ప్రపంచంలో పేరొందిన నేతల్లో మోదీ ఒకరు

ABN , First Publish Date - 2022-07-01T06:04:54+05:30 IST

ప్రపంచంలో పేరొందిన నేతల్లో మోదీ ఒకరు

ప్రపంచంలో పేరొందిన నేతల్లో మోదీ ఒకరు
కీసరలో మీడియాతో మాట్లాడుతున్న అల్కాసింగ్‌ గుర్జర్‌, పాల్గొన్న బీజేపీ నాయకులు

  • బీజేపీ జాతీయ కార్యదర్శి అల్కాసింగ్‌ గుర్జర్‌ 

మేడ్చల్‌, జూన్‌ 30(ఆంధ్రజ్యోతి ప్రతినిధి)/కీసర: దేశంలోని ప్రజల సంక్షేమం, వారి యోగక్షేమాల కోసం ప్రధానమంత్రి నరేంద్రమోదీ కృషిచేస్తున్నారని, ఆయన సేవల వల్లే ప్రపంచ దేశాల్లో పేరెన్నికగన్న పది మంది నేతల్లో ఆయన ఒకరుగా నిలిచారని బీజేపీ జాతీయ కార్యదర్శి అల్కాసింగ్‌ గుర్జర్‌ అన్నారు. గురువారం కీసరలో నిర్వహించిన మేడ్చల్‌ నియోజకవర్గ బీజేపీ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమావేశానంతరం మీడియాతో మాట్లాడారు. మోదీ పాలనతో పేదలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు. భారత్‌ ప్రపంచ దేశాల్లో పెద్దదేశంగా ఎదుగుతోందన్నారు. తెలంగాణలో ముఖ్యమంత్రి పనితీరు బాగాలేదని, కేసీఆర్‌ను ప్రజలు విశ్వసించడంలేదన్నారు. దేశంలో బీజేపీ బలమైనశక్తిగా ఎదిగిందన్నారు. నెల 2, 3 తేదీల్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు, బహిరంగ సభలకు ప్రధాని మోదీ, పార్టీ పదాధికారులంతా హాజరువుతున్నారన్నారు. పార్టీ పనితీరును మెరుగుపర్చేందుకు నియోజకవర్గం వారీగా వివిధ శాఖలకో పదాధికారిని నియమించామని తెలిపారు. తెలంగాణలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు చరిత్రాత్మకంగా నిలుస్తాయని పార్టీ మేడ్చల్‌ జిల్లా అధ్యక్షుడు పట్లోళ్ల విక్రమ్‌రెడ్డి అన్నారు. పరేడ్‌గ్రౌండ్‌ బహిరంగ సభకు 15వేల మంది వరకు తరలిస్తామన్నారు. నాయకులు నరేందర్‌, కొంపల్లి మోహన్‌రెడ్డి, బిక్కునాయక్‌, మోహన్‌రెడ్డి, తిరుమల్‌రెడ్డి పాల్గొన్నారు.


  • విజయ్‌ సంకల్ప సభను జయప్రదం చేయాలి

వికారాబాద్‌: జూలై 3న నరేంద్రమోదీ విజయ్‌ సంకల్ప సభకు వికారాబాద్‌ నుంచి పెద్ద సంఖ్యలో తరలివెళ్లాలని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి గురుప్రకాశ్‌ అన్నారు. వికారాబాద్‌లో మాజీ మంత్రి చంద్రశేఖర్‌ నివాసంలో బీజేపీ తెలంగాణ సంపర్క్‌ అభియాన్‌ను నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కుటుంబ పాలనకు చరమగీతం పాడి బీజేపీని అధికారంలోకి తేవాలన్నారు. కార్యక్రమంలో పాండుగౌడ్‌, శివరాజు, విద్యాసాగర్‌ రావు తదితరులు పాల్గొన్నారు.


  • టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటం

కొడంగల్‌: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటం ఆగదని కర్ణాటక మాజీ ఉపముఖ్యమంత్రి లక్ష్మణ్‌ సవాడి అన్నారు. కొడంగల్‌లోని శంకర్‌లింగ్‌ కాంప్లెక్స్‌లో నిర్వహించిన నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో పార్టీ బలోపేతానికే జాతీయ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. బహిరంగ సభకు నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తరలిరావాలన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ, సీఎం కేసీఆర్‌ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకే ప్రధానమంత్రి పర్యటన చేపట్టారన్నారు. బీజేపీ నాయకులు పూనంచంద్‌ లాహోటి, మదన్‌, వెంకటయ్య, బస్వరాజ్‌, బాబయ్యనాయుడు, నర్సింలు, సాయికుమార్‌, ముకుంద్‌, కె.చంద్రప్ప, మోహన్‌రావు, రవినాయక్‌, సాయిలు పాల్గొన్నారు.


  • తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలి

తాండూరు: 2023 ఎన్నిలకే లక్ష్యంగా బీజేపీ కార్యకర్తలు పనిచేసి పార్టీని అధికారంలోకి తేవాలని బీజేపీ తాండూరు నియోజకవర్గ ఇన్‌చార్జి పవన్‌శర్మ కోరారు. తాండూరులోని గ్రాండ్యూర్‌ హోటల్‌లో ముఖ్య కార్యకర్తలతో సమావేశమై దిశానిర్దేశం చేశారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేయాలని సూచించారు. సమావేశంలో బీజేపీ జిల్లా ప్రధానకార్యదర్శి యు.రమేష్‌, పట్టణ అధ్యక్షుడు సుదర్శన్‌గౌడ్‌, మహిళా మోర్చా అధ్యక్షురాలు సాహు శ్రీలత, కౌన్సిలర్లు లలిత, లావణ్య, భద్రేశ్వర్‌ పాల్గొన్నారు.


  • తెలంగాణలో కాషాయ జెండా ఎగరాల్సిందే

పరిగి: వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో కాషాయం జెండా ఎగరాలని, దానికోసం పార్టీ శ్రేణులు సన్నద్ధం కావాలని బీజేపి జాతీయ కార్యదర్శి అనుపమ్‌ అజ్ర అన్నారు. పరిగిలోని స్వాగత్‌ హోటల్‌లో నియోజకవర్గస్థాయి బీజేపి బూత్‌స్థాయి కన్వీనర్లు, పార్టీ ప్రతినిధులతో జరిగిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. బూత్‌స్థాయి శక్తికేంద్రాల ద్వారా బీజేపీ పథకాలను ఇంటింటికీ తీసుకెళ్లాలని సూచించారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సదానందరెడ్డి, ప్రహ్లాద్‌రావు, పెంటయ్య పాల్గొన్నారు.

Updated Date - 2022-07-01T06:04:54+05:30 IST