మోదీ 24 క్యారెట్ల బంగారం: రాజ్‌నాథ్

ABN , First Publish Date - 2021-10-30T00:21:40+05:30 IST

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 24 క్యారెట్ల బంగారం అని, ఆయన 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఒక్క అవినీతి..

మోదీ 24 క్యారెట్ల బంగారం: రాజ్‌నాథ్

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 24 క్యారెట్ల బంగారం అని, ఆయన 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఒక్క అవినీతి మచ్చ కూడా లేదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ''డెలివరింగ్ డెమోక్రసీ: ప్రభుత్వాధినేతగా నరేంద్ర మోదీ 2 దశాబ్దాల ప్రస్థానంపై సమీక్ష'' అనే అంశంపై జరిగిన జాతీయ సదస్సు ముగింపు సమావేశంలో రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారంనాడు మాట్లాడుతూ, మోదీ రెండు దశాబ్దాల రాజకీయ ప్రస్థానాన్ని ఒకసారి చూస్తే, ఎన్నో సవాళ్లు ఎదురుకావడం మనమంతా చూశామని, కానీ, ఆ సవాళ్లను ప్రధాని ఎదుర్కొన్న తీరు మేనేజిమెంట్ స్కూళ్లలో కేస్ స్టడీగా ఉపయోగపడుతుందని అన్నారు. సమర్ధవంతమైన నాయకత్వం, సమర్ధవంతమైన పాలన ఇందుకు కారణమని అన్నారు.


గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ ఉన్నప్పుడు రాష్ట్రాన్ని అభివృద్ధి బాట పట్టించారని, సమాజంలోని అన్ని వర్గాల కోసం పని చేశారని చెప్పారు. ''సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్'' అనే మంత్రంతో పనిచేసి, ప్రధానమంత్రి అయిన తర్వాత ''సబ్‌కా వికాస్, సబ్‌కా ప్రయాస్''గా దానిని మలిచారని ప్రశంసించారు. ''సబ్‌కా సాథ్ సబ్‌కా వికాస్'' మంత్రంతో నూతన అధ్యాయాన్ని లిఖించారని, ఎన్నో సంస్కరణలు, పథకాలు గుజరాత్‌లో ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. ప్రధాని మాటలకు, చేతలకు తేడా ఏమీ ఉంటుందని, భారత రాజకీయాల్లో విశ్వసనీయతా సంక్షోభాన్ని మోదీ సమర్ధవంతంగా ఎదుర్కొన్ని దాన్ని అధిగమించారని చెప్పారు. జాతి నిర్మాణంలో భాగంగా పరిశ్రమలను, ఔత్సాహికల పారిశ్రామికవేత్తలను గుర్తించి, వారికి గౌరవం కల్పించి, మద్దతుగా నిలిచిన ఘనత మోదీకే దక్కుతుందని రాజ్‌నాథ్ అన్నారు. ఉత్తరప్రదేశ్ సీఎంగా తాను, గుజరాత్ సీఎంగా మోదీ ఉన్నప్పటి నుంచి తమ మధ్య కొనసాగుతున్న చిరకాల అనుబంధాన్ని రాజ్‌నాథ్ ప్రస్తావిస్తూ, నిర్ణయాలు తీసుకోవడంలో మోదీకి ఉన్న సామర్థ్యం, ఊహాశక్తి తనను ఎంతో అబ్బురపరచేవని చెప్పారు.

Updated Date - 2021-10-30T00:21:40+05:30 IST