మహోన్నత కార్యదక్షుడు మోదీ

ABN , First Publish Date - 2020-09-17T06:45:20+05:30 IST

భారతదేశ రాజకీయ నడవాలలోకి ఆయన మూడు దశాబ్దాల క్రితం వచ్చారు. పదవీ లాలసతో కాదు, ప్రజాప్రశంసలను ఆశించి కూడా కాదు, జాతి నిర్మాణ లక్ష్యంతో ఆయన...

మహోన్నత కార్యదక్షుడు మోదీ

తన పనిలోనే, తన విధ్యుక్త ధర్మనిర్వహణలోనే భగవంతుడిని దర్శించే కృషీ వలుడు నరేంద్ర మోదీ. ఏ ప్రయత్నమూ ఎంతమాత్రమూ కొట్టివేయదగినది కాదని ఆయన విశ్వసిస్తారు. ఏ సంస్థాగత లక్ష్యమూ అల్పమైనదని ఆయన భావించనే భావించరు. మోదీ దృష్టి సదా కర్తవ్య పాలనపైనే ఉంటుంది. అవును, నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు కృతనిశ్చయంతో పూనుకోవడమే ఆయన పరిపాలనా ప్రస్థానంలో ఒక స్వతస్సిద్ధ భాగంగా ఉంటూ వస్తోంది.


భారతదేశ రాజకీయ నడవాలలోకి ఆయన మూడు దశాబ్దాల క్రితం వచ్చారు. పదవీ లాలసతో కాదు, ప్రజాప్రశంసలను ఆశించి కూడా కాదు, జాతి నిర్మాణ లక్ష్యంతో ఆయన రాజకీయ రంగప్రవేశం చేశారు. అవును, శక్తిమంతమైన నవ భారతదేశాన్ని నిర్మించడమే ఆయన ధ్యేయం. సహచర భారతీయుల జీవితాలు సుఖసంతోషాలతో వర్ధిల్లాలనే తన స్వప్నాలను సాకారం చేసుకునేందుకు ఉత్తమ మార్గం దేశ రాజకీయ చిత్రాన్ని సంపూర్ణంగా మార్చివేయడమేనని ఆయన భావించారు. ఇందుకు ఆయన తన దారిలో సంభవించిన ప్రతి సంఘటనను ఒక అవకాశంగా మలుచుకున్నారు. ప్రతి ఎన్నికలలోనూ విజయం సాధించారు. ఒక పురపాలక సంఘం ఎన్నికలలో తిరుగులేని విజయం సాధించేందుకు ఎంత తదేక దీక్షతో ప్రయత్నించారో, చరిత్రాత్మక పర్యవసానాలను ఖాయంగా సంభవింపచేసేందుకు తమ రాజకీయ పార్టీ ప్రారంభించిన దేశవ్యాప్త ‘యాత్ర’ను జయప్రదం చేసేందుకూ ఆయన అంతే అకుంఠిత దీక్షతో పని చేశారు. అయితే ఆయన కృషిని గుర్తించినవారు ఎంతోమంది లేరు. సహచరులు తన కృషి పట్ల సంపూర్ణ విశ్వాసం ఉంచనంతమాత్రాన నరేంద్ర మోదీ నిరుత్సాహ పడతారా? పడరు. ఎందుకంటే తన పనిలోనే, తన విధ్యుక్త ధర్మనిర్వహణలోనే భగవంతుడిని దర్శించే కృషీవలుడు ఆయన. ఏ ప్రయత్నమూ ఎంతమాత్రమూ కొట్టివేయదగినది కాదని ఆయన విశ్వసిస్తారు. ఏ సంస్థాగత లక్ష్యమూ అల్పమైనదని ఆయన భావించనే భావించరు. మోదీ దృష్టి సదా కర్తవ్యపాలన పైనే ఉంటుంది. అవును, నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు కృతనిశ్చయంతో పూనుకోవడమే ఆయన పరిపాలనా ప్రస్థానంలో ఒక స్వతస్సిద్ధ భాగంగా ఉంటూ వస్తోంది. 


నరేంద్ర మోదీ 18 సంవత్సరాల 11 నెలల క్రితం తొట్టతొలుత అధికారానికి వచ్చారు. గుజరాత్ ఒక భయానకమైన భూప్రళయంలో అతలాకుతలమైపోయిన నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవీబాధ్యతలను మోదీకి అప్పగించారు. అతి స్వల్పకాలంలోనే గుజరాత్ ఆ భూకంప శిథిలాల నుంచి ఒక మహాశక్తిమంతమైన రాష్ట్రంగా పునర్జన్మించింది. మోదీ మహోన్నత కార్యదక్షతతోనే ఈ మహత్కార్యం సుసాధ్యమయింది. కాంగ్రెస్ పార్టీ ఆయన్ని సంవత్సరాల తరబడి తీవ్రమైన దూషణలకు గురి చేసింది. తీవ్ర విమర్శల జడివానతో మీడియా ఆయన్ని వెంటాడింది. అయినప్పటికీ ముఖ్యమంత్రిగా మోదీ మన ప్రజాస్వామ్య పునాదులను పటిష్ఠం చేశారు. ‘ప్రజల కొరకు, ప్రజల చేత, ప్రజల యొక్క పాలన’ను అందించడంలో ఆయన ద్విగుణీకృత ఫలితాలను సాధించారు. సుపరిపాలనకు మంచి నిదర్శనంగా గుజరాత్ పేరు పొందడంలో మోదీని అనుసరించిన, ఆయన నాయకత్వాన్ని విశ్వసించిన ఆ రాష్ట్ర ప్రజల పాత్ర ప్రశస్తమైనది. గుణోత్సవ్ కార్యక్రమం విద్యాపరంగా ప్రభుత్వ పాఠశాలల జవాబుదారీతనానికి పునాదులు వేసింది. శాలా ప్రవేశ్ ఉత్సవ్ ఒక అద్వితీయ ప్రయత్నం. తల్లిదండ్రులు తమ బిడ్డలను ముఖ్యంగా కుమార్తెలను ఆనందోత్సాహాలతో బడిలో చేర్పించేందుకు ముందుకు వచ్చేలా చేసిన కార్యక్రమమది. విద్యారంగంలో నరేంద్ర మోదీ విశిష్ట కృషి ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆమోదించిన నూతన విద్యావిధానం ఒక సరికొత్త విద్యాభారత్‌ను నిర్మించడంలో మోదీ అపూర్వ ప్రయత్నాల కొనసాగింపేనని నిశ్చితంగా చెప్పక తప్పదు. ఆ కొత్త విద్యా విధానం దేశంలోనే కాదు, ప్రపంచ విద్యావేత్తల ప్రశంసలనూ పొందుతోంది. నిష్క్రియాపరంగా ఉన్న విద్యా విధానాన్ని నరేంద్రమోదీ సంస్కరించారు. ఆయన దృష్టి పడేంత వరకు ఆ పాత విద్యావిధానం కొనసాగుతుండడం ఒక ఆశ్చర్యకరమైన విషయం. వేగవంతంగా పురోగమిస్తున్న పలు దేశాల విద్యా వ్యవస్థలలో ఒక అనుపమాన చైతన్యశీల వాతావరణం నెలకొని ఉంది. అటువంటి ప్రగతిశీలత మన విద్యావ్యవస్థలో లోపించింది. ఈ లోపాన్ని సరిదిద్దుందుకే నరేంద్రమోదీ కొత్త విద్యావిధానాన్ని తీసుకువచ్చారు. 


ప్రజల అవసరాలు దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురవుతూ వస్తున్నాయి. వాటిని తీర్చడం ప్రభుత్వ బృహత్ బాధ్యత. ఈ బాధ్యతను సమర్థంగా నిర్వహించడంతో పాటు అంతర్జాతీయంగా భారత్‌కు సకల రంగాలలో ప్రశస్త స్థానాన్ని సాధించాల్సిన అవసరమూ బృహత్తరమైనదే. ఈ రెండు బాధ్యతలను ఒక సమన్వయ కృషితో నిర్వర్తించాల్సి ఉంది. ఈ వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకునే సామాజికన్యాయంతో కూడిన ఆర్థిక సంస్కరణలకు ప్రధాని మోదీ తొలి నుంచీ అగ్ర ప్రాధాన్యమిస్తూ వస్తున్నారు. ‘జీవన సౌలభ్యం’, ‘వ్యాపార సౌలభ్యం’ దృక్కోణాలు రెండిటి నుంచీ తమ ప్రభుత్వం చేపట్టే ప్రతి చర్యా ఉండేలా జాగ్రత్త వహించిన ఏకైక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాత్రమే. ఈ ఉదాత్త భావనతో పాలన చేస్తున్నందునే ఆయన ప్రభుత్వం దేశవ్యాప్తంగా 11 కోట్ల కుటుంబాలకు టాయ్‌లెట్స్‌ను సమకూర్చేందుకు సంకల్పించింది. అంతేకాదు, మహిళల రుతు సంబంధ ఆరోగ్య పరిరక్షణ విషయమై కూడా శ్రద్ధ చూపిన ప్రప్రథమ ప్రభుత్వంగా కూడా మోదీ సర్కార్ చరిత్ర కెక్కనుంది. దేశ ప్రజల నైపుణ్యాలను ఇతోధికంగా మెరుగుపరిచేందుకు ఒక ప్రత్యేక మంత్రిత్వశాఖను ఆయన ఏర్పాటు చేశారు. ముద్రా యోజనను ప్రారంభించి కోట్లాది ప్రజలకు సలభతర రుణ సదుపాయాన్ని కల్పించారు. పేద ప్రజలకు సంపూర్ణ ఆరోగ్యభద్రత కల్పించాలన్న ఆయన సదాశయం ఆయుష్మాన్ భారత్ యోజనగా రూపు దిద్దుకుంది. దేశ వ్యాప్తంగా పదికోట్ల కుటుంబాలకు ఆరోగ్యబీమా సదుపాయం ప్రప్రథమంగా కల్పించిన కార్యక్రమమిది. అలాగే ఆసేతు హిమాచలం 6000కు పైగా జన్ ఔష కేంద్రాల ద్వారా దేశ ప్రజలకు పలు ఔషధాలను అందుబాటులో ఉంచుతున్నారు. 


ఈ విశిష్ట కృషే మోదీ రాజకీయాల ప్రమాణ చిహ్నం. ఆయన తరచు అంటుంటారు: ‘మార్పు తీసుకువచ్చేందుకే ప్రజలు మనకు అధికారాన్ని ఇచ్చారు. మన ప్రయత్నాలు సదా మరింత బృహత్ స్థాయిలో ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే ప్రజలు మనపై పెట్టుకున్న నమ్మకానికి న్యాయం చేయగలం’. ఇటువంటి అభినివేశంతో కృషి చేయడం ద్వారానే గత ఆరు సంవత్సరాలుగా ప్రతి నెలలోనూ భారత్ స్థితిగతుల్లో బృహత్ మార్పు సాధ్యమవడానికి మోదీ దోహదం చేశారు. పేదవారైన తోటి భారతీయుల కోసం ప్రభుత్వం నుంచి పొందుతున్న కొన్ని సదుపాయాలను వదులుకోవాలని ఆయన చేసిన విజ్ఞప్తికి కోటి మందికి పైగా దేశపౌరులు ప్రతిస్పందించారు. ఈ ఉదారత ఫలితంగానే ఉజ్వల యోజన ఫలించింది. ఎనిమిది కోట్ల మందికి పైగా పేద భారతీయులు లబ్ధి పొందారు. జన్‌ధన్ యోజన కింద 40 కోట్ల మంది పేద భారతీయలకు బ్యాంక్ ఖాతాల సదుపాయాన్ని ఆయన ప్రభుత్వం కల్పించింది. ఈ కార్యక్రమాల ద్వారా పరిపాలనా ప్రశస్తత ప్రమాణాలను నరేంద్రమోదీ పునర్నిర్వచించారు. 


జమ్మూ-కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే రాజ్యాంగ అధికరణ 370 రద్దు, అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ఎంతో హుందాగా శంకుస్థాపన చేయడమూ నరేంద్రమోదీ దృఢ సంకల్పానికి, కార్యదక్షతకు నిదర్శనాలని ఆయన బద్ధవ్యతిరేకులు సైతం అంగీకరిస్తున్నారు. ఒక వ్యక్తిగా, ఉదాత్త మనిషిగా నరేంద్రమోదీ గురించి ఎంతోమంది ఎంతగానో రాశారు. సామాన్య ప్రజల మాటా మంతీలో, జాతి హితం లక్ష్యంగా సాగే ప్రజాచర్చల్లో ఒక అంతర్భాగంగా ఆయన కొనసాగుతారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఎందుకని? సమాధానం స్పష్టమే. మీరే నరేంద్ర మోదీ అయితే అనేకానేక సంభాషణలకు కేంద్రంగా ఉండడమే కాదు, విప్పారుతున్న చరిత్రకు ఆధారంగా కూడా ఉంటారు. నరేంద్రమోదీ 70 వసంతాలను పూర్తి చేసుకుని 71‍‍వ వసంతంలోకి ప్రవేశించనున్నారు. ఆయన నేతృత్వంలో ఒక కొత్త, భవ్య భారతదేశం ఆవిర్భవిస్తుందని మీరు పూర్తి భరోసాతో ఉండవచ్చు. ఆ నవభారతం సహనశీలమూ, ప్రయోజనకరమూ, న్యాయబద్ధమూ, అన్ని విధాల ఉత్కృష్టమూ అయినదై ఉంటుందనడంలో సందేహం లేదు. ఈ మార్పును పరిపాలనాపరంగా సాధించగల ఏకైక నాయకుడు నరేంద్ర దామోదరదాస్ మోదీ. అనితరసాధ్యమైన ప్రగతి సాధకుడు ముమ్మాటికీ మోదీయే. 


స్మృతి ఇరానీ 

కేంద్ర జౌళిశాఖ మంత్రి

(నేడు నరేంద్ర మోదీ జన్మదినం)

Updated Date - 2020-09-17T06:45:20+05:30 IST