ప్రతిపక్షాలు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాయి : మోదీ మండిపాటు

ABN , First Publish Date - 2020-09-18T19:33:47+05:30 IST

కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాల సవరణ బిల్లులపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న

ప్రతిపక్షాలు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాయి : మోదీ మండిపాటు

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాల సవరణ బిల్లులపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం స్పందించారు. బిహార్ లోని రైల్వే బ్రిడ్డిని ప్రారంభించిన తర్వాత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ అంశాన్ని మోదీ ప్రస్తావించారు. ఈ బిల్లుతో రైతుల సంకెళ్లు తెగిపోనున్నాయని స్పష్టం చేశారు.


ఈ సవరణ బిల్లుతో రైతులకు మినహాయింపు లభిస్తుందని, మధ్యవర్తులు, దళారుల పీడ విరగడ అవుతుందని పేర్కొన్నారు. ఇలా రైతులకు మేలు జరగడం, కొత్త కొత్త అవకాశాలు రావడం కొంత మందికి నచ్చడం లేదని విపక్షాలపై పరోక్షంగా మండిపడ్డారు. కనీస మద్దతు ధర గురించి కొందరు పెద్ద పెద్ద విషయాలు మాట్లాడతారని, పెద్ద పెద్ద హామీలిస్తారని, అయితే ఆ వాగ్దానాలను ఎప్పుడూ నెరవేర్చలేదని కాంగ్రెస్ పై ధ్వజమెత్తారు.


కొన్ని పార్టీలు సంవత్సరాల పాటు దేశాన్ని పాలించాయని, అవే పార్టీలు నేడు ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాయని మండిపడ్డారు.  వ్యవసాయ బిల్లుల విషయంలో విపక్షాలు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఎన్నికల సమయంలో అవే పార్టీలు తమ మేనిఫెస్టోల్లో కూడా ఈ అంశాన్ని చేర్చాయని, ఇప్పుడు మాత్రం రాజకీయం చేస్తున్నారని తీవ్రంగా దుయ్యబట్టారు.


ఈ సవరణ బిల్లుల ద్వారా కనీస మద్దతు ధర లభించదని, ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయదని తప్పుడు విమర్శలతో రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఎంఎస్పీ ద్వారా రైతులకు ఉపయోగపడే ధరలే ఉంటాయని, ఈ బిల్లుకు సీఎం నితీశ్ కూడా మద్దతిచ్చారని మోదీ స్పష్టం చేశారు. 

Updated Date - 2020-09-18T19:33:47+05:30 IST