మోదీ తలచుకుంటే పాక్ క్రికెట్ బోర్డు పని ఖతం

ABN , First Publish Date - 2021-10-08T21:49:20+05:30 IST

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్‌గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఆ దేశ మాజీ క్రికెటర్ రమీజ్ రాజా సంచలన వ్యాఖ్యలు

మోదీ తలచుకుంటే పాక్ క్రికెట్ బోర్డు పని ఖతం

ఇస్లామాబాద్: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్‌గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఆ దేశ మాజీ క్రికెటర్ రమీజ్ రాజా సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇండియా, ఆ దేశ క్రికెట్ బోర్డు బీసీసీఐ తమ దేశ క్రికెట్ బోర్డుపై గట్టి పట్టు సాధిస్తున్నాయని అన్నాడు. ఐసీసీ నుంచి పీసీబీకి నిధులు అందకూడదని కనుక భారత ప్రధాని నరేంద్రమోదీ నిర్ణయించుకుంటే పీసీబీ కుప్పకూలడం ఖాయమన్నాడు. 


పాకిస్థాన్ సెనేట్ స్టాండింగ్ కమిటీ సమావేశంలో రమీజ్ రాజా మాట్లాడుతూ.. ఐసీసీ నుంచి పీసీబీకి 50 శాతం నిధులు వస్తున్నాయని, బీసీసీఐ నుంచి ఐసీసీకి 90 శాతం నిధులు అందుతున్నాయని  అన్నాడు. ఈ లెక్కన చూసుకుంటే భారత వ్యాపార సంస్థలే పాక్ క్రికెట్‌ను నిర్వహిస్తున్నట్టు అర్థమని పేర్కొన్నాడు. ఒకవేళ భారత ప్రధాని నరేంద్రమోదీ కనుక పాకిస్థాన్‌కు నిధులు ఇవ్వొద్దని నిర్ణయించుకుంటే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కుప్పకూలడం ఖాయమని ఆందోళన వ్యక్తం చేశాడు.


రమీజ్ రాజా ఇటీవల ఓ సందర్భంలో మాట్లాడుతూ.. పాకిస్థాన్ క్రికెట్ ఐసీసీ నిధులపైనే ఆధారపడి కాలం వెళ్లదీస్తోందని, ఒకవేళ ఏదైనా కారణంతో అది కనుక నిధులు ఆపేస్తే కష్టాలు తప్పవని పేర్కొన్నాడు. ప్రపంచ క్రికెట్‌లో పాకిస్థాన్ సూపర్ పవర్‌గా ఎదగాలంటే సహకారం తప్పనిసరి అని స్పష్టం చేశాడు. పాక్ క్రికెట్‌కు స్థానిక వ్యాపారవేత్తల నుంచి అందుతున్న సహకారం చాలా తక్కువని రమీజ్ రాజా ఆవేదన వ్యక్తం చేశాడు.

Updated Date - 2021-10-08T21:49:20+05:30 IST