కోవిడ్ కట్టడిలో కేజ్రీవాల్ ప్రభుత్వంపై మోదీ ప్రశంసలు

ABN , First Publish Date - 2020-07-11T23:09:13+05:30 IST

ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ప్రధాన మంత్రి

కోవిడ్ కట్టడిలో కేజ్రీవాల్ ప్రభుత్వంపై మోదీ ప్రశంసలు

న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశంసలు అందుకున్నారు. దేశ రాజధాని నగరం ఢిల్లీలో కోవిడ్-19ను కట్టడి చేయడంలో కేజ్రీవాల్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, స్థానిక అధికారుల కృషిని మోదీ ప్రశంసించారు. మిగిలిన రాష్ట్రాలు కూడా ఈ పద్ధతులను అనుసరించాలని మోదీ సూచించారు. 


ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ) శనివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం, దేశంలో కోవిడ్-19 మహమ్మారి ప్రస్తుత పరిస్థితిపై మోదీ సమీక్షించారు. ఈ సందర్భంగా ఈ వ్యాధిని కట్టడి చేయడంలో కేంద్ర ప్రభుత్వం, కేజ్రీవాల్ ప్రభుత్వం, స్థానిక అధికారుల కృషిని ప్రశంసించారు. 


వ్యక్తిగత శుభ్రత, బహిరంగ ప్రదేశాల్లో క్రమశిక్షణ పాటిస్తే కోవిడ్-19ను అరికట్టడం సులువవుతుందని మోదీ తెలిపారు. కోవిడ్-19 మహమ్మారిపైనా, ప్రజలు పాటించవలసిన నియమాలపైనా విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. ఈ విషయంలో ఎటువంటి ఉదాసీనతకు ఆస్కారం ఉండకూడదని చెప్పారు. 


కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం, మన దేశంలో కోవిడ్-19 కేసుల సంఖ్య 8 లక్షలు దాటింది. కొత్తగా 27,114 కేసులు నమోదు కాగా, 519 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 8,20,916 కాగా, 22,123 మంది మరణించారు. 5,15,386 మంది ఈ వ్యాధి నుంచి కోలుకున్నారు. ప్రపంచంలో కోవిడ్-19 కేసులు అత్యధికంగా నమోదవుతున్న మొదటి మూడు దేశాలు : అమెరికా, బ్రెజిల్, భారత దేశం. 


Updated Date - 2020-07-11T23:09:13+05:30 IST