దేవాస్ తప్పించుకోకుండా ప్రభుత్వం పోరాడుతోంది : నిర్మల సీతారామన్

ABN , First Publish Date - 2022-01-18T23:44:38+05:30 IST

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)కు చెందిన ఆంట్రిక్స్ కార్పొరేషన్‌, దేవాస్

దేవాస్ తప్పించుకోకుండా ప్రభుత్వం పోరాడుతోంది : నిర్మల సీతారామన్

న్యూఢిల్లీ : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)కు చెందిన ఆంట్రిక్స్ కార్పొరేషన్‌, దేవాస్ మల్టీమీడియా ప్రైవేట్ లిమిటెడ్ మధ్య 2005లో జరిగిన ఒప్పందం మోసపూరితమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ చెప్పారు. యూపీఏ ప్రభుత్వం ఈ కేసులో ఆర్బిట్రేటర్‌ను నియమించలేదన్నారు. దేవాస్ కంపెనీని వైండింగ్ అప్ చేయాలని (మూసేయాలని) నేషనల్ కంపెనీ లా అపిలేట్ ట్రైబ్యునల్ (NCLAT) ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించిందని, సమగ్రమైన ఆదేశాలను జారీ చేసిందని తెలిపారు. 


కాంగ్రెస్ నేత‌ృత్వంలోని యూపీఏ ప్రభుత్వం తప్పుడు పనులకు ఏ విధంగా పాల్పడిందో సుప్రీంకోర్టు ఆర్డర్ స్పష్టం చేస్తోందన్నారు. ఆంట్రిక్స్-దేవాస్ ఒప్పందం దేశ భద్రతకు వ్యతిరేకమని చెప్పారు. భారత దేశ ప్రజలకు ఏ విధంగా మోసం జరిగిందో కాంగ్రెస్ చెప్పాలన్నారు. దేశ భద్రతా ప్రయోజనాలకు ఉపయోగించే S-బ్యాండ్ స్పెక్ట్రమ్‌‌ను ఆంట్రిక్స్-దేవాస్ ఒప్పందం కోసం కేటాయించడానికి యూపీఏ ప్రభుత్వం తన అధికారాన్ని దుర్వినియోగపరిచిందని ఆరోపించారు. ఆంట్రిక్స్ ఒప్పందం ద్వారా జరిగిన మోసం నుంచి దేవాస్ కంపెనీ తప్పించుకోకుండా చూడటం కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రతి న్యాయస్థానంలోనూ పోరాడుతోందని చెప్పారు. పన్ను చెల్లింపుదారుల సొమ్మును కాపాడటం కోసం తాము పోరాడుతున్నామన్నారు. తాము పోరాడని పక్షంలో ఆంట్రిక్స్-దేవాస్ ఒప్పందం కోసం పెద్ద ఎత్తున సొమ్ము చెల్లించవలసి వచ్చి ఉండేదన్నారు. 


రెండు ఉపగ్రహాలపై స్పేస్ సెగ్మెంట్ కెపాసిటీ లీజు కోసం ఈ ఒప్పందం కుదిరింది. అవినీతి జరిగినట్లు ఆరోపణలు రావడంతో 2011లో డాక్టర్ మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ఈ ఒప్పందాన్ని రద్దు చేసింది. దీంతో దేవాస్ ఇండియా-మారిషస్ బైలేటరల్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రొటెక్షన్ అగ్రిమెంట్‌ను ఉటంకిస్తూ దావా వేసింది. పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్, ఇంటర్నేషనల్ చాంబర్ ఆఫ్ కామర్స్‌లలో విజయాలు సాధించింది.  దేవాస్ కంపెనీకి 1.3 బిలియన్ డాలర్లు చెల్లించాలని ఇంటర్నేషనల్ చాంబర్ ఆఫ్ కామర్స్ 2015లో తీర్పు చెప్పింది. అదేవిధంగా పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఇచ్చిన తీర్పులో దేవాస్‌కు 111 మిలియన్ డాలర్లు, వడ్డీ, ఖర్చులు చెల్లించాలని భారత ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆంట్రిక్స్ కంపెనీ పూర్తిగా భారత ప్రభుత్వ యాజమాన్యంలో ఉంది. దేవాస్‌ను వైండింగ్ అప్ చేయాలని గత ఏడాది జనవరిలో ఆంట్రిక్స్ పిటిషన్ దాఖలు చేసింది. 


Updated Date - 2022-01-18T23:44:38+05:30 IST