'వన్ నేషన్ వన్ హెల్త్ కార్డ్' స్కీమ్‌ను ప్రకటించనున్న మోదీ..!

ABN , First Publish Date - 2020-08-15T00:58:34+05:30 IST

74వ స్వాతంత్ర్య దినోత్సవంగా సందర్భంగా దేశ ప్రజలను ఉద్దేశించి ఎర్రకోట నుంచి శనివారంనాడు ప్రసంగించనున్న ప్రధాని..

'వన్ నేషన్ వన్ హెల్త్ కార్డ్' స్కీమ్‌ను ప్రకటించనున్న మోదీ..!

న్యూఢిల్లీ: 74వ స్వాతంత్ర్య దినోత్సవంగా సందర్భంగా దేశ ప్రజలను ఉద్దేశించి ఎర్రకోట నుంచి శనివారంనాడు ప్రసంగించనున్న ప్రధాని నరేంద్ర మోదీ... ఈ సందర్భంగా 'వన్ నేషన్ వన్ హెల్త్ కార్డ్‌' (ఒక దేశం, ఒక హెల్త్ కార్డ్) స్కీమ్‌ను ప్రకటించే అవకాశాలున్నాయి. దేశంలోని ప్రతి ఒక్క పౌరుడి ఆరోగ్య రికార్డులను డిజిటల్ ఫార్మెట్‌లో భద్రపరచే పథకం ఇది. ఈ పథకం కింద ఒక వ్యక్తి తాను చేయించుకున్న వైద్య చికిత్సలు, పరీక్షలకు సంబంధించిన వివరాలతో సహా అతని మెడికల్ హిస్టరీ రికార్డులన్నీ ఈ కార్డులో డిజిటల్‌ ఫార్మెట్‌లో భద్రపరుస్తారు.


ఆసుపత్రులు, క్లినిక్‌లు, డాక్టర్లను సెంట్రల్ సర్వర్‌కు అనుసంధానిస్తారు. అయితే, ఆసుపత్రులు, పౌరులు 'వన్ నేషన్ వన్ హెల్త్ కార్డు'ను కోరుకుంటారా, వద్దనుకుంటారా అనేది పూర్తిగా ఐచ్ఛికం. కార్డు కావాలనుకున్న వారికి 'యునీక్ ఐడీ' జారీ చేస్తారు. ఆ ఐడీ ద్వారా సిస్టమ్‌కు లాగ్ కావచ్చు. దశలవారిగాఈ పథకాన్ని అమలు చేయనున్నారు. ఈ స్కీమ్ మొదటి దశలో రూ.500 కోట్ల బడ్జెట్ కేటాయింపులు జరుపుతారు.


అతి పెద్ద ప్రయోజనం ఇదే...

ఒక వ్యక్తి (పేషెంట్) ఇండియాలో ఏ డాక్టర్‌‌ దగ్గరకు వెళ్లినా, ఆసుపత్రి వెళ్లినా తనకు సంబంధించిన డాక్టర్ ప్రిస్కిప్షన్లు, రిపోర్టులు తీసుకుని వెళ్లాల్సిన అవసరం లేదు. ఇది స్కీమ్ అతి పెద్ద ప్రయోజనంగా చెప్పవచ్చు. డాక్టరే స్వయంగా యునీక్ ఐడీ ద్వారా పేషెంట్ రికార్డులను చూడగలుగుతాడు.


ఆధార్ కార్డు తరహాలో...

ఆధార్ కార్డు తరహాలోనే హెల్త్ కార్డ్ కూడా రూపొందించనున్నారు. అయితే, హెల్త్ కార్డ్ తప్పనిసరి కాదు. లబ్దిదారులు కావాలో వద్దో ఎంచుకోవచ్చు. ప్రజల వ్యక్తగత సమాచారాన్ని పూర్తి భద్రంగా (గోప్యంగా) ఉంచేందుకు చర్చలు తీసుకోనున్నారు. దేశ ఆరోగ్య ముఖచిత్రంలో మార్పు తీసుకురావాలన్నదే ఈ స్కీమ్ ప్రధానోద్దేశం.


విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, 'వన్ నేషన్ వన్ హెల్త్ కార్డ్' స్కీమ్‌ పరిధిని క్రమంగా ఆసుపత్రులు, క్లినిక్‌లు మాత్రమే కాకుండా మెడికల్ స్టోర్‌లు, మెడికల్ ఇన్సూరెన్స్ కంపెనీలకు విస్తరించే అవకాశం ఉంది. సర్వెర్‌ ద్వారా వీటిని స్కీమ్‌కు అనుసంధానం చేస్తారు. వ్యక్తిగత గోప్యతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వనున్నారు. వ్యక్తులు లేదా పేషెంట్లు అనుమతితోనే వైద్యులు కానీ, ఆసుపత్రులు కానీ ఆ వ్యక్తి రికార్డులను పరిశీలించాల్సి ఉంటుంది.

Updated Date - 2020-08-15T00:58:34+05:30 IST