మోదీకి వ్యవసాయంపై పట్టింపు లేదు..

ABN , First Publish Date - 2022-05-18T05:44:12+05:30 IST

ప్రధాని నరేంద్రమోదీకి అధికారంపై ఉన్న కాంక్ష వ్యవసాయంపై లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఎస్‌.నిరంజన్‌రెడ్డి ఆరోపించారు.

మోదీకి వ్యవసాయంపై పట్టింపు లేదు..
సన్నాహక సమావేశంలో మట్లాడుతున్న మంత్రి నిరంజన్‌ రెడ్డి

పంటల సాగుపై రైతులకు అవగాహన కలిగించాలి
రైతు వేదికల్లో శిక్షణా శిబిరాలు నిర్వహించాలి..
వ్యవసాయ శాఖ మంత్రి ఎస్‌.నిరంజన్‌రెడ్డి
హనుమకొండ, జనగామ, ములుగు జిల్లాల సాగు సన్నాహక సమావేశం


హనుమకొండ టౌన్‌, మే 17: ప్రధాని నరేంద్రమోదీకి అధికారంపై ఉన్న కాంక్ష వ్యవసాయంపై లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఎస్‌.నిరంజన్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం హనుమకొండ చింతగట్టు క్యాంపు సమీపంలోని కేఎల్‌ఎన్‌ ఫంక్షన్‌హాల్‌లో హనుమకొండ, జనగామ, ములుగు జిల్లాల వ్యవసాయశాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతుబంధు సమితి కోఆర్డినేటర్లతో ‘వానాకాలం 2022 - సాగుకు సన్నాహక సమావేశం’ జరిగింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ అధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఎస్‌.నిరంజన్‌రెడ్డి హాజరై ప్రసగించారు.

వ్యవసాయం ఆగిపోతే ప్రపంచం అంతరిస్తుందని, వ్యవసాయం బాగుండాలి.. అన్నదాతలను గౌరవించాలన్నారు. లోకాన్ని బతికించడానికి చేసే వృత్తి వ్యవసాయం అన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగం బలపడిందన్నారు. వలసలు తగ్గాయని ఆయన తెలిపారు. సాగునీరు అందుబాటులోకి తీసుకువచ్చి సాగుకు అనుకూలమైన భూమిని సేద్యంలోకి తీసుకువచ్చినట్లు ఆయన తెలిపారు. దేశంలో ఎక్కడాలేని విధంగా రైతుబీమా, రైతుబంధు లాంటి కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు వివరించారు.  రాష్ట్రంలో 1కోటి 50లక్షల ఎకరాల వ్యవసాయ భూమి ఉంటే 1కోటి 40లక్షల ఎకరాలు సాగులో ఉందన్నారు. త్వరలో 1కోటి 25లక్షల ఎకరాలకు కృష్ణ, గోదావరి నీళ్లు అందుతాయని మంత్రి పేర్కొన్నారు.

వానాకాలంలో, యాసంగిలో ఏ పంటలు పండించాలనే విషయంపై రైతులకు అవగాహన ఉండాలన్నారు. పంటల సాగుపై రైతులకు వ్యవసాయ అధికారులు అవగాహన కలిగించాలని, రైతు వేదికల్లో శిక్షణా శిబిరాలు నిర్వహించాలని మంత్రి నిరంజన్‌రెడ్డి సూచించారు. పెట్టుబడి తగించే విధంగా, దిగుబడి పెరిగే విధానంపై, సాగు ఇబ్బందులు అధిగమించడంపై, రాబడిపై రైతులకు ప్రధానంగా అధికారులు, రైతు సమితి కోఆర్డినేటర్లు రైతులకు అవగాహన కలిగించాలని ఆయన తెలిపారు. వ్యవసాయ రంగంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిన ముఖ్యమత్రి కేసీఆర్‌.. పకడ్బందీ ప్రణాళికతో ముందుకు వెళుతున్నారని ఆయన తెలిపారు. వ్యవసాయ రంగానికి, ప్రాజెక్టుల నిర్మాణాలకు కేంద్రం ఎలాంటి సహాయం అందించడం లేదని మంత్రి నిరంజన్‌రెడ్డి విమర్శించారు.

రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ.. కేవలం వరి పంటనే కాకుండా ప్రత్యామ్నాయ పంటలు, లాభదాయకమైన పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలన్నారు. ప్రత్యామ్నాయ పంటల సాగుపై అధికారులు రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఏడు దశాబ్దాలు కేంద్రంలో అధికారంలో ఉన్న పాలకులు వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేశారని ఆయన ఆరోపించారు. ఆయిల్‌పామ్‌ పంటను ప్రోత్సహించాలన్నారు. తక్కువ పెట్టుబడితో ఆయిల్‌పామ్‌ పంటకు ఎక్కువ లాభం వస్తుందన్నారు. తాను 25 ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ పంటను సాగు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ మాట్లాడుతూ.. గత పాలకులు వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేశారని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఒక రైతుగా వ్యవసాయాన్ని పండగ చేశారని కొనియాడారు.  

రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. వ్యవసాయరంగం నిండుగా ఉండాలనే లక్ష్యంతో 2,604 క్లస్టర్లలో అధికారులను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసిందన్నారు. రైతు వేదికల్లో రైతు సమితి కోఆర్డినేటర్లు, వ్యవసాయ శాఖ అధికారులు రోజూ అందుబాటులో ఉండి, పంటల సాగుపై రైతులకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. రైతు వేదికల నిర్వహణకు ఏప్రిల్‌ నుంచి ప్రతీ నెల రూ.9వేలు ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. పీఏసీఎస్‌ చైర్మన్‌లకు, రైతు సమితి కోఆర్డినేటర్లకు ప్రొటోకాల్‌తో పాటు గౌరవ వేతనం విషయమై చర్చించామని, త్వరలోనే శుభవార్త వింటారని ఆయన పేర్కొన్నారు.

ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ కమిషనర్‌ రఘునందన్‌రావు, హనుమకొండ, జనగామ, ములుగు జిల్లాల కలెక్టర్లు రాజీవ్‌గాంధీ హనుమంతు, శివలింగయ్య, కృష్ణఆదిత్య, ఎమ్మెల్యేలు అరూరి రమేశ్‌, రాజయ్య, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, పెద్ది సుదర్శన్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్‌ మార్నేని రవీందర్‌రావు, జడ్పీ చైర్మన్‌లు సుధీర్‌కుమార్‌, సంపత్‌రెడ్డి, జగదీష్‌, రైతుబంధు సమితి జిల్లా కోఆర్డినేటర్‌ ఎల్లావుల లలితాయాదవ్‌ తదితరులు పాల్గొన్నారు. కాగా, అన్నదాతలను గౌరవిస్తూ ఒక నిమిషం పాటు సభలో ఉన్నవారితో చప్పట్లు కొట్టించారు.



Updated Date - 2022-05-18T05:44:12+05:30 IST