Abn logo
Sep 25 2021 @ 02:39AM

ప్రపంచ సవాళ్లను పరిష్కరించే దృఢమైన బంధం

భారత్‌-అమెరికా సంబంధాల్లో కొత్త అధ్యాయం

నలభై లక్షల మంది భారతీయ-అమెరికన్లు

అమెరికాను నిత్యం బలోపేతం చేస్తున్నారు: బైడెన్‌

ఇరుదేశాల మధ్య బంధంలో వాణిజ్యమే కీలకం: మోదీ

శ్వేతసౌధంలో అమెరికా అధ్యక్షుడితో ప్రధాని భేటీ

భారత్‌ చాలా ముఖ్యమైన భాగస్వామి: కమల


వాషింగ్టన్‌, సెప్టెంబరు 24: భారత్‌-అమెరికా సంబంధాల్లో కొత్త అధ్యాయం మొదలైందని.. నలభై లక్షల మంది భారతీయ అమెరికన్లు అమెరికాను నిత్యం బలోపేతం చేస్తున్నారని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ పేర్కొన్నారు. భారత్‌-అమెరికా బంధం పలు అంతర్జాతీయ సవాళ్లను పరిష్కరించడానికి తోడ్పడుతుందని తాను చాలాకాలంగా విశ్వసిస్తున్నట్టు ఆయన తెలిపారు. ‘‘నిజానికి.. 2020నాటికి అమెరికా-భారత్‌ ప్రపంచంలోనే అత్యంత సన్నిహిత దేశాలుగా ఉంటాయని నేను 2006లోనే చెప్పాను’’ అని గుర్తుచేశారు. రెండు అతిపెద్ద ప్రజాస్వామ్యదేశాలైన భారత్‌, అమెరికా మధ్య సంబంధాలు మరింత సన్నిహితం, దృఢతరం, బలోపేతం కాబోతున్నాయన్నారు.  అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్రమోదీ శుక్రవారం ఉదయం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో భేటీ అయ్యారు.  బైడెన్‌ ఈ ఏడాది జనవరిలో అమెరికా 46వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక వీరిద్దరూ ముఖాముఖి భేటీ కావడం ఇదే మొదటిసారి. కొవిడ్‌-19పై పోరాటంలో భాగంగా ఇంకా ఏం చేయాలి? పర్యావరణ మార్పు సవాల్‌ను ఎలా ఎదుర్కోవాలి? ఇండో-పసిఫిక్‌ ప్రాంతం లో సుస్థిరత నెలకొనడానికి ఏం చేయాలి? తదితర అంశాలపై ఈ భేటీలో మోదీతో చర్చించినట్టు ఆయన చెప్పారు. వీటితోపాటు ఆర్థిక సహకారం, అఫ్ఘానిస్థాన్‌ సహా ఇరుదేశాల ప్రయోజనాలకు సంబంధించిన పలు కీలక అంశాలపై వీరి భేటీలో చర్చకు వచ్చాయి. గతం లో బైడెన్‌ అమెరికా ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పుడు వీరిద్దరూ భేటీ అయ్యారు. బైడెన్‌ అధ్యక్షుడయ్యాక మాత్రం ద్వైపాక్షిక భేటీ జరగలేదు. ఈ ఏడాది జనవరి నుంచి బైడెన్‌ పలుమార్లు మోదీతో ఫోన్‌లో మాట్లాడారు. ఇద్దరూ కొన్ని వర్చువల్‌ సదస్సుల్లో పాల్గొన్నారంతే. ఈ నేపథ్యంలోనే బైడెన్‌.. ‘‘మీరు నాకు చాలా కాలంగా తెలుసు. మీరు శ్వేతసౌధానికి తిరిగొచ్చినందుకు సంతోషంగా ఉన్నాను. మీకు మన చరిత్ర గురించి బాగా తెలుసు. మన సంబంధాలు ఎల్లప్పుడూ బాగున్నాయి’’ అని మోదీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దీనికి మోదీ.. ‘‘ఈ దశాబ్దం ఎలా రూపుదిద్దుకోవాలనే అంశంలో మీ నాయకత్వం కీలకపాత్ర పోషిస్తుంది. భారత్‌-అమెరికా మధ్య స్నేహం మరింత బలోపేతం కావడానికి అవసరమైన బీజాలు పడ్డాయి’’ అని బైడెన్‌తో అన్నారు. అమెరికా పురోగతిలో ప్రవాసభారతీయులు క్రియాశీల తోడ్పాటునందించడం తనకు సంతోషాన్ని కలిగిస్తోందని పేర్కొన్నారు. ఈ శతాబ్దపు మూడో దశాబ్దం ఆరంభంలో జరుగుతున్న ఈ భేటీ ఎంతో కీలకమైందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో టెక్నాలజీనే చోదకశక్తిగా మారిందని.. ప్రపంచ సంక్షేమానికి అవసరమైన టెక్నాలజీ రూపకల్పనకు మనందరం మన ప్రతిభను ఉపయోగించాలని మోదీ అభిప్రాయపడ్డారు. ఈ దశబ్దాంలో భారత్‌-అమెరికా సంబంధాల్లో కీలకమైన అంశం వాణిజ్యమేనని గుర్తుచేసిన ప్రధాని.. ఆ దిశగా చేయాల్సిన కృషి చాలా ఉందన్నారు.

బాపూజీ సందేశం..

వచ్చేవారంలోనే మహాత్మాగాంధీ జయంతి ఉన్న నేపథ్యంలో.. బాపు సందేశాన్ని కూడా బైడెన్‌ గుర్తుచేసుకున్నారు. మహాత్ముడు ప్రవచించిన అహింస, గౌర వం, సహనం వంటివి అప్పటికన్నా ఇప్పుడు ఇంకా ఆవశ్యకమైనవని పేర్కొన్నారు. దీనికి మోదీ.. ‘‘గాంధీజీ ప్రవచించిన ధర్మకర్తృత్వం అనే అంశం ప్రపంచానికి మున్ముందు చాలా ముఖ్యమైన అంశం కాబోతోంది’’ అని వ్యాఖ్యానించారు. వీరి భేటీ అనంతరం క్వాడ్‌ దేశాధినేతల సదస్సు జరిగింది. అందులో మోదీ, బైడెన్‌తోపాటు.. ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మోరిసన్‌, జపాన్‌ ప్రధాని సుగా పాల్గొన్నారు. బైడెన్‌ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. కొవిడ్‌ నుంచి పర్యావరణ మార్పు దాకా పలు సవాళ్లపై కలిసి పోరాడేందుకు అమెరికా, ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్‌ ముందుకొచ్చాయని పేర్కొన్నారు. అనంతరం ప్రధాని మోదీ మాట్లాడారు. ‘‘2004లో సునామీ వచ్చిన తర్వాత.. ఇండో పసిఫిక్‌ ప్రాంతానికి సాయం చేసేందుకు మన నాలుగు దేశాలు మొదటిసారి కలుసుకున్నాయి. కొవి డ్‌-19 మహమ్మారితో ప్రపంచమంతా పోరాడుతున్న సమయంలో క్వాడ్‌గా మనం ఇక్కడ మానవాళి సంక్షే మం కోసం భేటీ అయ్యాం’’ అని పేర్కొన్నారు. కాగా, శనివారం సాయంత్రం జరిగే ‘గ్లోబల్‌ సిటిజెన్‌ లైవ్‌’లో మోదీ వర్చువల్‌గా ప్రసంగించనున్నారు.


భారత్‌లో ఐదుగురు బైడెన్లు

బైడెన్‌ అనే ఇంటిపేరుతో భారతదేశంలో ఐదుగురు ఉన్నారట! ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ మోదీతో భేటీ సమయంలో స్వయంగా చెప్పా రు. 1972లో 29 ఏళ్ల వయసులో తాను మొట్టమొదటిసారి సెనెటర్‌గా ఎన్నికైనప్పుడు ముంబై నుంచి బైడెన్‌ అనే ఇంటిపేరున్న వ్యక్తి నుంచి ఒక లేఖ వచ్చిందని.. 2013లో భారత పర్యటనకు వచ్చినప్పుడు.. ‘‘భారతదేశంలో మీ బంధువులెవరైనా ఉన్నారా?’’ అని మీడియా అడిగితే ఆ లేఖ గురించి చెప్పానని తెలిపారు. మర్నా డు విలేకరులు.. భారతదేశంలో ఐదుగురు బైడెన్లు ఉన్నట్టు తనకు చెప్పారని వివరించారు. ఈస్టిండియా టీ కంపెనీలో కెప్టెన్‌ జార్జ్‌ బైడెన్‌ అనే వ్యక్తి ఉండేవాడని.. బహుశా అతడు ఇక్కడే ఉండిపోయి, భారత మహిళను పెళ్లి చేసుకుని ఉంటాడని జోక్‌ చేశారు. 


మా మీడియా కన్నా.. మీ మీడియానే బెస్టు

‘‘మా (అమెరికా) మీడియాతో పోలిస్తే మీ (భారత) మీడియానే మెరుగ్గా ప్రవర్తించింది’’ అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రధాని మోదీతో అన్నారు. శుక్రవారం భేటీ నిమిత్తం మోదీ వైట్‌హౌస్‌ వద్దకు చేరుకోగానే బైడెన్‌ ఆయనకు స్వాగతం పలికారు. దగ్గరుండి ఓవల్‌ కార్యాలయానికి తీసుకెళ్లారు. అక్కడ ఎవరి ఆసనంలో వారు కూర్చున్న తర్వాత.. బైడెన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. ‘‘మీ అనుమతితో.. పాత్రికేయుల ప్రశ్నలకు సమాధానం చెప్పకూడదని నేను భావిస్తున్నాను. ఎందుకంటే వారు పాయింటుకు సంబంధించిన ప్రశ్నలు అడగరు’’ అని మోదీతో అన్నారు. దీనికి మోదీ బైడెన్‌తో తాను సంపూర్ణంగా ఏకీభవిస్తున్నట్టు చెప్పారు.