నిబంధనలు సడలించామని ఆదమరువొద్దు : మోదీ

ABN , First Publish Date - 2020-05-31T18:30:54+05:30 IST

కరోనా, లాక్‌డౌన్ కారణంగా దేశంలోని ప్రజలు ఒకరినొకరు ఆదుకుంటూ ఆదర్శంగా నిలిచారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు.

నిబంధనలు సడలించామని ఆదమరువొద్దు : మోదీ

న్యూఢిల్లీ : కరోనా, లాక్‌డౌన్ కారణంగా దేశంలోని ప్రజలు ఒకరినొకరు ఆదుకుంటూ ఆదర్శంగా నిలిచారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. వలస కార్మికుల విషయంలో ప్రతి ఒక్కరూ ప్రతిస్పందించి, ఎవరికి తోచిన రీతిలో వారు సహాయం చేశారని, వారి పట్ల మరింత ఉదారతతో వ్యవహరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కోవిడ్‌తో ప్రభావితం కాని సమాజమంటూ లేదని, అయితే పేదలు, వలస కూలీలు ఎక్కువగా నష్టపోయారని మోదీ ఆదివారం నిర్వహించిన ‘మన్‌కీ బాత్’ లో పేర్కొన్నారు.


‘‘వలస కార్మికుల కష్టాలు మాటల్లో చెప్పలేనివి’’ అని పేర్కొన్నారు. లాక్‌డౌన్ సమయంలో రైల్వే శాఖ చాలా అద్భుతంగా సేవలందించిందని ఆయన ప్రశంసించారు. పగలు, రాత్రీ కష్టపడ్డారని, అటు కేంద్రం, ఇటు రాష్ట్రం,స్థానిక సంస్థలూ అందరూ కలిసి అహోరాత్రాలు శ్రమించి సేవలు చేశారన్నారు. కరోనా మహమ్మారితో పోరాడటంలో రైల్వే శాఖ ముందు వరుసలో నిలుస్తుందని కొనియాడారు. లాక్‌డౌన్ నిబంధనలను సడలించామని పౌరులు పాటించాల్సిన నియమాలను పాటించడంలో అలసత్వం వహించకూడదని మోదీ విజ్ఞప్తి చేశారు.


‘‘ఇప్పటి నుంచి కోవిడ్ నిబంధనలను మరింత కచ్చితంగా పాటించాలి. కరోనాపై పోరులో మరింత జాగరూకతతో ప్రవర్తిద్దాం. సామాజిక దూరంతో పాటు మరిన్ని నియమాలనూ యథావిథిగానే అనుసరించాలి. అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ... ఇతర దేశాలతో పోలిస్తే కాస్త మెరుగ్గానే ఉన్నాం’’ అని పేర్కొన్నారు.


‘ఆయుష్మాన్ భారత్’ తో ఇప్పటి వరకూ కోటి మంది ప్రజలు లబ్ధి పొందారని, పక్క రాష్ట్రాల్లో కూడా ఉచితంగా వైద్య సదుపాయం పొందవచ్చన్నారు. ఆంఫన్ తుఫాను కారణంగా ఒడిశా, బెంగాల్ రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోయాయని, అయినా సరే... ఆ రాష్ట్రాల ప్రజలు చూపించిన తెగువ, ధైర్యం అత్యంత సాహసోపేతమైందని మోదీ  కొనియాడారు. 

Updated Date - 2020-05-31T18:30:54+05:30 IST