శభాష్‌.. వెదర్‌మ్యాన్‌

ABN , First Publish Date - 2021-07-26T08:55:09+05:30 IST

రైతులకు ఎప్పటికప్పుడు వాతావరణ వివరాలు అందిస్తున్న ఏపీ యువ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌, ‘వెదర్‌మ్యాన్‌’ సాయి ప్రణీత్‌ను ప్రధాని మోదీ ప్రశంసించారు.

శభాష్‌.. వెదర్‌మ్యాన్‌

  • ‘మన్‌ కీ బాత్‌’లో ఏపీ టెకీకి మోదీ ప్రశంస
  • ఏడాదిగా రైతులకు వాతావరణ సేవలు 
  • 2 రోజుల క్రితం పీఎంవో అధికారుల ఫోన్‌ 
  • ఇదే స్ఫూర్తి కొనసాగించాలని అభినందనలు

న్యూఢిల్లీ/విశాఖపట్నం, జూలై 25(ఆంధ్రజ్యోతి): రైతులకు ఎప్పటికప్పుడు వాతావరణ వివరాలు అందిస్తున్న ఏపీ యువ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌, ‘వెదర్‌మ్యాన్‌’ సాయి ప్రణీత్‌ను ప్రధాని మోదీ ప్రశంసించారు. ఆదివారం మన్‌ కీ బాత్‌లో ప్రసంగించిన మోదీ.. తిరుపతికి చెందిన సాయి ప్రణీత్‌ పేరును ప్రస్తావించారు. వాతావరణ మార్పులను అధ్యయనం చేసి, రైతులను అప్రమత్తం చేస్తున్న తీరును కొనియాడారు. ‘ప్రణీత్‌.. వాతావరణ సమస్యలతో ఎంతో నష్టపోయిన రైతుల ఇబ్బందులను చూసి చలించిపోయాడు. దీంతో వాతావరణ శాస్త్రంపై చాలా కాలంగా ప్రణీత్‌కు ఉన్న ఆసక్తికి పదును పెట్టాడు. తన ఆసక్తిని, ప్రతిభను రైతుల సంక్షేమం కోసం వినియోగించాలని నిర్ణయించాడు. వాతావరణంలో వస్తున్న మార్పులపై రైతులను అప్రమత్తం చేయాలని నిర్ణయించుకున్నాడు. వివిధ ఏజన్సీల నుంచి వాతావరణ డేటాను కొనుగోలు చేశాడు. ఈ డేటా ఆధారంగా వాతావరణంలో వస్తున్న మార్పులను విశ్లేషించి, స్థానిక బాషల్లో రైతులకు సమాచారం అందిస్తుంటాడు. వరదల సమయంలో ఎలా సురక్షితంగా ఉండాలి, తుపాను లేదా పిడుగుల ప్రభావాన్ని ఎలా నివారించాలి మొదలైన అంశాలపై ప్రణీత్‌ మాట్లాడుతుంటాడు’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. 


ఎంతో సంతోషంగా ఉంది: ప్రణీత్‌ 

మన్‌ కీ బాత్‌లో ప్రధాని మోదీ తన పేరును ప్రస్తావించడం చాలా ఆనందంగా ఉందని ‘ఏపీ వెదర్‌మ్యాన్‌’ సాయి ప్రణీత్‌ అన్నారు. గత నెలలో ఐక్యరాజ్య సమితి జర్నల్‌లో ఓ వ్యాసం ప్రచురితమైందని, దీనిని ప్రధానమంత్రి కార్యాలయం అధికారులు చూసి రెండు రోజుల క్రితం ఫోన్‌ చేశారని చెప్పారు. వాతావరణ పరిస్థితుల్ని అప్‌డేట్‌ చేస్తున్న తీరును వారు తెలుసుకున్నారని వివరించారు. ‘ఏపీలో వాతావరణ వివరాలను రోజూ ఉదయం 8.30 గంటలకు బ్లాగ్‌లో పోస్టు చేస్తున్నా. ఆకస్మికంగా జరిగే వాతావరణ మార్పులను కూడా పోస్టు చేస్తా. ఈ వివరాలు వ్యవసాయ పంటలకు ఎంతో ఉపయోగపడతాయి. ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని పీఎంవో అధికారులు సూచించారు. గత ఏడాది నుంచి వాతావరణ వివరాలను రైతులకు అందజేస్తున్నాను’ అని ప్రణీత్‌ అన్నారు. తిరుపతికి చెందిన సాయి ప్రణీత్‌ 2017లో చెన్నైలో ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ పూర్తిచేశారు. ప్రస్తుతం బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. 2013  నుంచే వాతావరణ సమాచారాన్ని సేకరిస్తున్నారు. 

Updated Date - 2021-07-26T08:55:09+05:30 IST