‘రెట్టింపు’ కష్టాల్లోకి నెట్టిన మోదీ!

ABN , First Publish Date - 2022-01-18T08:03:23+05:30 IST

ఆర్థిక తోడ్పాటు అందించడం కంటే పేదలకు చేయదగ్గ సహాయం మరేముంటుంది? నగదు బదిలీ ద్వారా పేదప్రజలను ఆదుకోవడాన్ని ఆర్థికశాస్త్ర నోబెల్ బహుమతి గ్రహీత అభిజిత్ బెనర్జీ గట్టిగా...

‘రెట్టింపు’ కష్టాల్లోకి నెట్టిన మోదీ!

ఆర్థిక తోడ్పాటు అందించడం కంటే పేదలకు చేయదగ్గ సహాయం మరేముంటుంది? నగదు బదిలీ ద్వారా పేదప్రజలను ఆదుకోవడాన్ని ఆర్థికశాస్త్ర నోబెల్ బహుమతి గ్రహీత అభిజిత్ బెనర్జీ గట్టిగా సమర్థిస్తున్నారు. ‘ పన్నుల రూపేణా సమకూరిన డబ్బు పేదలకే చేరాలి. అందుకు అర్హతలు నిర్ణయించడం అన్నింటికన్నా ముఖ్యం. భారత జనాభాలో అట్టడుగున ఉన్న 60శాతం మందికి నగదు బదిలీ చేయాలి. తద్వారా జరిగే నష్టమేమీ ఉండదు’ అని ఆయన అన్నారు. 


తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ అమలుపరుస్తున్న పలు సంక్షేమ పథకాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాపీ కొడుతున్న విషయం రహస్యమేమీ కాదు. 2022 సంవత్సరం నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామ‌ని 2016లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. అయితే ఆ తరువాత కేంద్రప్రభుత్వం రూపొందించిన అనేక రైతు వ్యతిరేక విధానాల వల్ల రైతుల కష్టాలు రెట్టింపయ్యాయి. ఇది ఎవరూ కొట్టివేయలేని నిజం. ఇదే వాస్తవం గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ భారతీయ రైతుల పక్షాన, ఒక రైతుగా కూడా ప్రధానమంత్రి మోదీకి లేఖ రాశారు. ఎరువుల ధ‌ర‌లు 50 నుంచి 100 శాతం పెరిగాయో లేదో, పెరిగిన ధరల ప్రభావంతో రైతాంగం మరిన్ని నష్టాలలో కూరుకుపోతున్నదో లేదో, వ్యవసాయాన్ని కార్పొరేట్ శ‌క్తుల‌కు క‌ట్టబెట్టేందుకు కుట్రలు చేస్తున్నారో లేదో భారతీయ జనతాపార్టీ నాయకులు జవాబివ్వాలి. ప్రధానమంత్రికి కేసీఆర్ రాసిన లేఖకు కౌంటర్‌గా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ రాసిన లేఖలో పస లేకపోగా రైతుల సమస్యలపై ఆయన అవగాహనా రాహిత్యమే బట్టబయలయింది. 


కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రైతులు నలిగిపోతున్నారనే కథనాలను కొందరు వండి వార్చుతున్నారు. నిజానికి, రైతుల కడగళ్లకు ఎవరు బాధ్యులు? రాష్ట్రమో, కేంద్రమో ఎవరో ఒకరు బాధ్యులవుతారు. దోషి ఎవరో తేల్చకుండా, విలన్ ఎవరో నిర్ణయించకుండా రైతులు నలిగిపోతున్నారంటే ఎలా అర్థం చేసుకోవాలి? అసాధారణ స్థాయిలో పెరుగుతున్న ధరలకు కళ్లెం వేయవలసిన వారు ఎవరు? ధరలను నియంత్రించవలసింది ఎవరు? ముడిసరుకుల ధరలు, ఉత్పత్తివ్యయం, రవాణా ఛార్జీలు, దిగుమతి సుంకం భారంతో ఎరువుల ధరలు పెరుగుతున్నట్లు ఫెర్టిలైజర్‌ కంపెనీల వాదన. ఎరువుల వాడకాన్ని తగ్గించాలని రాష్ట్రానికి కేంద్రం ఉచిత సలహాలు ఇస్తోంది. 


ఎరువుల ధరల పెంపుదలతో రైతులపై పెట్టుబడి భారం పెరుగుతోంది. వ్యవసాయరంగాన్ని కుదేలు చేయడానికే కేంద్రప్రభుత్వం ధరలు పెంచుతున్నదని సీఎం కేసీఆర్‌ విరుచుకుపడ్డారు. రైతులపై భారం పడకుండా ఉండడానికి తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే విషయాన్ని సీఎం వెల్లడించలేదని ఒక వార్తాకథనం వచ్చింది. ఉచిత ఎరువుల హామీ విషయం ఏమయిందని అటు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఇటు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో రైతుల అవసరాలకు సరిపడా ఉచిత ఎరువులు పంపిణీ చేస్తామని కేసీఆర్‌ గతంలో ప్రకటించిన మాట నిజమే. పంట పెట్టుబడి కోసం రబీ, ఖరీఫ్ సీజన్లకు కలిపి ఎకరానికి రూ. 10 వేలు తెలంగాణ ప్రభుత్వం అందిస్తోంది. ఇప్పటివరకు రూ. 50,000 కోట్లు రైతులకు పంపిణీ చేసింది. పంట పెట్టుబడి అంటే ఎరువులు, ఇతర సేద్య దినుసులు కాదా? ఈ దృష్ట్యా రేవంత్, సంజయ్ ప్రశ్నలు అర్థరహితం. ఎరువులను పూర్తిగా స‌బ్సిడీపై ఇవ్వాలని, పంట పెట్టుబ‌డి మొత్తాన్ని త‌గ్గించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ముఖ్యమంత్రి కేసీఆర్ డిమాండ్ చేస్తున్నారు. 70 ఏళ్లుగా ఎరువుల‌పై స‌బ్సిడీ కొన‌సాగుతోందని ఆయన కేంద్రప్రభుత్వానికి గుర్తు చేశారు. వ్యవసాయ కార్యకలాపాలను గ్రామీణ ఉపాధి హామీ పథకంతో అనుసంధానం చేయాల‌ని తెలంగాణ ప్రభుత్వం ఇదివరకే తీర్మానం చేసి పంపింది. కేంద్రం నుంచి ఎలాంటి స్పంద‌న లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పచ్చి అబద్ధాలతో ప్రధానమంత్రికి లేఖ రాశారని బండి సంజయ్ తన లేఖలో పేర్కొన్నారు. .రైతుల పాలిట రాబందుగా మారిన కేసీఆర్‌ రైతుబంధునంటూ సంబరాలు చేసుకుంటున్నారని కూడా ఆయన విమర్శించారు. 


రైతు శ్రేయస్సుకు ముఖ్యమంత్రి కేసిఆర్ ఇచ్చినంత ప్రాధాన్యం దేశంలో మరే ముఖ్యమంత్రి అయినా ఇస్తున్నారా? ఇవ్వడం లేదు కదా. ఇదే ప్రతిపక్షాలకు మింగుడుపడని వ్యవహారం. కేసీఆర్ మానసపుత్రికల్లో రైతుబంధు, రైతుబీమా ముఖ్యమైనవి. రైతుల ముఖాల్లో నిండు ఆనందం కోసం ఆయన ఎంతదూరమైనా వెళ్ళగలరు. ప్రభుత్వమే రైతుల తరఫున ప్రీమియం చెల్లిస్తూ మూడున్నరేళ్లుగా అమలు చేస్తున్న రైతుబీమా వంటి పథకం దేశంలో మరెక్కడా లేదు. దాదాపు 72 వేల మంది రైతులకు ఈ పథకం ద్వారా పరిహారం అందింది. ఒక్కో కుటుంబానికి ఐదు లక్షల రూపాయల చొప్పున మొత్తం రూ. 3618. 55 కోట్ల సహాయం పరిహారంగా అందినట్టు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నవి. పుట్టెడు దుఃఖంలో ఉండే రైతు కుటుంబానికి కేసీఆర్ దూరదృష్టితో అమలుపరుస్తున్న రైతుబీమా పథకం ఒక గొప్ప ఓదార్పు. అప్పులు, ఇతర కారణాలతో దాదాపు 75 వేల మంది రైతులు తెలంగాణలో ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం ఉన్నది. అనారోగ్యంతోనూ, రోడ్డు ప్రమాదాల్లోనూ కన్ను మూసినవారూ ఉన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతులు కూడా ఉన్నారు. ఈ మరణాలన్నిటినీ ఒకే గాటన కట్టి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని ప్రతిపక్షాలు చూస్తున్నాయి. అకస్మాత్తుగా కొవిడ్ బారిన పడి మరణించిన ఎంతోమంది రైతులు ఈ బీమా పథకం ఉన్నందున ఐదు లక్షల రూపాయల సహాయాన్ని పొందగలిగారు. ప్రభుత్వం ప్రతి ఏటా వేయి కోట్లకు పైగా ఈ పథకంపై ఖర్చు చేయడం ప్రభుత్వానికి భారమే. అయితే రైతుబంధు అమలు చేస్తున్నప్పుడు అందుకు తోడుగా ఇలాంటి బీమా సౌకర్యాన్ని కూడా కలగజేయడం సముచితంగా ఉంటుందని కేసీఆర్ భావిస్తున్నారు. మరి ఆయన రైతు పక్షపాతి కదా. ఇదే కేసీఆర్‌కు ఒక విలక్షణ గుర్తింపు తీసుకువస్తోంది. 


తరతరాలుగా విస్మరిస్తూ వచ్చిన ’జనసంక్షేమం’ పైకి అందరి దృష్టిని నోబెల్ గ్రహీత అమర్త్యసేన్ మళ్లించారు. సామాజిక సంక్షేమాన్ని ఆయన బలంగా ప్రతిపాదిస్తున్నారు. ఈ ఆధునిక కాలంలో ‘అభివృద్ధి’ దిశను మార్చటం ద్వారా అమర్త్యసేన్ ఐక్యరాజ్యసమితి కార్యాచరణను కూడా ప్రభావితం చెయ్యగలిగారు. ఆర్థిక సంస్కరణలకు ముందు విద్య, వైద్యం, ఆహార లభ్యత వంటివి సంస్కరించినప్పుడే నిజమైన ఆర్థిక పురోభివృద్ధి సాధ్యమని ప్రభుత్వాలు గుర్తించేలా ఆయన వాదిస్తూ వస్తున్నారు. 


తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధకుడు కేసీఆర్‌కు ఏయే రంగాల్లో రాష్ట్రం చితికిపోయి ఉన్నదో, ఏయే రంగాలు విధ్వంసమయ్యాయో పరిపూర్ణ అవగాహన ఉన్నది. వాటిపై ఉద్యమకాలంలో ఎంతో సుదీర్ఘంగా ఆయన అధ్యయనం చేశారు. ఆయన ఆలోచనలు ఎలా కార్యరూపం దాల్చుతున్నాయో సాగునీటి రంగంతో పాటు వివిధ రంగాల్లో జరుగుతున్న అభివృద్ధిని గమనిస్తే అర్థమవుతుంది. ప్రజలకు, ముఖ్యంగా ,రైతులకు ఏమి కావాలో కేసీఆర్‌కు తెలుసు. అందుకే ఆయన దూరదృష్టిపై జాతీయస్థాయిలో చర్చ జరుగుతోంది.

కవిత

శాసనమండలి సభ్యురాలు

Updated Date - 2022-01-18T08:03:23+05:30 IST