నవ భారత నిర్మాణానికి మోదీ కొత్త టీమ్

ABN , First Publish Date - 2021-07-13T06:52:02+05:30 IST

‘వాజపేయి గారూ, మీరు నాకు హోదా తగ్గించారు..’ అని వెంకయ్యనాయుడు 2000లో వాజపేయి తనను కేంద్ర కేబినెట్ మంత్రిగా నియమించినప్పుడు అన్నారు....

నవ భారత నిర్మాణానికి మోదీ కొత్త టీమ్

‘వాజపేయి గారూ, మీరు నాకు హోదా తగ్గించారు..’ అని వెంకయ్యనాయుడు 2000లో వాజపేయి తనను కేంద్ర కేబినెట్ మంత్రిగా నియమించినప్పుడు అన్నారు. వాజపేయి ఒక్క క్షణం ఆశ్చర్యపోయి. ‘ఎందుకలా అనుకుంటున్నారు’ అని ప్రశ్నించారు. ‘ఇప్పటి వరకు నేను పార్టీలో మహామంత్రి (బిజెపిలో ప్రధాన కార్యదర్శి పదవిని మహామంత్రి అంటారు)గా ఉన్నాను. ఇప్పుడు మామూలు మంత్రినే అయ్యాను..’ అని వెంకయ్య అనడంతో వాజపేయి ఆహ్లాదంగా నవ్వారు. సైద్ధాంతిక భూమికే ప్రధానంగా నిర్మితమైన భారతీయ జనతాపార్టీలో నియామకాలు ఎలా జరుగుతాయో అనడానికి వెంకయ్య రాజకీయ జీవితమే నిదర్శనం. ఒకప్పుడు వాజపేయి, ఆడ్వాణీ పోస్టర్లు అంటించి నెల్లూరు అంతటా మైకు పట్టుకుని ప్రచారం చేసిన వెంకయ్య అంచెలంచెలుగా పైకి ఎదిగి సైద్ధాంతిక విధేయత, కష్టపడే మనస్తత్వం, వక్త్తృత్వ ప్రతిభ ఆధారంగా ఉన్నతస్థాయికి చేరుకున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి నుంచి కేంద్ర కేబినెట్ మంత్రి అయిన వెంకయ్య రెండేళ్ల తర్వాత బిజెపి జాతీయ అధ్యక్షుడు అయ్యారు. జాతీయ అధ్యక్ష పదవి నిర్వహించిన వెంకయ్య మళ్లీ ఆడ్వాణీ పార్టీ అధ్యక్ష పదవి చేపట్టగానే ఆయన ఆధ్వర్యంలో ఉపాధ్యక్షుడుగా బాధ్యతలు నిర్వర్తించారు. మోదీ సర్కార్‌లో పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాలు, సమాచార ప్రసార శాఖల్ని నిర్వహించారు. గ్రామీణ నేపథ్యం, ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన నాయకుడిని ఉపరాష్ట్రపతిగా ఎన్నుకోవాలని పార్టీ నిర్ణయించడంతో వెంకయ్య రాజ్యాంగపరమైన బాధ్యతలు స్వీకరించారు. అరుణ్ జైట్లీ కూడా అంతే. 1999లో బిజెపి అధికార ప్రతినిధిగా ఉన్న అరుణ్ జైట్లీ, వాజపేయి మంత్రివర్గంలో సమాచార ప్రసార శాఖ, పెట్టుబడుల ఉపసంహరణ శాఖ, ఆ తర్వాత న్యాయశాఖ, కంపెనీ వ్యవహారాలు, షిప్పింగ్ శాఖ నిర్వహించిన తర్వాత 2002లో మళ్లీ ఏడాది పాటు పార్టీ ప్రధాన కార్యదర్శిగా, అధికార ప్రతినిధిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత వాజపేయి మళ్లీ ఆయనను పిలిచి కేంద్రమంత్రివర్గంలోకి తీసుకున్నారు. మోదీ తొలి మంత్రివర్గంలో ఆయన ఆర్థిక మంత్రిగా ఉన్నారు.


ఇటీవల ప్రధానమంత్రి నరేంద్రమోదీ కేంద్రమంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేసినప్పుడు సీనియర్ మంత్రులు రవిశంకర్ ప్రసాద్, ప్రకాశ్ జవదేకర్ లని తొలగించడం పట్ల మీడియాతో పాటు అనేకమంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే బిజెపి చరిత్ర కానీ, సంప్రదాయం కానీ తెలిసిన వారికి అది పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు. బిజెపిలో వ్యక్తులు ముఖ్యం కాదు. ఎప్పటికప్పుడు కొత్తవారికి అవకాశాలనివ్వాలని, క్రింది స్థాయి నుంచి వచ్చిన నాయకులకు స్థానం కల్పించాలని, ప్రతిభ, కష్టపడే తత్వం ఆధారంగా వారికి గుర్తింపునీయాలని బిజెపిలో నిరంతరం ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి. 


సీనియర్లను, రాష్ట్రాల్లో చాలా కాలం పనిచేసి పార్టీని నిర్మించిన వారిని కూడా బిజెపిలో మరిచిపోయే అవకాశం ఏ మాత్రం లేదు. రాజస్థాన్‌లో పార్టీని నిర్మించి బలోపేతం చేసిన మాజీ ముఖ్యమంత్రి బైరాన్ సింగ్ షెఖావత్‌ని వాజపేయి హయాంలో ఉపరాష్ట్రపతిగా ఎన్నుకున్నారు. కైలాష్‌పతి మిశ్రా, మదన్ లాల్ ఖురానా లాంటి వారిని గవర్నర్లుగా నియమించారు. మోదీ కూడా అదే మార్గాన్ని అవలంబించి పార్టీ అధ్యక్షులుగా పనిచేసిన వారిని, సీనియర్లను గవర్నర్ పదవుల్లో నియమించి వారు గతంలో చేసిన సేవలను గౌరవించారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, తెలంగాణ గవర్నర్ తమిళసై, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, గోవా గవర్నర్ శ్రీధరన్ పిళ్లై, హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ తదితరులంతా ఒకప్పుడు తమ తమ రాష్ట్రాల్లో బిజెపి అధ్యక్షులుగా ఉన్నవారే. తాజాగా మిజోరం గవర్నర్ అయిన హరిబాబు కూడా ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షుడుగా చాలాకాలం బాధ్యతలు నిర్వర్తించారు. అంతేకాక గతంలో అనుసరించిన సంప్రదాయం ప్రకారమే బిజెపిలో చాలాకాలం కీలక సేవలందించిన కల్యాణ్ సింగ్, కల్‌రాజ్ మిశ్రా, వఝుభాయి వాలా, భగత్‌సింగ్ కోషియారీ, ఆనందీ బెన్ పటేల్ తదితరులకు గవర్నర్ పదవులు దక్కాయి. ఇప్పుడు వారి బాటలో తావర్ చంద్ గెహ్లాట్ కూడా ఉన్నారు.


సీనియర్లను సముచిత రీతిలో గౌరవిస్తూనే కాలానుగుణంగా వచ్చిన మార్పులకు అనుగుణంగా కొత్త వారికి అవకాశం కల్పిస్తూనే, సామాజిక సమతుల్యాన్ని పాటిస్తూనే, భారతదేశాన్ని అత్యాధునికమైన, ఆభివృద్ది చెందిన దేశంగా ప్రపంచ దేశాల సరసన నిలబెట్టాలనే మోదీ లక్ష్యానికి అనుగుణంగానే ఈ కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగిందని చెప్పక తప్పదు. ఈ మంత్రివర్గాన్ని రూపొందించేందుకు మోదీ దాదాపు రెండు నెలలకు పైగా సమాలోచనలు జరిపారు. మంత్రుల పనితీరును శాస్త్రీయంగా సమీక్షించారు. ఒక్కొక్క మంత్రినీ పిలిచి మాట్లాడారు. ఎంపీలందర్నీ పిలిచి వారి శక్తి సామర్థ్యాలను అంచనావేసే ప్రయత్నం చేశారు. బిజెపి జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా, హోంమంత్రి అమిత్ షా, పార్టీ ప్రధాన కార్యదర్శులతో పాటు అనేకమంది పార్టీ నేతలతో చర్చించారు. భారతదేశ చరిత్రలో ఇంత ప్రజాస్వామికంగా, ఇంత శాస్త్రీయంగా మంత్రివర్గాన్ని రూపొందించిన దృష్టాంతాలు గతంలో చాలా తక్కువేనని చెప్పవచ్చు.


మోదీ పూర్తిగా వినూత్నమైన కేబినెట్‌ను నిర్మించారు. అదే సమయంలో మారుతున్న సమాజ అవసరాలు, యువత ఆకాంక్షలకు అనుగుణంగా ఆయన ప్రతిభకు పెద్ద పీట వేశారు. అలా అని పార్టీకి సేవ చేసిన వారిని, సీనియర్ లను ఆయన ఏ మాత్రం విస్మరించలేదు. ముఖ్యమంత్రులుగా పనిచేసిన అనుభవం ఉన్న నలుగురు ఇప్పుడు మోదీ కేబినెట్‌లో ఉన్నారు. ఒకప్పుడు యువమోర్చా అధ్యక్షులుగా ఉన్న కిషన్ రెడ్డి, అనురాగ్ ఠాకూర్‌లు కేంద్ర కేబినెట్‌లో స్థానం పొందుతారని ఎవరైనా ఊహించారా?


ఇప్పుడు మోదీ కేబినెట్‌లో 27 మంది ఓబీసీ మంత్రులు ఉంటే వారిలో అయిదుగురికి కేబినెట్ హోదా కల్పించారు. 12 మంది ఎస్‌సి వర్గానికి చెందిన మంత్రులు ఉంటే ఇద్దరికి కేబినెట్ హోదా ఇచ్చారు. 8 మంది ఎస్‌టి మంత్రులు ఉంటే వారిలో ముగ్గురికి కేబినెట్ హోదా లభించింది. సమాజంలో ఒకప్పుడు అస్పృశ్యులుగా ముద్రపడ్డ మాదిగ, చమార్, మహర్, అరుంధతియర్ వంటి అనేక నిమ్నకులాలు‍; గోండులు, సంతాల్‌లు, ముండాలు వంటి ఆదీవాసీ తెగలకు చెందిన వారు ఇవాళ మోదీ కేబినెట్‌లో కీలక స్థానంలో ఉన్నారు. గతంలో ఏ ప్రధానమంత్రీ నియమించని విధంగా 11 మంది మహిళలు కేంద్ర మంత్రిమండలిలో ఉండగా, వారిలో నలుగురు కేబినెట్ హోదాలో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కుళ్లు రాజకీయాలకు, సమాజంలో ఉన్న అవలక్షణాలకు, రెడ్ టేపిజంకు భిన్నంగా ప్రభుత్వాన్ని పనిచేయించాలన్నదే మోదీ ప్రధాన ఉద్దేశం. అలాంటి లక్ష్యాలను నిర్దేశించినందువల్లే ఇవాళ మోదీ ప్రభుత్వంలో లక్షల కోట్ల విలువైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు గడువుకు ముందే పూర్తవుతున్నాయి. ఇంకా వేగంగా పనిచేసే ఉద్దేశంతో మోదీ ఈ కొత్త కేబినెట్‌ను రూపొందించారన్న విషయం స్పష్టం అవుతోంది. నవభారత నిర్మాణానికి మోదీ కొత్త టీమ్ మరింత ఉత్తేజకరంగా తోడ్పడుతుందనడంలో సందేహం లేదు.


వై. సత్యకుమార్

బిజెపి జాతీయ కార్యదర్శి

Updated Date - 2021-07-13T06:52:02+05:30 IST