సమాఖ్య స్ఫూర్తి కొరవడిన మోదీ పాలన

ABN , First Publish Date - 2022-06-03T06:13:56+05:30 IST

కార్యదక్షుడు ఎక్కడైనా రాణిస్తాడు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విషయంలో ఇది పరిపూర్ణ సత్యం. గుజరాత్ ఆత్మ బంధువుగానూ, భారత భాగ్య విధాతగానూ ఆయన గౌరవ మన్ననలు పొందారు....

సమాఖ్య స్ఫూర్తి కొరవడిన మోదీ పాలన

కార్యదక్షుడు ఎక్కడైనా రాణిస్తాడు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విషయంలో ఇది పరిపూర్ణ సత్యం. గుజరాత్ ఆత్మ బంధువుగానూ, భారత భాగ్య విధాతగానూ ఆయన గౌరవ మన్ననలు పొందారు. 2014లో తొలిసారి ప్రధానమంత్రి పదవీ బాధ్యతలు చేపట్టినప్పుడు మోదీ సాధించిన విజయాలలో ఆ విశేష ప్రజాదరణ ఆశ్చర్యకరమైనది. ఎందుకంటే గాంధీనగర్ నుంచి న్యూఢిల్లీకి ఆయన పరివర్తనా ప్రస్థానం చాల సాఫీగా, సమస్యారహితంగా జరిగింది మరి. ముఖ్యమంత్రి పీఠం నుంచి నేరుగా ప్రధానమంత్రి గద్దె నెక్కిన ప్రధానమంత్రులలో నరేంద్ర మోదీ ద్వితీయుడు (ప్రథముడు కన్నడ దేవెగౌడ) అన్న విషయాన్ని మనం మరచిపోకూడదు. అద్భుతమైన ఈ అధికార ప్రాభవం ఆయన రాజనీతిజ్ఞతను కొత్త పుంతలు తొక్కించింది. ‘సహకార సమాఖ్య విధానమే’ తన పాలనా మంత్రమని మోదీ తీవ్ర భావావేశంతో ప్రకటించారు. దేశ ప్రజలలో ఒక కొత్త ఆశాభావం అంకురించింది. కేంద్ర –రాష్ట్ర సంబంధాలలో ఒక కొత్త అధ్యాయాన్ని ఆయన ప్రారంభిస్తారని అందరూ భావించారు. అనుకున్నదే జరుగుతుందా? ఆ సహకార సమాఖ్య పాలనా పద్ధతిపై మోదీ హామీ ఇచ్చిన ఎనిమిది సంవత్సరాల అనంతరం ఇప్పుడు నడుస్తున్న చరిత్ర క్రూర పాదఘట్టనల కింద నలిగిపోతోంది. కక్ష సాధింపు రాజకీయాలలో చిక్కుకున్నది. పరస్పర నిందలు మోపుకోవడంలో మునిగిపోయింది. సంపూర్ణ అధికార దురహంకారంతో అణగిపోయింది.


కేంద్రం, రాష్ట్రాల మధ్య భాషాపరమైన వివాదం లేదా పోరాటానికి ఒక నిర్దిష్ట చరిత్ర ఉంది. అది క్రమ రహితమైనది కావచ్చుగానీ దేశ సమున్నత వైవిధ్యాన్ని అది ప్రతిబింబిస్తోంది. హిందీని జాతీయ భాషగా తమపై రుద్దడానికి ఎటువంటి ప్రయత్నమూ చేయకూడదని దక్షిణాది రాష్ట్రాలు ఏనాటినుంచో స్పష్టం చేస్తూ వస్తున్నాయి. ఏది ఏమైనా భాషలపై ‘యుద్ధం’ పునర్జ్వలనమయింది.. ఇది, కొత్తగా ప్రభవిస్తోన్న రాజకీయ వివాదాలను సూచిస్తోంది. నరేంద్ర మోదీ అసాధారణ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీని హిందీ భాషా ప్రాంతాల పార్టీగానే దేశ ప్రజలలో అత్యధికులు ఇప్పటికీ భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలలో హిందీ రాష్ట్రాలే కీలక పాత్ర పోషిస్తున్నాయని హిందీయేతర రాష్ట్రాల ప్రజలు విశ్వసిస్తున్నారు. తనపై ఉన్న ‘హిందీ–హిందు–హిందుస్థాన్’ పార్టీ ముద్ర నుంచి బయటపడేందుకు బీజేపీ శతథా ప్రయత్నిస్తోంది. అయినప్పటికీ వింధ్య పర్వతాలకు దక్షిణంగా ఉన్న ప్రజలు మాత్రం ఉత్తర భారతావని రాజకీయ విలువలకే బీజేపీ నిబద్ధమయి ఉందని విశ్వసిస్తున్నారు. ఆర్థికాభివృద్ధి సాధనలో అగ్రగామిగా ఉన్న తమిళనాడు తమ ప్రాంతీయ విలక్షణ అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు కృతనిశ్చయంతో ఉంది. సంఘ్ పరివార్ ‘హిందూత్వ భావజాలాన్ని అధికార డిఎంకె అంగీకరించడం లేదు.


అయితే ప్రస్తుత వివాదం ఇంకెంత మాత్రం ఉత్తరాది వెర్సెస్ దక్షిణాది పోరాటం ఎంత మాత్రం కాదు. ఇది కేంద్ర–రాష్ట్ర సంబంధాలకు చెందిన సమస్య. సమస్య అనడం కంటే సంక్షోభం అని అనడమే మేలు. పన్నుల రాబడిని ఆమోదయోగ్యంగా పంచుకునేందుకు దోహదం చేసే సూత్రమేమిటి? ఇంకా పాలనాపరమైన నిబంధనలు, నియంత్రణలు మొదలైనవి ఎన్నో ఆ వివాదాన్ని మరింతగా ప్రభావితం చేస్తున్నాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల ఇంధన ధరలపై పన్నును తగ్గిస్తూ వ్యాట్ మొదలైన పన్నులు తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. అయితే పలు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ఆర్థికమంత్రి విజ్ఞప్తిని ఉపేక్షించాయి. పన్నుల వ్యవస్థ విషయంలో కేంద్రం ‘సలహాల’ రూపేణా బహిరంగంగా సలహాలు ఇవ్వడమనేది రాష్ట్ర ప్రభుత్వాలకు మింగుడుపడడం లేదు. పన్నుల విషయంలో కేంద్రం తమను ఇలా నిర్దేశించడమేమిటి అని రాష్ట్రాలు ప్రశ్నిస్తున్నాయి. వస్తుసేవల పన్ను (జీఎస్టీ)తో ఇప్పటికీ తాము అనేక సమస్యలతో సతమతమవుతున్నామని రాష్ట్రాలు వాపోతున్నాయి. తమ ఆర్థిక స్వతంత్ర ప్రతిపత్తిని తగ్గించివేసి, పన్నుల వసూళ్లపై తమ రాజ్యాంగ హక్కులను కేంద్రం హరించివేస్తోందని రాష్ట్రాలు దుయ్యబడుతున్నాయి. అనేక విధాల ప్రతిబంధకంగా ఉన్న పన్నుల వ్యవస్థను సంస్కరించేందుకే జీఎస్టీని ప్రవేశపెట్టారు. అయితే ఈ కొత్త పన్నుల వ్యవస్థ సహకార సమాఖ్య స్ఫూర్తికి ఏమాత్రం అనుగుణ్యంగా లేదని రాష్ట్రాలు విమర్శిస్తున్నాయి. జీఎస్టీ మూలంగా తరచు తమకు ఆదాయ లోటు ఏర్పడి కేంద్రం వితరణపై ఆధారపడవలసి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వాలు విమర్శిస్తున్నాయి.


కేంద్ర– రాష్ట్ర సంబంధాలలోని ప్రస్తుత వైషమ్యాన్ని మరొక అంశం మరింతగా తీవ్రతరం చేస్తోంది. అది, బీజేపీ వెర్సెస్ బీజేపీయేతర పార్టీల పాలనలో ఉన్న రాష్ట్రాలకు సంబంధించినది. ఎన్నికల ప్రచారంలో బీజేపీ పాలనలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలే ఇతోధిక పురోగతిని సాధిస్తున్నాయని ప్రధానమంత్రి తరచు నొక్కి చెప్పడం తమ పట్ల వివక్ష చూపడమేనని ప్రతిపక్షాల పాలనలో ఉన్న రాష్టాలు నిరసిస్తున్నాయి. ఈ నిరసనలో నిజం లేకపోలేదు. ఎందుకంటే ఆ వివక్షా వైఖరి కేవలం ఎన్నికల ప్రచారానికే పరిమితం కావడం లేదు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన ముఖ్యమంత్రుల సమావేశంలో పెట్రోలియం ఉత్పత్తుల ధరలు తగ్గించడంలో ప్రతిపక్షాల పాలనలో ఉన్న రాష్ట్రాలు విఫలమయ్యాయని ప్రధానమంత్రి స్వయంగా విమర్శించారు. ఇది ‘మనము’, ‘వారు’ అనే తేడాను చూపడం మినహా మరేమీ కాదు కదా.


మోదీ సర్కార్ అనుసరిస్తున్న వైఖరి వివిధ రాజకీయ పక్షాలను, రాష్ట్ర ప్రభుత్వాలను వ్యాకులపరుస్తోంది. కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగపరుస్తున్నారనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి. ఉన్నతాధికారుల బదిలీలు, నియామకాలపై వివాదాలు, ఘర్షణలు సరేసరి. బెంగాల్ ఇందుకొక తిరుగులేని ఉదాహరణ. ఆ రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రితో నిత్యం ఏదో ఒక విషయమై కలహిస్తున్నారు. రాజ్యాంగ బద్ధమైన అధికారాల విభజన సూత్రాన్ని ఎవరూ గౌరవించడం లేదు. బెంగాల్ ప్రభుత్వ ప్రధానకార్యదర్శిని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రతించకుండానే కేంద్రానికి బదిలీ చేసింది. ప్రధానమంత్రి నేతృత్వంలో జరిగిన తుపాను సహాయ కార్యకలాపాల సమీక్షా సమావేశానికి ఆయన హాజరు కాకపోవడంపై నెలకొన్న వివాదంలో ఈ రాజ్యాంగ విరుద్ధ చర్యను మోదీ ప్రభుత్వం చేపట్టింది. ఢిల్లీలో సైతం ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని కేంద్రం ఎంతగా అదుపు చేయాలో అంతగా అదుపు చేస్తోంది. ఢిల్లీకి సంబంధించిన విధాన నిర్ణయాలలోనూ, కీలక నియామకాలలోనూ కేజ్రీవాల్ ప్రభుత్వ అభిప్రాయాలను ఎంత మాత్రం పరిగణనలోకి తీసుకోవడం లేదు.


కేంద్ర దర్యాప్తు సంస్థలు ప్రతిపక్షాల పాలనలో ఉన్న రాష్ట్రాలలో చురుగ్గా వ్యవహరిస్తూ, బీజేపీ పాలిత రాష్ట్రాలలో మందకొడిగా ఉంటున్నాయి. ఇది ఉద్దేశపూర్వకంగా జరుగుతుండడంతో కేంద్రం, రాష్ట్రాల మధ్య విశ్వాసలోటు మరింతగా విస్తృతమవుతోంది. ప్రతి విపక్షాలకు చెందిన ప్రతీ ముఖ్యమంత్రి, ఆయన సన్నిహిత సహచరులు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నిఘాలో ఉంటున్నారు. తాజాగా జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్‌పై కూడా ఈ నిఘా ప్రారంభమయింది. దీంతో అనుమానాలు, ప్రాతికూల్య ధోరణులు పెరిగిపోతున్నాయి. ప్రతిపక్షాల ప్రభుత్వాలలో ఉన్నవారే కపటవర్తనులూ, అవినీతిపరులా? బీజేపీ ప్రభుత్వాలలో ఉన్నవారు అందరూ నీతీ నిజాయితీలతో వ్యవహరిస్తున్నవారేనా? ప్రతిపక్షాలు వేస్తున్న ఈ ప్రశ్నలకు మోదీ సర్కార్ సమాధానమివ్వడం లేదు. పైగా రాజకీయ కక్ష సాధింపు వైఖరితో వ్యహరిస్తున్నారన్న విపక్షాల ఆరోపణను కేంద్రం కొట్టివేస్తోంది.


సర్వాధికారాలు చెలాయిస్తోన్న సర్వాధినేత నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం గర్వాతిశయంతో వ్యవహరిస్తోంది. పైగా అక్కడా ఇక్కడా దేశవ్యాప్తంగా ఎన్నికలలో విజయాలతో రాజ్యాంగ పరిధిని మించి రాష్ట్రాల పాలనా వ్యవహారాలను సైతం నిర్దేశించేందుకు సాహసిస్తోంది! పర్యవసానమేమిటో మరి చెప్పాలా? సంస్థలు, వ్యవస్థలు బలహీనపడుతున్నాయి. కేంద్ర –రాష్ట్ర సంబంధాలలో పెరుగుతోన్న అసౌష్ఠవంతో పాలనా వ్యవస్థలు, ప్రజాస్వామిక సంస్థలకు సంభవిస్తోన్న నష్టం అపరిమితమైనది. భారత్ లాంటి బలిష్ఠ బహుళ–పార్టీ ప్రజాస్వామ్యం ఎన్నికైన ఏకపార్టీ, ఏకైక నాయకుని నిరంకుశపాలనగా క్షీణించిపోకూడదు. సంప్రదింపుల ప్రక్రియలను పాటించకుండా కీలక నిర్ణయాలు తీసుకునే అధినేతకు ప్రజల బాగోగులపై శ్రద్ధ ఉంటుందా? ప్రధానమంత్రి పదవీ బాధ్యతలు చేపట్టిన కొద్దికాలానికే ప్రణాళికా సంఘాన్ని నరేంద్ర మోదీ శాశ్వతంగా మూసివేశారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రణాళికా సంఘం నుంచి తాను ఎదుర్కొన్న వ్యతిరేకత, ఆటంకాలే మోదీని ఆ చర్యకు పురిగొల్పాయని చెప్పడం సత్యదూరమేమీ కాదు. అందరూ అలానే భావించారు మరి. ద్వాదశ సంవత్సరాలకు పైగా గుజరాత్ ముఖ్యమంత్రిగా గుజరాత్‌ను పాలించిన నరేంద్ర మోదీ, ప్రజల చేత ఎన్నికోబడని ఢిల్లీ బ్యూరాక్రాట్లు, ప్రజల మద్దతుతో ‘ఎన్నికైన నాయకులకు’ ప్రతి వ్యవహారంలోనూ షరతులు నిర్దేశించడాన్ని ఆయన హర్షించలేకపోయారు. మరి నేడు, సరిగ్గా అటువంటి కేంద్రీకృత పరిపాలనా ధోరణులనే మోదీ పాలనా నమూనా ప్రోత్సహిస్తోంది! గుజరాత్ ముఖ్యమంత్రిగా ఏ నిరంకుశ పోకడలను మోదీ నిరసించారో నేడు అవే పద్ధతులను ఆయన అనుసరిస్తున్నారు! మన సమాఖ్య పాలనా విధానం కథ మళ్లీ మొదటికొచ్చింది.


తాజా కలం: నిత్య కదన కుతూహలశీలి మమతా బెనర్జీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఇప్పుడు స్ఫూర్తిదాయకంగా ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల హైదరాబాద్‌కు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ భాగ్యనగరంలో లేకుండా బెంగళూరు వెళ్ళారు! ‘ఆ ఒక్క కుటుంబం కోసమేనా బలిదానాలు’ అని ప్రశ్నిస్తూ తెలంగాణలో కుటుంబ పాలనను కేసీఆర్ ప్రోత్సహిస్తున్నారని ఆ సందర్భంగా మోదీ ఆరోపించారు. గత ఏప్రిల్‌లో ముంబైలో ప్రధానమంత్రి పాల్గొన్న తొలి లతా మంగేష్కర్ పురస్కార ప్రదాన సభకు ఒకనాటి మిత్రపక్ష అధినేత, ప్రస్తుత మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే హాజరుకాలేదు. ఏమిటీ విభేదాలు? ఎందుకీ కలహాలు? ఎంతైనా కలవరం కలిగిస్తున్నాయి. మన సమున్నత రాజ్యాంగ నిర్మాతలు ఔదలదాల్చిన ‘సహకార సమాఖ్య వాదం’ ఇప్పుడు ద్వేషపూరిత పోటీవాదం, ఆత్మ వినాశక రాజకీయాలలో చిక్కుకున్నది.


రాజ్‌దీప్‌ సర్దేశాయి 

(వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్‌్ట)

Updated Date - 2022-06-03T06:13:56+05:30 IST