Advertisement
Advertisement
Abn logo
Advertisement
Oct 25 2021 @ 01:14AM

సాయుధ బలగాల్లో మహిళా శకం

గత ఏడేళ్లలో రెట్టింపయ్యారు

‘మన్‌ కీ బాత్‌’లో ప్రధాని మోదీ


న్యూఢిల్లీ, అక్టోబరు 24: సైన్యం, పోలీసు ఉద్యోగాలు పురుషులకు మాత్రమేనన్న భావన ఇక ఎంత మాత్రం పనికిరాదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. తాను అధికారంలోకి వచ్చిన ఈ ఏడేళ్లలో బలగాల్లో మహిళల సంఖ్య రెట్టింపయిందని చెప్పారు. సాయుధ బలగాల్లో మహిళా శకం ప్రారంభమైందన్నారు. ప్రధాని ఆదివారం జాతినుద్దేశించి ఆకాశవాణిలో ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమంలో మాట్లాడారు. 2014లో తాను పగ్గాలు చేపట్టినప్పుడు పోలీసు బలగాల్లో మహిళల సంఖ్య 1.05 లక్షలు ఉండేదని.. ప్రస్తుతం అది 2.15 లక్షలకు చేరిందని తెలిపారు. భవిష్యత్‌లో కొత్త తరం పోలీసింగ్‌కు వారే సారథులవుతారన్న ఆశాభావం వ్యక్తంచేశారు. ‘కేంద్ర సాయుధ బలగాల్లోనూ వారి సంఖ్య రెట్టింపయింది. పైగా కీలకమైన కోబ్రా బెటిలియన్‌లో భాగస్వాములయ్యేందుకు అత్యంత క్లిష్టతరమైన జంగిల్‌ వార్‌ఫేర్‌ కమేండోలుగా శిక్షణ పొందుతున్నారు (ఉగ్రవాద గ్రూపుల పీచమణిచేందుకు సీఆర్‌పీఎ్‌ఫలో అత్యున్నత శిక్షణ ఇచ్చి కోబ్రా బెటాలియన్‌లో నియమిస్తారు). మెట్రో స్టేషన్లలో కూడా భద్రతాసిబ్బందిగా పనిచేస్తున్నారు. ఇది మన పోలీసు బలగాలపైనే గాక.. యావత్‌ సమాజ స్థైర్యంపైనే సానుకూల ప్రభావం చూపిస్తుంది. మహిళా సిబ్బంది కారణంగా ప్రజల్లో ముఖ్యంగా స్త్రీలలో సహజసిద్ధమైన విశ్వాసం కలుగుతుంది.


మహిళల సున్నితత్వం కారణంగా ప్రజలు మహిళా భద్రతాసిబ్బందిని మరింతగా విశ్వసిస్తారు. మహిళా పోలీసులు బాలికలకు ఆదర్శంగా మారారు. స్కూళ్లు తెరిచాక వారి వద్దకు వెళ్లి ముచ్చటించండి. అది నవతరానికి కొత్త మార్గనిర్దేశమవుతుంది’ అని పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి బలం, పలుకుబడి పెరగడంలో భారతీయ మహిళలు కీలక భూమిక పోషించారని ఈ సందర్భంగా ప్రధాని గుర్తుచేసుకున్నారు. ‘1947-48లో ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల యూనివర్సల్‌ డిక్లరేషన్‌ ముసాయిదాను రూపొందించారు. పురుషులందరినీ సమానంగా సృష్టించినట్లు అందులో పేర్కొన్నారు. దీనిపై మన భారతీయ ప్రతినిధి హంసా మెహతా అభ్యంతరం చెప్పారు. మానవులందరూ సమానమని మార్పించారు. స్త్రీ, పురుషులిద్దరూ సమానమన్న మన భారతీయ భావనకు అనుగుణంగా ఇది ఉంది. లింగ సమానత్వంపై మరో భారతీయ ప్రతినిధి లక్ష్మీ మీనన్‌ కూడా తన అభిప్రాయాలను గట్టిగా వినిపించారు. తదనంతరం 1953లో ఐరాస జనరల్‌ అసెంబ్లీకి మన విజయలక్ష్మీ పండిట్‌ తొలి అధ్యక్షురాలయ్యారు’ అని వివరించారు.


జీ-20 సదస్సుకు మోదీ..

ఇటలీలోని రోమ్‌లో ఈ నెల 30న మొదలయ్యే జి-20 దేశాల సదస్సులో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. ఆయన 28న గానీ, 29న గానీ బయల్దేరతారని అధికార వర్గాలు అంటున్నాయి. ఈ సదస్సులో.. అఫ్గానిస్థాన్‌ సంక్షోభంపై అన్ని దేశాలూ ఏకాభిప్రాయంతో వ్యవహరించాల్సిందిగా ఆయన కోరతారు. అనంతరం పర్యావరణ మార్పులపై స్కాట్లండ్‌లోని గ్లాస్గోవ్‌లో జరిగే అంతర్జాతీయ సదస్సు ‘సీవోపీ-26’ సదస్సులో కూడా పాల్గొంటారు.

Advertisement
Advertisement