ఒకరు. మరి ఆయన అస్త్ర సన్యాసం చేస్తున్నానంటే గోల కాకుండా ఎలా ఉంటుంది! కాబట్టి మోదీకి కావాల్సింది అదేనని ఎవరైనా భావిస్తే తప్పు పట్టనక్కరలేదు.


భయంకరమైన స్థాయిలో జరిగిన ఢిల్లీ మారణకాండ తదనంతర చర్చనుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు మోదీ ట్వీట్ ఉపయోగపడింది. మోదీ కోరుకున్నది ఇదేనా? నిజానికి ఈ ప్రశ్నకు కచ్చితమైన జవాబు కోసం ప్రయత్నించక్కర లేదు. ఎందుకంటే ఆయన చేసిన పని వల్ల వచ్చిన ఫలితం అదే. ఆయన ఏమి ఆశించారన్న దానితో ఆ ఫలితానికి నిమిత్తం లేదు. ఈ సందర్భంగా సోషల్ మీడియా సహా వివిధ మాధ్యమాల్లో మోదీ చేసిన పనులతో పాటు ఆయన చేయని పనుల ఫలితాల గురించి కూడా ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. 


దేశ రాజధాని ఒకపక్క మండుతుంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అతిథి మర్యాదలతో బిజీగా ఉన్న ప్రధాని మధ్యలో కాస్త వ్యవధి చూసుకుని ఢిల్లీ వీధుల్లో దాడులను ఖండించలేక పోయారు. దానికి ఆయనకు మూడు రోజులు పట్టింది. అప్పుడు కూడా శాంతి సామరస్యాలు స్థాపించాల్సిందిగా ప్రజలను కోరారు తప్ప ‘గోలీ మారో’ వంటి విద్వేషపూరిత వ్యాఖ్యలతో అల్లర్లను ప్రేరేపించిన తన పార్టీ నాయకులను పల్లెత్తు మాట అనలేదు. ఆ మాటకొస్తే హిందుత్వవాదాన్ని వ్యతిరేకించే జర్నలిస్టులపై, మేధావులపై సభ్యసమాజం ఊహకు కూడా అందనంత ఘోరంగా ట్విట్టర్‌లో వ్యాఖ్యలు చేసే చాలామందిని మోదీ తాను ప్రధాని కుర్చీలో కూర్చున్న తర్వాత కూడా చాలాకాలం ఫాలో అయ్యారు. ఇప్పటికి కూడా విద్వేషపూరిత ట్రోలింగ్‌కు పాల్పడే చాలామందిని మోదీ ఫాలో అవుతున్నారు. 2014లో మోదీ నాయకత్వంలో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దేశవ్యాప్తంగా హిందుత్వ శక్తులు రెచ్చిపోయాయి. గో సంరక్షణ పేరుతో అమాయక ముస్లింలను చాలామందిని కొట్టి చంపారు. దాద్రిలో అక్లాఖ్‌ను కొట్టి చంపిన ఘటనపై ఇప్పటివరకూ ఒక్కసారంటే ఒక్కసారి కూడా మోదీ ఈ అమానుష హత్యాకాండను ఖండించలేదు. తన సొంత రాష్ట్రం గుజరాత్‌లోని ఉనాలో దళితులపై పైశాచికంగా దాడి జరిగినపుడు కూడా దానిని ఖండించేందుకు ట్విట్టర్‌ను ఉపయోగించుకోవచ్చని మోదీ అనుకోలేదు. 


దేశానికి తాను ఏది చెప్పాలనుకున్నా మోదీ అందుకు ఉపయోగించుకునేది సోషల్ మీడియానే. ప్రజలతో నేరుగా సంభాషించేందుకు సోషల్ మీడియా ఉఫయోగపడుతుందని ఆయన అంటారు. కానీ ఇది వాస్తవం కాదు. ఒక పక్షం కాదనుకున్నపుడు సోషల్ మీడియాలో సంభాషణ ఉండదు. మోదీ చెప్పదలచుకున్నది చెబుతారు. అంతే. ప్రజలు ఆయనను ప్రశ్నించలేరు కాబట్టి వారి తరపున మీడియా ఆయనను ప్రశ్నించాలి. కానీ మీడియాకు ఇంతవరకూ ఆ అవకాశం లభించలేదు. ప్రధానమంత్రి పదవిని చేపట్టిన నాటి నుంచీ ఇంతవరకూ మోదీ ఒక్కసారంటే ఒక్కసారి కూడా మీడియా సమావేశంలో మాట్లాడలేదు. 


ఈ అయిదేళ్ల తొమ్మిది నెలల కాలంలో సామాజికంగా సంభవించిన పరిణామాలను అలా ఉంచితే నరేంద్ర మోదీ ప్రభుత్వం రాజకీయంగా అనేక వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నది. ప్రజలు వాటి దుష్పరిణామాలను అనుభవించారు. పెద్ద నోట్ల రద్దు, జిఎస్‌టి వంటి చర్యల 


వల్ల ఆశించిన ఫలితాలు రాకపోగా ఆర్థిక రంగంపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూపించాయి. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదా రద్దు చేశారు. ఏడు నెలలుగా అక్కడ మాజీ ముఖ్యమంత్రులు, ముఖ్యమైన నేతలు నిర్బంధంలో ఉన్నారు. కశ్మీర్‌ లోయలో తీవ్రమైన నిర్బంధం రాజ్యమేలుతోంది. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పరిణామాలు వేటిపైనా కూడా ప్రధాని మోదీని ప్రశ్నించేందుకు మీడియాకు అవకాశం లేదు. ఆ అవకాశం మీడియాకు నిరాకరించడం ద్వారా మోదీ ఒకవిధంగా జవాబుదారీతనాన్ని నిరాకరిస్తున్నారు.


తనకు చాలా సన్నిహిత మిత్రుడిగా మోదీ చెప్పుకునే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ట్విట్టర్ ద్వారానే దేశ ప్రజలతో తన ఆలోచనలు పంచుకుంటారు. ఆ మాటకొస్తే ఆయన పెద్ద పెద్ద నిర్ణయాలు కూడా ట్విట్టర్ ద్వారానే వెల్లడిస్తారు. అయితే ట్రంప్ ఇంటా బయటా మీడియాతో ఎడాపెడా మాట్లాడతారు. నిజానికి ప్రజాస్వామ్య దేశాల్లో ప్రభుత్వాధినేతలు మీడియాతో సంభాషించకుండా ఉండడం కుదరదు. తాను మాట్లాడనని భీష్మించే వారు మోదీ తప్ప మనకు ఎవరూ కనబడరు కూడా. తన సన్నిహిత మిత్రుడు ట్రంప్‌ ఈ విషయంలో మాత్రం మోదీకి ఆదర్శం కాకుండా పోయాడు!

ఆలపాటి సురేశ్ కుమార్

Updated Date - 2020-03-13T06:54:25+05:30 IST