మోదీ ‘భగవంతుని అవతారం’ వ్యాఖ్యలపై బీజేపీ స్పందన

ABN , First Publish Date - 2021-10-27T22:12:06+05:30 IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని భగవంతుని

మోదీ ‘భగవంతుని అవతారం’ వ్యాఖ్యలపై బీజేపీ స్పందన

న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని భగవంతుని అవతారంగా ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర మంత్రి ఉపేంద్ర తివారీ వర్ణించడాన్ని రాజకీయ కోణంలో చూడవద్దని ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధికార ప్రతినిధి అనిల సింగ్ అన్నారు. వందలాది పథకాల ప్రయోజనం పొందిన ప్రజలు, మహిళల అభిప్రాయాన్ని ఉపేంద్ర వ్యక్తం చేశారని బుధవారం చెప్పారు. 


అనిల సింగ్ బుధవారం మాట్లాడుతూ, ఉపేంద్ర వ్యాఖ్యలను రాజకీయ దృక్కోణం నుంచి చూడకూడదని తన అభిప్రాయమని చెప్పారు. వంట గ్యాస్ కనెక్షన్లు, ఇళ్ళు, మరుగుదొడ్లు, బ్యాంకు ఖాతాలు, పిల్లలకు మంచి చదువులు వంటివాటికి సంబంధించిన వందలాది ప్రభుత్వ పథకాల లబ్ధిదారులైన ప్రజలు, మహిళలు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలను ఉపేంద్ర వెల్లడించినట్లు తాను భావిస్తున్నానని చెప్పారు. ఈ పథకాలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. కాబట్టి మోదీ అనే వ్యక్తి దేవునితో సమానమని తెలిపారు. ఎవరైనా తనకు మేలు చేస్తే, ఆ వ్యక్తి తనకు దేవునితో సమానమని చెప్పారు. కానీ దాని భావం ఆ వ్యక్తి దేవుడు అని కాదని వివరించారు. 


ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అయోధ్య సందర్శనపై అనిల సింగ్ మాట్లాడుతూ, ఉత్తర ప్రదేశ్‌లో త్వరలో శాసన సభ ఎన్నికలు జరగబోతున్నాయని, ఆమ్ ఆద్మీ పార్టీవారు తమను తాము ప్రముఖ హిందూ నేతలుగా ప్రచారం చేసుకోవాలని కోరుకుంటున్నారని అన్నారు. ఈ ఘనత అంతా బీజేపీదేనని చెప్పారు. బుజ్జగింపు రాజకీయాలు పని చేయబోవని ఇతర పార్టీలు గుర్తించాయన్నారు. అందరితో కలిసి, అందరి అభివృద్ధి, అందరి నమ్మకం... అనేదానిని బీజేపీ నమ్ముతుందన్నారు.


ఉత్తర ప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఉపేంద్ర తివారీ మంగళవారం హర్దోయిలో జరిగిన సభలో మాట్లాడుతూ, ప్రధాని మోదీని ప్రశంసల్లో ముంచెత్తారు. మోదీ ఓ సాధారణ వ్యక్తి కాదని, దేవుని అవతారమని చెప్పారు. 


Updated Date - 2021-10-27T22:12:06+05:30 IST