Coal Crisisపై సమీక్షించనున్న ప్రధానమంత్రి మోదీ

ABN , First Publish Date - 2021-10-12T17:36:00+05:30 IST

దేశంలో బొగ్గు కొరత కారణంగా విద్యుత్ సంక్షోభం ముంచుకొస్తోందంటూ పలు రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో

Coal Crisisపై సమీక్షించనున్న ప్రధానమంత్రి మోదీ

న్యూఢిల్లీ: దేశంలో బొగ్గు కొరత కారణంగా విద్యుత్ సంక్షోభం ముంచుకొస్తోందంటూ పలు రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో పరిస్థితిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారంనాడు సమీక్షించే అవకాశం ఉంది. బొగ్గు సరఫరా పరిస్థితిపై విద్యుత్, బొగ్గు మంత్రిత్వ శాఖల కార్యదర్శులతో ప్రధాని సమావేశం కానున్నారని పీఎంఓ వర్గాలు తెలిపాయి. హోం మంత్రి అమిత్‌షా ఇప్పుటికే బొగ్గు, విద్యుత్ శాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో సోమవారంనాడు సమీక్షా సమావేశం నిర్వహించారు. బొగ్గు నిల్వలు, విద్యుత్ డిమాండ్, సరఫరా వంటి అంశాలను సమీక్షించారు.


ఢిల్లీ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, బీహార్, తమిళనాడు, రాజస్థాన్, కేరళ వంటి రాష్ట్రాలు ఇ్పపటికే బొగ్గు కొరతపై ఆందోళన వ్యక్తం చేశాయి. అయితే కేంద్రం అలాంటిదేమీ లేదని, పవర్ ప్లాంట్ల డిమాండ్‌కు తగినన్ని బొగ్గు నిల్వలు ఉన్నాయని చెబుతోంది. ఇవన్నీ అనవసర భయాందోళనలేనని, తగినంత విద్యుత్ అందుబాటులో ఉందని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్‌కే సింగ్ తెలిపారు.


నితీష్ సైతం..

కాగా, సమస్య ఉందనేది నిజమని బీజేపీ భాగస్వామ్య పార్టీ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సైతం తాజా సంక్షోభంపై వ్యాఖ్యానించారు. విద్యుత్ అవసరాల కోసం ఎన్‌టీపీసీని లేదా ప్రైవేటు కంపెనీలను ఆశ్రయిస్తుంటామని, అయితే ఇప్పుడు సరఫరాపై ప్రభావం ఉందని, కారణాలు ఏవైనప్పటికీ సమస్య అనేది నిజమేనని ఆయన అన్నారు. బీహార్‌లోనే కాకుండా ప్రతిచోట ఈ సమస్య ఉందన్నారు.

Updated Date - 2021-10-12T17:36:00+05:30 IST