కార్పొరేట్ల సేల్స్‌మన్‌ మోదీ

ABN , First Publish Date - 2022-07-03T09:35:04+05:30 IST

‘‘కార్పొరేట్ల సేల్స్‌మన్‌ ప్రధాని మోదీ. ఆయనకు ముందు దేశానికి 14 మంది ప్రధానులుగా చేశారు.

కార్పొరేట్ల సేల్స్‌మన్‌ మోదీ

  • దేశ ప్రతిష్ఠను అంతర్జాతీయంగా దిగజార్చారు
  • శ్రీలంకలో ఓ వ్యాపారికి విద్యుత్తు కాంట్రాక్టు 
  • కట్టబెట్టేందుకు ప్రధాని హోదాలో ఒత్తిడి చేశారు
  • కార్పొరేట్‌కు సహకరించడానికే ‘బొగ్గు’ కొనుగోలు
  • మహారాష్ట్ర తరహాలో మా సర్కారును కూలుస్తారట
  • మేమూ ఎదురు చూస్తున్నాం.. అదే జరిగితే,
  • ఢిల్లీ గద్దె నుంచి బీజేపీని దించేస్తాం: సీఎం కేసీఆర్‌


హైదరాబాద్‌, జూలై 2 (ఆంధ్రజ్యోతి): ‘‘కార్పొరేట్ల సేల్స్‌మన్‌ ప్రధాని మోదీ. ఆయనకు ముందు దేశానికి 14 మంది ప్రధానులుగా చేశారు. కానీ, మోదీ హయాంలో దిగజారినట్లుగా ఏ ప్రధాని హయాంలోనూ దేశ ప్రతిష్ఠ దిగజారలేదు. ఒక వ్యాపారికి శ్రీలంకలో విద్యుత్తు కాంట్రాక్టు కట్టబెట్టేందుకు సేల్స్‌మన్‌ స్థాయికి మోదీ దిగజారారు. భారత ప్రధాని ఒత్తిడి మేరకే ఆ దేశ వ్యాపారికి కాంట్రాక్టు అప్పగించానంటూ శ్రీలంక పార్లమెంటు కమిటీ ముందు ఆ దేశ ఎలక్ట్రిసిటీ బోర్డు చైర్మన్‌ వెల్లడించారు. మాటకు ముందు, తర్వాత ‘భారత్‌ మాతాకీ జై’ అనే ప్రధాని మోదీ శ్రీలంకలో జరిగిన ఆందోళనలు, ఆయనపై వచ్చిన ఆరోపణలపై ఎందుకు మౌనం దాల్చారు!?’’ అంటూ సీఎం కేసీఆర్‌ ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లో నిర్వహించే బహిరంగ సభలో దీనిపై స్పందించాలని, లేని పక్షంలో ప్రధానిని దోషిగానే భావించాల్సి ఉంటుందని అన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న యశ్వంత్‌ సిన్హాను హైదరాబాద్‌కు ఆహ్వానించిన సీఎం కేసీఆర్‌.. శనివారం ఆయనకు బేగంపేట విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. అనంతరం జల విహార్‌లో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో ఏర్పాటు చేసిన సమావేశంలో యశ్వంత్‌కు సన్మానం చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ.. దేశంలో వందేళ్లకు సరిపడా బొగ్గు నిల్వలు ఉండగా విదేశాల బొగ్గు ఎందుకు దిగుమతి చేస్తున్నారని ప్రశ్నించారు. ‘‘పది శాతం మేర విదేశీ బొగ్గు కొనుగోలు చేయాలంటూ హుకుం ఎందుకు జారీ చేస్తున్నారు? మీ షావుకారుకు సహకరించడానికేనా?’’ అని నిలదీశారు. దీనిపైనా ఆదివారంనాటి బహిరంగ సభలో సమాధానం చెప్పాలని మోదీని డిమాండ్‌ చేశారు. ఎన్నికల ముందు దేశ ప్రజలకు ప్రధాని మోదీ ఇచ్చిన హామీల్లో అమలైనవి టార్చ్‌లైట్‌ పెట్టి వెతికినా కనిపించట్లేదని తప్పుబట్టారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని చెప్పి.. వ్యయం రెట్టింపు చేశారని మండిపడ్డారు. పెట్రోలు, డీజిల్‌, విద్యుత్తు, ఎరువుల ధరలు పెంచేశారన్నారు. ‘‘సాగు వ్యతిరేక చట్టాలపై 13 నెలలపాటు రైతులు ఆందోళనలు చేస్తే వారిపై ఉగ్రవాదులు, ఖలిస్థానీలన్న ముద్ర వేసే ప్రయత్నం చేశారు. ఉద్యమంలో 700 మంది రైతులు చనిపోతే.. వారి కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం రూ.3 లక్షల చొప్పున సాయం చేస్తే దాన్నీ చులకన చేశారు. సాగు చట్టాలు మంచివే అయితే వాటిని ఎందుకు ఉపసంహరించుకున్నారు. ఉపసంహరించేకునే ముందు రైతులు, దేశ ప్రజలకు క్షమాపణలు ఎందుకు చెప్పలేదు’’ అని ప్రశ్నించారు.


మోదీ సిగ్గుతో తల దించుకోవాలి

‘‘చైనా ప్రభుత్వం మాటల్లో తక్కువ, చేతల్లో ఎక్కువగా ఉంటుంది. అందుకే, ఆ దేశ ఎకానమీ 16 ట్రిలియన్‌ డాలర్లకు చేరుకుంది. మాటలు ఎక్కువ, చేతలు తక్కువగా ఉండే మోదీ హయాంలో భారత ఎకానమీ 3.1 ట్రిలియన్‌ డాలర్ల వద్దే ఉండిపోయింది. జీడీపీ పడిపోతుంటే ద్రవ్యోల్బణం పెరిగిపోతోంది. లక్షలాది మంది శ్రామికుల జీవితాలు రోడ్డునపడ్డాయి’’ అని ధ్వజమెత్తారు. మోదీ ప్రచారం చేసుకున్న మేకినిండియా శుద్ధ అబద్దమని కేసీఆర్‌ ధ్వజమెత్తారు. పరిశ్రమలు రావడం అటుంచి.. దేశంలో ఫియట్‌, ఫోర్డ్‌, జనరల్‌ మోటార్స్‌, యునైటెడ్‌ మోటార్స్‌, హార్లీ డేవిడ్సన్‌ తదితర పరిశ్రమలన్నీ వెళ్లిపోయాయని, దేశ వికాస్‌ అని చెబుతూ సర్వ నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. ‘‘బ్యాంకుల్లో ఎన్‌పీఏలు 18.6 లక్షల కోట్లకు పెరిగిపోయాయి. బ్యాంకులను ముంచే వారూ పెరిగి పోయారు. దేశ చరిత్రలోనే అత్యంత తక్కువకు డాలర్‌కు రూపాయి మారకం విలువ పడిపోయింది. ప్రభుత్వ రంగ పరిశ్రమలు, నవ రత్నాలనూ అమ్మేస్తున్నారు. వీటిపైనా ఆదివారం నాటి సభలో మోదీ సమాధానం చెప్పాలి’’ అని డిమాండ్‌ చేశారు. కరోనా కట్టడిలోనూ మోదీ ప్రభుత్వం విఫలమైందన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసిన యశ్వంత్‌ సిన్హాకు ఆత్మ ప్రభోదానుసారం ఓటేయాలంటూ దేశంలోని పార్లమెంటేరియన్లకు విజ్ఞప్తి చేశారు. ఆత్మ ప్రభోదానుసారం ఓటింగ్‌ జరగడం వల్ల వీవీ గిరి గెలిచారని గుర్తు చేశారు.


కూలిస్తే.. దించేస్తాం

కేంద్రంలో ప్రభుత్వ మార్పు అసంభవమేమీ కాదని, అది ప్రకృతి సహజంగానే జరుగుతుందని కేసీఆర్‌ అన్నారు. మార్పు రావాల్సింది విధానాల్లోనేనన్నారు. తాను శాశ్వత ప్రధానినన్న భావనలో మోదీ ఉన్నారని, కానీ, మార్పు తథ్యమని చెప్పారు. ‘‘ప్రజాస్వామ్యాన్ని, సమాఖ్య స్ఫూర్తిని కేంద్ర ప్రభుత్వం ఖూనీ చేస్తోంది. రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేస్తోంది. ఇప్పటికే 9 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చేసింది. శాసనసభలో 119 సీట్లకుగాను టీఆర్‌ఎ్‌సకు 104, మిత్రపక్షంకు ఏడు సీట్లున్నాయి. టీఆర్‌ఎస్‌ సర్కారు మహారాష్ట్ర తరహాలో కూలిపోతుందంటూ ఓ బీజేపీ నేత మాట్లాడుతున్నారు. మేమూ ఎదురు చూస్తున్నాం. అదే జరిగితే, ఢిల్లీ గద్దె నుంచి బీజేపీని దించేస్తాం’’ అని హెచ్చరించారు. 

Updated Date - 2022-07-03T09:35:04+05:30 IST