మోదీపై సభా హక్కుల నోటీస్‌

ABN , First Publish Date - 2022-02-11T08:24:00+05:30 IST

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై రాజ్యసభలో ప్రధాని మోదీ వ్యాఖ్యలను నిరసిస్తూ పార్లమెంటులో టీఆర్‌ఎస్‌ ఎంపీలు ఆందోళనను ఉధృతం చేశారు....

మోదీపై సభా హక్కుల నోటీస్‌

ఉభయ సభల్లో నోటీసులు అందించిన టీఆర్‌ఎస్‌ ఎంపీలు

వెల్‌ల్లోకి వచ్చి నిరసనలు.. ఆందోళన తీవ్రతరం

మొదటి విడత బడ్జెట్‌ సమావేశాల బహిష్కరణకు నిర్ణయం

ప్రధాని వ్యాఖ్యలు సరికాదు.. వేలాది మంది ఆత్మహత్యల 

తర్వాత తెలంగాణ ఏర్పాటు: రాజ్యసభలో ఖర్గే

పార్లమెంటును కించపరిచేలా మోదీ వ్యాఖ్యలు: కేకే

రాజ్యాంగంపై కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై 

మేమూ అసెంబ్లీలో నోటీసు ఇస్తాం: బండి సంజయ్‌


న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై రాజ్యసభలో ప్రధాని మోదీ వ్యాఖ్యలను నిరసిస్తూ పార్లమెంటులో టీఆర్‌ఎస్‌ ఎంపీలు ఆందోళనను ఉధృతం చేశారు. ప్రధాని మోదీపై ఉభయ సభల్లో సభాహక్కుల ఉల్లంఘన తీర్మానం నోటీసులు అందించారు. 187వ నిబంధన ప్రకారం.. ఆ పార్టీ పక్ష నేత కె.కేశవరావు నేతృత్వంలో రాజ్యసభ సెక్రటరీ జనరల్‌ పీసీ మోదీకి; లోక్‌సభలో పార్టీ పక్ష నేత నామా నాగేశ్వర రావు నేతృత్వంలో సెక్రటరీ జనరల్‌ ఉత్పల్‌ కుమార్‌ సింగ్‌కు నోటీసులు అందించారు. ‘‘పార్లమెంటులో సిగ్గుమాలిన పద్ధతుల్లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన చట్టం ఆమోదం పొందిందని ఈనెల 8న రాజ్యసభలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మేం ఈ నోటీసులు ఇస్తున్నాం. ప్రధాని వ్యాఖ్యలుపార్లమెంటును ధిక్కరించేలా, కించపర్చేలా ఉన్నాయి. పార్లమెంటరీ పద్ధతులు, కార్యకలాపాలకు అప్రతిష్ఠ కలిగించేలా ఉన్నాయి. సభ సజావుగా సాగడానికి, కొంతమంది సభ్యులు సృష్టించే అల్లర్లను నిరోధించడానికి తలుపులు మూయాలని సభాపతి తీసుకున్న నిర్ణయాన్ని కూడా ప్రశ్నార్థకం చేశారు. 2014లో లోక్‌సభలో, రాజ్యసభలో రాష్ట్ర విభజన బిల్లును ఆమోదించే సమయంలో సభాపతులు అనుసరించిన పద్ధతులు, సభా నిర్వహణను ప్రధాని మోదీ బహిరంగంగా ప్రశ్నించారు’’ అని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.


నిబంధనల పుస్తకాన్ని అనుసరించి సభాపతులు సభలను నిర్వహిస్తారని, వారిదే తుది నిర్ణయమని తెలిపారు. సభాపతుల నిర్ణయాల్లో లోపాలను ఎత్తి చూపడం సభను ధిక్కరించడమేనని, ఇది సభా హక్కుల ఉల్లంఘన కిందికి వస్తుందని స్పష్టం చేశారు. అనంతరం, ప్రధాని మోదీ వ్యాఖ్యలకు నిరసనగా టీఆర్‌ఎస్‌ ఎంపీలు ఉభయ సభల్లో వెల్‌లోకి వెళ్లి నిరసనలు తెలిపారు. రాజ్యసభలో ఎంపీలు సంతోష్‌ కుమార్‌, లింగయ్య యాదవ్‌, సురేశ్‌ రెడ్డి, లోక్‌సభలో ఎంపీలు రంజిత్‌ రెడ్డి, బీబీ పాటిల్‌, రాములు, వెంకటేశ్‌ నేత స్పీకర్‌ పోడియాన్ని చుట్టుముట్టారు. ‘తెలంగాణ ఏర్పాటుపై చేసిన వ్యాఖ్యలను ప్రధాని ఉపసంహరించుకోవాలి’ అని పేర్కొన్న ప్లకార్డులను ప్రదర్శించారు. సభాహక్కుల నోటీసుపై రాజ్యసభ జీరో అవర్‌ సమయంలో కె.కేశవరావు ప్రస్తావించే ప్రయత్నం చేయగా.. నోటీసులు అందాయని, చైర్మన్‌ వాటిని పరిశీలించి నిర్ణయం తీసుకుంటారని డిప్యూటీ చైర్మన్‌ హరివంశ్‌ అన్నారు. దాంతో, కేకేకు మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎం, శివసేన, ఆర్జేడీ, డీఎంకే, తృణముల్‌ కాంగ్రెస్‌ ఎంపీలు తమ తమ స్థానాల్లో ఉండే ఆందోళన చేశారు. అయినా డిప్యూటీ చైర్మన్‌ స్పందించలేదు. ఆందోళనలు ఉద్ధృతం కావడంతో చివరికి ప్రతిపక్ష నేత మల్లికార్జున్‌ ఖర్గేకు మాట్లాడే అవకాశం ఇచ్చారు. దాంతో, ‘‘ఉభయ సభలు ఆమోదించిన ఏపీ పునర్వ్యవస్థీకరణ బిల్లుపై ప్రధాని వ్యాఖ్యలు చేయడం సరికాదు. తెలంగాణ కోసం వేలాది మంది ఆత్మహత్యలు చేసుకున్నారు’’ అని ఖర్గే వ్యాఖ్యానిస్తుండగా.. డిప్యూటీ చైర్మన్‌ అడ్డుకున్నారు. అనంతరం టీఆర్‌ఎస్‌ ఎంపీలు సభ నుంచి వాకౌట్‌ చేశారు. మొదటి విడత పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలను బహిష్కరించాలని నిర్ణయించారు.


ప్రధాని వ్యాఖ్యలు సరికాదు: కేకే

‘‘పార్లమెంటును కించపరిచేలా, తప్పుబట్టేలా రాజ్యసభలో ప్రధాని మోదీ మాట్లాడారు. సిగ్గు లేకుండా బిల్లును ఆమోదించారని అన్నారు. ప్రధాని స్థాయి మనిషి ఆ మాట అనడానికి వీల్లేదు’’ అని కేకే తప్పుబట్టారు. పార్లమెంటు నుంచి వాకౌట్‌ చేసిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. పార్లమెంటరీ కార్యకలాపాలను కోర్టుల్లో కూడా సవాలు చేయలేరని, అటువంటి పార్లమెంటు గురించి అవమానకరమైన మాటలు మాట్లాడి ప్రధాని మోదీ సభా కార్యకలాపాలను సవాలు చేశారని తప్పుబట్టారు. పార్లమెంటును తక్కువ చేసి చూపించడం అంటే అంతకన్నా దుర్మార్గం లేదని ధ్వజమెత్తారు. పార్లమెంటును అవమానించేలా ప్రధాని మాట్లాడిన దానిలో తెలంగాణ సెంటిమెంట్‌ కూడా ఇమిడి ఉందని, ఎన్నో త్యాగాల ద్వారా వచ్చిన తెలంగాణ ఏర్పాటే తప్పన్నట్లుగా ప్రధాని చేసిన వ్యాఖ్యలను ఏ తెలంగాణవాది కూడా ఓర్చుకోలేడని వ్యాఖ్యానించారు. కాగా, ప్రివిలేజ్‌ నోటీసులు ఇచ్చిన అనంతరం ఏమి జరుగుతుందని విలేకరులు ప్రశ్నించగా.. నోటీసు ప్రివిలేజ్‌ కమిటీకి వెళ్తుందని, కమిటీ నిర్ణయం తీసుకుంటుందని, ఉల్లంఘనులను కమిటీలు గతంలో జైలుకు కూడా పంపించాయని బదులిచ్చారు. అయితే, తమ నోటీసులను సభాపతి అనుమతిస్తారన్న భ్రమల్లో తాను లేనని స్పష్టం చేశారు. క్షమాపణ చెప్పకపోయినా ప్రధాని కనీసం తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటారని భావిస్తున్నానని అన్నారు.



ప్రచారం కోసమే నోటీసులు: సంజయ్‌

కేవలం ప్రచారం కోసమే టీఆర్‌ఎస్‌ ఎంపీలు ప్రధాని మోదీపై సభా హక్కుల ఉల్లంఘన తీర్మానాన్ని అందించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విమర్శించారు. రాజ్యాంగంపై కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై కూడా వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో తాము సభా హక్కుల ఉల్లంఘన తీర్మానాన్ని ప్రవేశపెడతామని స్పష్టం చేశారు. ఢిల్లీలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రధాని మోదీ కాంగ్రె్‌సని విమర్శిస్తే టీఆర్‌ఎస్‌ ఎందుకు స్పందిస్తోందని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీకి టీఆర్‌ఎస్‌ అధికార ప్రతినిధిగా మారిందని విమర్శించారు. బీజేపీ మద్దతుతోనే తెలంగాణ సాధ్యమైందని, పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందే సమయంలో కేసీఆర్‌ పార్లమెంటుకు ఎందుకు హాజరు కాలేదని ప్రశ్నించారు. కాగా, బండి సంజయ్‌, ఎంపీ సోయం బాపురావు, మాజీ ఎమ్మెల్సీ ఎన్‌.రాంచందర్‌రావు గురువారం కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజుజుతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు న్యాయపరమైన అంశాలను చర్చించినట్లు పార్టీవర్గాలు తెలిపాయి.

Updated Date - 2022-02-11T08:24:00+05:30 IST