మోదీ గరళ కంఠుడు

ABN , First Publish Date - 2022-06-26T07:56:21+05:30 IST

శివుడు తన గొంతులో గరళాన్ని నింపుకొన్నట్లు మోదీ వేదనను అనుభవించారు.

మోదీ గరళ కంఠుడు

19 ఏళ్లపాటు ఆయన పడిన బాధను కళ్లారా చూశాను

కొందరు చేసిన విష ప్రచారం నుంచి ఆయన బయటపడ్డారు

గుజరాత్‌ అల్లర్ల కేసులో సుప్రీం కోర్టు తీర్పుపై అమిత్‌ షా

గొంతులో గరళాన్ని నింపుకొన్నట్లు ఆవేదన అనుభవించారు

బాధితులను తీస్తా సెతల్వాడ్‌ వంచించారు: అమిత్‌ షా


న్యూఢిల్లీ, జూన్‌ 25: ‘‘శివుడు తన గొంతులో గరళాన్ని నింపుకొన్నట్లు మోదీ వేదనను అనుభవించారు. 19 ఏళ్లపాటు ఆయన పడిన బాధను నేను దగ్గర నుంచి చూశాను’’ అని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా వ్యాఖ్యానించారు. గుజరాత్‌ అల్లర్ల కేసులో అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న మోదీకి వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలూ లేవంటూ సిట్‌ ఇచ్చిన క్లీన్‌చిట్‌ను సుప్రీం కోర్టు సమర్థించిన నేపథ్యంలో శనివారం ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమిత్‌ షా ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘గుజరాత్‌ అల్లర్లపై కొందరు విష ప్రచారం చేశారు. కావాలనే మోదీపై విమర్శలు చేశారు. కానీ, ఆ ఆరోపణల నుంచి మోదీ బయటపడ్డారు. ఆయనకు క్లీన్‌ చిట్‌ శుభ పరిణామం. సిట్‌ విచారణను మేం ప్రభావితం చేయలేదు. సుప్రీం కోర్టు పర్యవేక్షణలోనే దర్యాప్తు జరిగింది. గుజరాత్‌ మత అల్లర్ల వ్యవహారంలో విచారణకు హాజరైనప్పుడు ప్రధాని మోదీ నాటకాలు ఆడలేదు. సత్యం వెలికిరావాలని సుదీర్ఘకాలం ఎదురు చూశారు. సిట్‌ కోరినప్పుడు సీఎం హోదాలో వెళ్లి సహకరించారు’’ అన్నా రు. నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ విచారణకు హాజరవుతున్న తీరును తీవ్రంగా తప్పుబట్టారు. ఇందులో ఆందోళన చేయాల్సిన అవసరం ఏముందని షా ప్రశ్నించారు. ‘‘రాజ్యాంగాన్ని గౌరవించడంలో మోదీ ఆదర్శంగా నిలిచారు. ఆయనను సిట్‌ విచారించేటప్పుడు ఎవరూ ధర్నాలు చేయలేదు. దేశవ్యాప్తం గా ఉన్న మా కార్యకర్తలు సంఘీభావంగా ఆయన వెంట రాలేదు. ఆ సమయంలో నేనూ అరెస్టు అయ్యాను. అయినా.. మేమంతా చట్టానికి సహకరించాం. కనీసజ్ఞానం ఉంటే ఇప్పుడు ఈడీ విచారణపై చేస్తున్న ఆరోపణలకు క్షమాపణలు చెప్పా లి?’’ అని షా డిమాండ్‌ చేశారు. 1984 ఢిల్లీ సిక్కు అల్లర్ల సమయంలో అంతమంది సిక్కులు ఊచకోతలకు గురైనా మొదటి 3 రోజులు కాంగ్రెస్‌ ప్రభుత్వం కదల్లేదన్నా రు. ఇందుకు భిన్నంగా గుజరాత్‌ అల్లర్లు మొదలవ్వగానే మోదీ ప్రభుత్వం సైన్యాన్ని పిలిపించిందని గుర్తు చేశారు. 


బాధితులను వంచించిన తీస్తా

గుజరాత్‌ అల్లర్ల కేసులో సహ పిటిషనర్‌గా ఉన్న తీస్తా సెతల్వాద్‌పై అమిత్‌ షా తీవ్రస్వరంతో విరుచుకుపడ్డారు. ‘‘గుజరాత్‌ అల్లర్ల కేసులో సుప్రీంకోర్టు తీర్పును శ్రద్ధగా చదివాను. ఎన్జీవోను నడిపే తీస్తా సెతల్వాద్‌ను కోర్టు తప్పుబట్టింది. ఆమె నడిపే ఎన్జీవో పేరు నాకు గుర్తు లేదు. కానీ, ఆ ఎన్జీవో సంస్థ మత అల్లర్ల గురించి పోలీసులకు తప్పుడు సమాచారం ఇచ్చిందని తీర్పులో కోర్టు ఆక్షేపించింది’’ అని మండిపడ్డారు. గుజరాత్‌ మత అల్లర్లపై తీస్తా వంటి కొందరు ఎన్జీవోలు, ఒక సిద్ధాంతంతో రాజకీయం చేయాలని బయల్దేరిన జర్నలిస్టులు, బీజేపీ వ్యతిరేకులు కుమ్మక్కై అబద్ధాలను సత్యాలుగా ప్రచారం చేశారని, తమ చేతుల్లోని బలమైన వ్యవస్థలను వాడి ప్రతి ఒక్కరినీ నమ్మించగలిగారని అమిత్‌ షా విమర్శించారు. త్రికూటమిగా ఏర్పడిన ఈ శక్తుల కుమ్మక్కు పట్ల దేశంలోని 130 కోట్ల ప్రజలు మౌనంగా లేరని, 260 కోట్ల తమ కళ్లు, చెవులతో అంతా గమనిస్తూ.. అమూల్యమైన తమ తీర్పును గుజరాత్‌లో 20 ఏళ్లుగా అందిస్తూనే ఉన్నారని వ్యాఖ్యానించా రు. భర్తను కోల్పోయిన జకియా జాఫ్రీ భావోద్వేగాలను తీస్తా స్వార్థ ప్రయోజనాల కు వాడుకున్నారని, ఎవరో చెప్పినట్టు జకియా నడుచుకుంటున్నారన్న కోర్టు వ్యాఖ్యలను షా గుర్తు చేశారు. ‘‘బాధితులకు తెలపకుండానే వారి అఫిడవిట్లపై ఎన్జీవో (తీస్తా సంస్థ) సంతకాలు చేసేది. గుజరాత్‌ అల్లర్ల సమయంలో పోలీసులు, అధికారులు బాగా పనిచేశారు. కానీ, గోధ్రా రైలు తగలబడటంపై ప్రజలు అప్పుడు బాగా ఆగ్రహంతో ఉన్నారు. దీంతో పరిస్థితి చేయి దాటిపోయింది. ఇందుకు ఏ ఒక్కరినో తప్పుబట్టలేం’’ అని వివరించారు. భారీగా ఫీజులు ఇచ్చి న్యాయవాదులను బీజేపీ నియమించుకున్నదన్న ఆరోపణలను షా కొట్టివేశారు. అధిక ఫీజులు ఇచ్చి ఆమె (తీస్తా) ఎన్జీవోనే న్యాయవాదులను తెచ్చుకుందని విమర్శించారు.

Updated Date - 2022-06-26T07:56:21+05:30 IST